అమెజాన్ అడవుల్లో అగ్గికి ఆ నటుడే కారణం
By Newsmeter.Network
ఏడు చేపలు ఎందుకు ఎండలేదంటే పిల్లవాడు చీమకుట్టి ఏడ్వటం వల్లేనన్న రాజుగారు, ఏడుగురు చేపల కథ మనం విన్నాం. అమెజాన్ అడవుల్లో అగ్గి ఎందుకు రాజుకుందని అడిగితే బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనోరో ఇలాంటి కథే చెబుతున్నాడు. దీనికి కారణం హాలీవుడ్ నటుడు లియొనార్డో డికాప్రియో యే అని ఆయన వాదిస్తున్నాడు. ఇది బట్టతలకు బోడి గుండుకు ముడిపెట్టడమేనని వ్యతిరేకులు విమర్శిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు. బోల్సనరో ఇదే కథ చెబుతున్నాడు.
బోల్సనరో ... బోల్సనరో... అమెజాన్ లో అడవి ఎందుకు మండిపోతుంది?
అమెజాన్ లో అగ్గిరాజుకుంది. అందుకే మండిపోతుంది.
బోల్సనరో ... బోల్సనరో... అగ్గి ఎందుకు అంటుకుంటోంది?..
స్వచ్ఛంద సంస్థల వాళ్లు నిప్పంటిస్తున్నారు.
బోల్సనరో ... బోల్సనరో... స్వచ్ఛంద సంస్థలు ఎందుకు నిప్పంటిస్తున్నారు?
వాళ్లకు డబ్బులు బోలెడు వస్తున్నాయి కాబట్టి.
బోల్సనరో ... బోల్సనరో ... వారికి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి?..
వారికి హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో విరాళాలు ఇస్తున్నాడు కాబట్టి.
అయితే లియోనార్డో డికాప్రియో మాత్రం బోల్సనరో చెబుతున్న రెండు స్వచ్ఛంద సంస్థలకు తాను విరాళాలు ఇవ్వడమే లేదని, అడవిలో మంటలకు తనకూ ఎలాంటి సంబంధమూ లేదని ఆయన కుండ బద్దలుగొట్టాడు. తాను పర్యావరణ వాదినని, పర్యావరణ రక్షణ కోసం పాటుపడతానని డికాప్రియో ప్రకటించారు. కానీ ఈ సంస్థలకు తనకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు.
కానీ బొల్సనరో మాత్రం ఇదే కథను ప్రతి సభలో, సమావేశంలో, పార్టీ కార్యకర్తల మీటింగ్ లలో చెబుతూనే ఉన్నాడు. ఆఖరికి ఫేస్ బుక్ లో పోస్టులు కూడా పెడుతున్నాడు.