చంద్రబాబుతో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధుల భేటి

By రాణి  Published on  24 Dec 2019 1:49 PM GMT
చంద్రబాబుతో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధుల భేటి

ముఖ్యాంశాలు

  • సీజన్ కొక అసెంబ్లీ..ప్రాంతానికో రాజధాని
  • రాజధానికి అమరావతే కరెక్ట్ అన్న జగన్ స్వరం ఎందుకు మారింది
  • వైసీపీ ఎమ్మెల్యేలు నోరెందుకు మెదపట్లేదు ?

అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడితో భేటి అయ్యారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రబాబు ఎదుట ధ్వజమెత్తారు. విద్యావంతుల కమిటి ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. విశాఖలో ఏర్పాటు చేసేది రాజధాని కాదు, అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమేనని ఆరోపించారు. సీఎం కావడానికి ముందు రోజునుంచే జగన్ అమరావతిని స్లో పాయిజన్ ఇచ్చి చంపడం ప్రారంభించారన్నారు. గేట్లెత్తితే పోయే నీళ్లను ఆపేసి ప్రతిపక్ష నేత ఇంటిమీదకు మళ్లించి అమరావతిని ముంపు ప్రాంతంగా చూపాలని చూశారని, అప్పటి నుంచే విశాఖలో తన ఏర్పాట్లన్నీ తాను చేసుకున్నాడని ధ్వజమెత్తారు. వేల ఎకరాలు తనవాళ్లతో ఆక్రమించిన జగన్ ఏ వ్యవస్థనూ లెక్కచేసే స్థితిలో లేరన్నారు.

బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లు సౌత్ ఆఫ్రికా 3 రాజధానుల ఉదాహరణను ఏపీ కి చూపిస్తారా..? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. సింగపూర్, అమెరికా, జపాన్ సరసన ఏపీని నిలబెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపిని ఇథియోపియాతో, సోమాలియాతో, సౌతాఫ్రికా సరసన నిలబెడుతున్నారన్నారు. దళిత నియోజకవర్గంలో, 40% దళిత జనాభా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు రాజధానిని పెడితే, ఆ ప్రాంతంపై కమ్మముద్ర వేసి దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కులాన్ని టార్గెట్ చేసి అమరావతిని చంపేశానన్న సంబరాల్లో జగన్ ఉన్నారని, 6 నెలల్లో ఆయన చేసిన నియామకాల మాటేమిటి..? అని ప్రశ్నించారు. మాల మాదిగ, రెల్లి తప్ప మిగిలిన అన్ని కార్పొరేషన్లకు తన కులం వారినే ఛైర్మన్లుగా చేశారని శ్రీనివాస్ విమర్శించారు. గతంలో హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ,సాలార్ జంగ్ మ్యూజియం చారిత్రక అవశేషాల నగరం... ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, హైటెక్ సిటి, సైబర్ టవర్స్, అవుటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లతో దానిని లాజిస్టిక్స్ హబ్ గా, ఉపాధి నగరంగా చేసింది చంద్రబాబే అని కొనియాడారు.

ఉత్తరాంధ్రవాళ్లు కర్నూలుకు వెళ్లాలా ?

శివారెడ్డి(క్రెడాయ్) మాట్లాడుతూ..అందరితో చర్చించాకే చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయాన్ని అప్పటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి కూడా స్వాగతించారని గుర్తుచేశారు. ఇప్పటికే చిన్నరాష్ట్రం, ఇంకా విభేదాలు తేకూడదు, మరిన్ని ముక్కలు కాకూడదు, ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేకే రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానంటూ, గొప్పనగరం కట్టాలంటే 30వేల ఎకరాలు కావాలని కూడా జగనే అడిగారన్నారు. అలాంటిది ఇప్పుడు వైసిపి ప్రజాప్రతినిధులు మాట్లాడలేని పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. 4 ఏళ్ల తరువాత మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలోనే ఉండాలి. అధికారంలో ఒకలా, ప్రతిపక్షంలో ఒకలా మాట్లాడటం సరికాదని శివారెడ్డి హితవు పలికారు. మౌనంగా ఉంటే సమాజానికే నష్టమని, పరిపాలకుడికి ధర్మగుణం, న్యాయ స్వభావం ఉండాలన్నారు. ఆ రోజు ఇక్కడ రాజధాని పెట్టమని ఈ ప్రాంతం వాళ్లు అడగలేదు. కానీ ఈ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాలవారు స్వాగతించారు. ఇప్పుడీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాయలసీమ వాళ్లు విశాఖకు వెళ్లాలా..? ఉత్తరాంధ్రవాళ్లు కోర్టుకు కర్నూలు వెళ్లాలా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మాకు 25 సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా సాధిస్తానని ఆ రోజు చెప్పి, 22 మంది ఎంపీలను ఇచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎత్తకుండా, 3 రాజధానుల పల్లవి అందుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండియాకే ఒక రాజధాని..ఏపీకి మూడు రాజధానులా

డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ.. ''ఇండియాకే ఒక రాజధాని ఉంటే ఏపికి 3 రాజధానులా..? ఎటువంటి హింస లేకుండా 34వేల ఎకరాల భూములు ఇవ్వడం చరిత్రలో లేదు. విశాఖ, నెల్లూరులో పోర్టులు, సీమలో పరిశ్రమలు, అమరావతిలో రాజధాని, తిరుపతిలో హార్డ్ వేర్ హబ్, కర్నూలులో సీడ్ హబ్, కడపలో సోలార్ విండ్ పవర్ ప్లాంట్లు, గోదావరిలో అగ్రి ఇండస్ట్రీలు ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు అభివృద్ది చేస్తే..దానిని కొనసాగించకుండా ఈ విధంగా రాజధాని మార్పుపై రకరకాల ప్రకటనలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.

డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ...మనిషికి ఒకటే తల ఉంటుంది. అలాగే ఒకే రాజధాని ఉండాలి. సీజన్ కో అసెంబ్లీ, ప్రాంతానికో కేపిటల్ సరైన నిర్ణయం కాదన్నారు. రైతులే ఈ 5 జిల్లాలకు ఆధారమని, భూమి వాళ్లకు కన్నతల్లిలాంటిదని.. అలాంటిది రైతులకు అన్యాయం చేయడం బాధాకరమన్నారు.

Next Story
Share it