ఏపీలో ఎయిర్ ఇండియా సర్వీసుల పునరుద్ధరణ

By Medi Samrat  Published on  15 Oct 2019 7:56 AM GMT
ఏపీలో ఎయిర్ ఇండియా సర్వీసుల పునరుద్ధరణ

ముఖ్యాంశాలు

  • విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై స్పందిస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ లేఖ

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు విజయవాడ-తిరుపతి- వైజాగ్, విజయవాడ- షిర్డీ, విజయవాడ- బెంగుళూరు రూట్లలో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీ వైసీపీ సీనియ‌ర్ నేత‌ వి. విజయసాయి రెడ్డికి రాసిన లేఖలో తెలిపారు.

ఎయిర్ ఇండియా గత జూలైలో ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక రూట్లలో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నిర్ణయం విమాన ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో విజయసాయి రెడ్డి ఎయిర్ ఇండియా చైర్మన్ లొహానీతో భేటీ అయ్యారు. రద్దు చేసిన విమాన సర్వీసులను సత్వరమే పునరుద్ధరించడంతోపాటు వైజాగ్- విజయవాడ- బెంగుళూరు, వైజాగ్-విజయవాడ- తిరుపతి మధ్య డైలీ విమాన సర్వీసులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే విజయవాడ, వైజాగ్, తిరుపతి, విజయవాడ- షిర్డీ, విజయవాడ- బెంగుళూరు మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని కూడా కోరుతూ విజయసాయి రెడ్డి ఎయిర్ ఇండియా చైర్మన్ లొహానీకి లేఖ రాశారు. ఆ లేఖకు లొహానీ ప్రత్యుత్తరమిస్తూ.. ప్రస్తుతం ఢిల్లీ- విజయవాడ మధ్య వారానికి మూడుసార్లు నడుపుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసును అక్టోబర్ 27 నుంచి ఢిల్లీ- విజయవాడ- తిరుపతి- విజయవాడ- ఢిల్లీ సర్వీసుగా నడపనున్నట్లు తెలియచేశారు.

తన విజ్ఞప్తికి స్పందించి ఆంధ్ర ప్రదేశ్ లో రద్దు చేసిన విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించడం పట్ల విజయసాయి రెడ్డి హర్షం ప్రకటించారు. ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీకి ఆయన ధన్యవాదాలు తెలియచేశారు.

Next Story
Share it