భారత యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్ చాన్నాళ్లుగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అటు పరిమిత ఓవర్ల క్రికెట్ లో  కేఎల్ రాహుల్.. ఇటు సుదీర్ఘ ఫార్మాట్‌లో వృద్ధిమాన్‌ సాహా ఉండడంతో పంత్ కు అవకాశాలు దక్కడం లేదు. రాకరాక న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అవకాశం వచ్చింది. టీమిండియా 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రిషబ్‌ పంత్ (19; 53 బంతుల్లో 1 పోర్‌, 1సిక్స్‌) బ్యాటింగ్‌కు వచ్చాడు. వైస్‌ కెప్టెన్‌ రహానేతో కలిసి కీలక బ్యాగస్వామ్యాన్ని నిర్మించే బాధ్యతను భూజానికి ఎత్తుకున్నాడు. కివీస్ పేసర్లకి ఎదురునిలిచిన ఈ జోడీ ఏకంగా 103 బంతులు ఎదుర్కొంది. అయితే రహానే తప్పిదం కారణంగా పంత్ రనౌట్‌ అయ్యాడు. దీంతో 31 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పంత్ వికెట్‌ పడిన అనంతరం టీమిండియా పేకమేడలా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

అసలేం జరిగింది..

ఇన్నింగ్స్ 59వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ బౌలింగ్ బంతిని పాయింట్ దిశగా నెట్టిన అజింక్య రహానె సింగిల్ కోసం రిషబ్ పంత్‌ని పిలిచాడు. పంత్ స్పందించి.. వేగంగా రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ.. అప్పటికే బంతి ఫీల్డర్ అజాజ్ పటేల్ చేతుల్లోకి వెళ్తుండంతో అనూహ్యంగా వెనక్కి తగ్గాడు. కానీ.. అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన రహానె.. అలానే నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తడంతో రిషబ్ పంత్‌కి స్ట్రైకింగ్ ఎండ్‌వైపు పరుగెత్తడం తప్ప మరో ఆప్షన్ లేకపోయింది. అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ అజాజ్ వికెట్లపైకి దాన్ని విసరడంతో పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు.

మొదటి సారీ..

2013 నుంచి ఇప్పటి వరకు అజింక్య రహానే 64 టెస్టులు టెస్టులు ఆడాడు. ఇలా ఓ రనౌట్‌లో భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఇక్కడ పంత్‌ కంటే రహానె తప్పిదమే ఎక్కువగా కనిపిస్తోంది. పంత్ వెనుకంజ వేయగానే రహానె మళ్లీ వెనక్కి వెళ్లేందుకు తగిన సమయం ఉన్నట్లు కనిపించింది. కానీ.. అతను మొండిగా ముందుకు వెళ్లడంతో పంత్ తన వికెట్‌ని త్యాగం చేయాల్సి వచ్చింది.

రహానేతో పాటు రోహిత్‌ శర్మలు ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో రనౌట్‌లో భాగస్వామ్యం కాలేదు. ఇక పంత్‌ రనౌట్‌కు రహానే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నెలకు పైగా రిజర్వ్‌ బెంచ్‌పైనే ఉన్నాడు.. పచ్చని పచ్చికపై ఆడే అపూర్వ అవకాశం దక్కింది. కానీ సీనియర్‌ ప్లేయర్‌ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు.

కుప్పకూలింది..

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 122/5 తో రెండో రోజు ఇన్నింగ్‌ ఆరంభించిన కోహ్లి సేన మరో 43 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. పట్టుమని 15 ఓవర్లు కూడా టీమిండియాను బ్యాటింగ్‌ చేయనీయలేదు కివీస్‌ బౌలర్లు. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (138 బంతుల్లో 46; 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (19)లు తీవ్రంగా నిరాశపరిచారు.

ముఖ్యంగా పంత్‌ రనౌట్‌ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అశ్విన్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా, షమీ(20 బంతుల్లో 21; 3ఫోర్లు) ధాటిగా ఆడటంతో తొలి టెస్టు మ్యాచ్‌లో 165 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిపోయింది. కివీస్ బౌలర్లలో సౌతీ, జేమీసన్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.