ఫేస్ స్కాన్ ఆలోచనను పక్కన పెట్టిన అమెరికా ప్రభుత్వం

By Newsmeter.Network  Published on  8 Dec 2019 9:32 AM GMT
ఫేస్ స్కాన్ ఆలోచనను పక్కన పెట్టిన అమెరికా ప్రభుత్వం

ముఖ్యాంశాలు

  • ప్రయాణికుల ముఖాలను స్కాన్ చేయాలని యూఎస్ ప్రభుత్వ ప్రతిపాదన
  • వ్యతిరేకించిన యూఎస్ పౌర హక్కుల సంఘం
  • పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని వాదన
  • మొదట యూఎస్ పౌరులకు మాత్రం మినహాయింపునిచ్చిన ట్రంప్ ప్రభుత్వం
  • అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆలోచనకు తీవ్ర వ్యతిరేకత
  • ప్రస్తుతానికి మొత్తంగా ఈ ఆలోచనను పక్కన పెట్టి డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం

శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికాకు వచ్చిపోయే అంతర్జాతీయ ప్రయాణికుల ముఖాలను స్కాన్ చేయాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి డోనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా ప్రభుత్వం పక్కన పెట్టింది. నిజానికి వచ్చే జూలైనుంచి ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కార్యక్రమం అమలుకు నోచుకోవాల్సింది. అమెరికా పౌరులతో సహా దేశంలోకి వచ్చిపోయేవారందరి ముఖాలనూ సరిహద్దు భద్రత, దేశ రక్షణ, పటిష్టమైన భద్రతాచర్యల రీత్యా స్కాన్ చేయాలన్న నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం తీసుకుంది.

అమెరికన్ పౌర హక్కుల సంఘం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొంది. పౌర హక్కుల సంఘం నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదురైన తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం అమలులో కొంత వెనక్కు తగ్గి అమెరికన్ పౌరులకు మాత్రం దీనినుంచి మినహాయింపు ఇవ్వాలని భావించింది.

ఫేస్ స్కాన్ వల్ల తప్పుడు ధృవీకరణ పత్రాలతో అమెరికాలో ప్రవేశించేవారిని, నేరస్తులను, అనుమానితులను, ఉగ్రవాదులను గుర్తించడం ఈ ప్రక్రియవల్ల అత్యంత సులభతరమవుతుందన్న వాదనను ట్రంప్ ప్రభుత్వం బలంగా వినిపించింది. అయితే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక విధివిధానాల రూపకల్పనలో ఎదురైన కొన్ని సాంకేతిక కారణాలు, అభ్యంతరాల రీత్యా ప్రస్తుతానికి మొత్తంగా ఈ ఆలోచనను పక్కన పెట్టినట్టు యూఎస్ అధికార ప్రతినిధులు చెబుతున్నారు.

Next Story