ముఖ్యాంశాలు

  • ఆరుగురు తెల్లరేషన్ కార్డు దారులపై అభియోగాలు
  • సీఐడీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయమై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అధికార పక్షం ఆరోపిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సి.ఐ.డి. ఆరుగురు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అమరావతి దగ్గర కొన్ని కోట్ల విలువైన భూములను కొన్నారని అభియోగాలు నమోదయ్యాయి. దీంతో కేసులు సి.ఐ.డి. దాకా వెళ్ళింది. ఆరుగురు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కోట్ల విలువైన భూమిని కొన్నారని తేలడంతో కేసులు నమోదయ్యాయి. వీరు తప్పుడు సమాచారం అందించి ప్రభుత్వాన్ని మోసం చేశారని తేలింది. మొత్తం 797 బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ 761 ఎకరాల భూమిని కొన్నారని సి.ఐ.డి. విచారణలో తేలింది. వీటి విలువ 220 కోట్లకు పైగానే..!

తెల్ల రేషన్ కార్డు దారుల భూముల వివరాలు

తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిలో అబ్దుల్ జమీందార్ అనే వ్యక్తికి మంగళగిరి మండలంలోని రాయపూడిలో ఒక ఎకరా భూమి ఉందని తెలిపారు.. విచారణలో మాత్రం గంగూరు గ్రామంలో ఒక అంతస్థు మేడ ఉన్నట్లు తేలింది. రెండో కేసులో పోలినేని కొండల రావు నెలపాడు లోని తన ఒక ఎకరాను ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా ఇవ్వగా 1078 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 200 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ సొంతం చేసుకున్నారు. ఇక మరో కేసులో మండవ నాగమణికి 0.95 సెంట్ల భూమి వెంకటపాలెంలో ఉంది.. విచారణలో మాత్రం ఆమెకు పోరంకి లోని పద్మనాభపురంలో రెండంస్థుల మేడ ఆమెకు ఉంది. ఇంకొక కేసులో మండవ అనురాధ మంగళగిరి లోని వెంకటపాలెంలో ఒక ఎకరం కొనుక్కుంది. ఆమెకు కానూరులో డూప్లెస్ హౌస్ ఉన్నట్లు విచారణలో తేలింది.

మరొక తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అయిన బొల్లినేని నరసింహ రావు 0.42 సెంట్ల భూమి కొన్నాడు. అతను రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అని, రెండు అంతస్థుల బిల్డింగ్ కూడా ఉందని విచారణలో తేలింది. ఇక తెల్ల రేషన్ కార్డు ఉందని చెప్పుకుంటూ ఉన్న భూక్యా నాగమణికి 0.25 సెంట్ల భూమి తూళ్లూరులోని నెలపాడు వద్ద ఉంది. తీరా చూస్తే ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తోంది. అలాగే ఆమె భర్త విజయవాడ లోని థర్మల్ పవర్ స్టేషన్ లో ఏఈగా పనిచేస్తున్నాడు. ఓ దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ టీడీపీ మంత్రులు అయిన పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలపై సిఐడీ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణా రెడ్డి ఆందోళన చేస్తున్న రైతులతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మీరంతా కలిస్తే బాగుంటుందని.. ఆయనకు మీ సమస్యలు చెబితే తీరుస్తారని.. టీడీపీ నేతలు చెప్పిన మాటలు విని మోసపోకండని ఆయన అన్నారు. రాజధాని విషయంలో తలదూర్చమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పేసిందని చంద్రబాబు మాటలు విని ఆందోళన చేయకూడదని హితవు పలికారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.