దేవుడైనా.. దేవాలయమైనా చట్టానికి లోబడే..!

By అంజి  Published on  21 Jan 2020 5:07 AM GMT
దేవుడైనా.. దేవాలయమైనా చట్టానికి లోబడే..!

హైదరాబాద్‌: దేవుడైనా, దేవాలయమైన రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేని రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడి పేరుతో అక్రమంగా ఆలయాలను నిర్మిస్తే ఒప్పుకోమని హైకోర్టు తెలిపింది. ఓ పార్కులో ఆలయాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని మాధవపురిహిల్స్‌లోని రాక్‌గార్డెన్‌లో ఆలయం నిర్మిస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హ్యుమన్‌ రైట్స్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అనే సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. దేవాలయ కమిటీపై ఏం చర్యలు తీసుకున్నారని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దేవుడిని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేయాలని ఆదేశించింది. ఈ విచారణకు అమీన్‌పూర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి హాజరయ్యారు.

ఆలయ అక్రమ నిర్మాణంపై 2017లో పిటిషనర్లు ఇచ్చినా వినతి పత్రం ఎందుకు తీసుకోలేదని ఈవోని ప్రశ్నించింది. పోలీసులకు వినతిపత్రం ఇచ్చామని చెప్తున్నారు. మాధవపురిహిల్స్‌ రెసిడెంట్స్‌ సంక్షేమ సంఘానికి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారని అంటున్నారు. అసలు ఎస్సై చర్య తీసుకోనప్పుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారా అని హైకోర్టు అడిగింది. మీరు ఆలయ కమిటీతో, రెసిడెంట్స్‌ సంఘంతో కుమ్మక్కయ్యారనేది అసలు విషయమని హైకోర్టు వ్యాఖ్యనించింది. కుంటి సాకులు, కట్టుకథలు చెప్పడం కాకుండా.. వెంటనే వెళ్లి ఆలయాన్ని కూల్చేయాలని ఈవోను హైకోర్టు ఆదేశించింది.

ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే డీజీపీ సహాయం తీసుకోవాలని సూచించింది. కాగా ఆలయ కమిటీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తాము చేస్తున్నది మంచిపనేనని, సేవ కార్యక్రమాలు చేస్తున్నామని, దాతృత్వ భావంతో మంచి పనులు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. మంచి పనులు కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తే కుదరదని హైకోర్టు ఘాటుగా స్పష్టం చేసింది. దేవుడి విగ్రహం, దేవాలయయం మైనర్లని ఆలయ కమిటీ తరఫు న్యాయవాది పేర్కొన్నాడు. దేవుడిని రికార్డులోకి తీసుకురావాలంటూ కోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.

Next Story