ఇండియా మ్యాప్‌లో భూతద్దం వేసి వెతికినా కనబడని అమరావతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 7:28 AM GMT
ఇండియా మ్యాప్‌లో భూతద్దం వేసి వెతికినా కనబడని అమరావతి..!

అంతన్నారు..ఇంతన్నారు ఇండియా మ్యాప్‌లో అమరావతిని లేకుండా చేశారు.అమరావతిని ప్రపంచ పటంలో పెడతానన్నారు ఇండియా మ్యాప్‌లోనే లేకుండా చేశారు. అమరావతిని సింగపూర్ చేస్తామన్నారు. అమరావతిని వాషింగ్టన్ చేస్తామన్నారు. అమరావతిని టోక్యో చేస్తామన్నారు. ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశంలోలా అమరావతిని నిర్మిస్తానని అరచేతిలో స్వర్గం చూపించేవారు.అమరావతి కోసం దాదాపు 50వేల ఎకరాలు భూమి సేకరించారు. వేల కోట్లు ఖర్చు పెట్టి భవనాలు నిర్మించామని చెబుతున్నారు. ఒక్కటంటే ఒక్కటీ శాశ్వత భవనం అమరావతిలో ఉందా..?

ఇండియా మ్యాప్‌లో రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కొత్తగా చేరాయి. ఒక్కటి జమ్ముకశ్మీర్, రెండోది లడాఖ్, ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ నాలుగు ఇండియా మ్యాప్‌లు విడుదల చేసింది. అందులో ఇండియా పొలిటికల్ మ్యాప్ ఒక్కటి. దీనిలో అన్ని రాష్ట్రాలతోపాటు వాటి రాజధానులు సూచించేలా ఉంది. రాష్ట్రాల రాజధానులను రెడ్ కలర్‌లో కనబడేలా చేశారు. అలాగే..కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా ఈ మ్యాప్‌లో హైలెట్ చేశారు.అంతా బాగానే ఉంది. కాని..ఈ మ్యాప్‌లో ఆంధ్రుల రాజధాని అమరావతి లేదు. ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌ను చూపించారు. అమరావతిని మాత్రం చూపించలేదు. దీనిలో గూడార్ధం ఏమైనా ఉందా..?లోగుట్టు ఏమైనా ఉందా?

అమరావతి ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలతో మునిగిపోయింది. వైఎస్‌ఆర్ సీపీ ప్రతిపక్షంలోనూ, ఇప్పుడూ అమరావతిపై సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే మంత్రి బొత్స అమరావతి రాజధానిగా కొనసాగే విషయంలో ఇండైరక్ట్ కామెంట్స్ చాలా చేశారు. అమరావతిని మార్చాలనే ఆలోచనలో వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం మనసులో ఉందా..? ఈ విషయం కేంద్రానికి తెలుసా?. అందుకే..అమరావతిని ఇండియా మ్యాప్‌లో చూపించలేదా..?

చంద్రబాబు నాయుడు ఒక సామాజికవర్గం వారికి అనుకూలంగా రాజధాని నిర్మాణం చేపట్టారని వైఎస్ఆర్ సీపీ విమర్శలు చేస్తుంది. అంతేకాదు..రాజధానిలో భూములు కూడా ఒక వర్గం ఆధీనంలో ఉన్నాయనేది వైఎస్ఆర్ సీపీ ఆరోపణ. తన సామాజికవర్గాన్ని రక్షణ కవచంలా పెట్టుకుని బాబు రాజధానిని డిజైన్ చేయించారని మొదటి నుంచి వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇండియా మ్యాప్‌లో కేంద్ర ప్రభుత్వం అమరావతిని చూపించకపోవడాన్ని కచ్చితంగా చంద్రబాబు పని తీరును, మాటలను ప్రశ్నించేలా చేస్తుంది. దీనిపై ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్ కూడా చేశారు. "మోసం చంద్రబాబు సహజ గుణం" అంటూ మండిపడ్డారు కన్నా.



Next Story