సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రేసులో అగార్కర్‌..!

By Newsmeter.Network  Published on  25 Jan 2020 6:45 AM GMT
సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రేసులో అగార్కర్‌..!

టీమిండియా మాజీ క్రికెటర్‌ అజిత్ అగార్కర్‌ జాతీయ సెలక్షన్‌ కమిటీకి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని అగార్కరే స్వయంగా వెల్లడించాడు. ముంబాయి సీనియర్‌ సెలక్షన్‌ కమిటీకి చైర్మన్‌ గా పనిచేశాడి మాజీ ఫాస్ట్ బౌలర్‌. సెలక్షన్‌ కమిటీలో అగార్కర్ చైర్మన్‌ పదవి రేసులో ముందున్నాడు. లక్మణ్ శివరామకృష్ణన్‌ అతడికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.

టీమిండియా తరుపున 26 టెస్టులు, 191 వన్డేలు, 3టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు తీసుకున్నాడి మాజీ పేసర్‌. పరిమిత ఓవర్లలో 288 వికెట్లు తీసి భారత్‌ తరుపున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌ గా నిలిచాడు. అనిల్‌ కుంబ్లే 334 వికెట్లు, జవగల్ శ్రీనాథ్ 315 వికెట్లతో అతకన్నా ముందు ఉన్నారు. ఇక తానాడే రోజుల్లో వేగవంతంగా 50 వన్డే వికెట్లు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. 23 మ్యాచుల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.

ప్రస్తుత కమిటీలో పదవీకాలం పూర్తి చేసుకున్న సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్‌‌ (సౌత్‌‌ జోన్‌‌), సెలెక్టర్ గగన్‌‌ ఖోడా (సెంట్రల్‌‌ జోన్‌‌) స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుండగా సందీప్‌‌ సింగ్‌‌ (నార్త్‌‌ జోన్‌‌), జతిన్‌‌ పరాంజపే (వెస్ట్‌‌ జోన్‌‌), దేవాంగ్‌‌ గాంధీ (ఈస్ట్‌‌ జోన్‌‌) మరో ఏడాది కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఒకవేళ క్రికెట్‌ సలహా కమిటీ ని మెప్పించి అగార్కర్‌ జాతీయ సెలక్షన్‌ కమిటీకి ఎంపికైతే.. వెస్ట్ జోన్‌ నుంచి ఇద్దరు సెలక్టర్లు కొనసాగనున్నారు.

సెలక్టర్‌ కమిటీకి దరఖాస్తు చేసుకున్న మాజీలు..

అజిత్ అగార్కర్‌(ముంబై), చేతన్‌ శర్మ(హరియాణా), నయాన్‌ మోంగియా(బరోడా), లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌(తమిళనాడు), రాజేశ్‌ చౌహాన్‌( మధ్యప్రదేశ్‌), అమే ఖురేషియా(మధ్యప్రదేశ్‌), గ్యానేంద్ర పాండే(యూపీ), ప్రీతమ్ గాంధే (విదర్భ), వెంకటేశ్ ప్రసాద్ (కర్ణాటక)

Next Story