'డ్రోన్' సాయంతో వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు...

By Newsmeter.Network  Published on  19 Dec 2019 9:56 AM GMT
డ్రోన్ సాయంతో వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు...

ముఖ్యాంశాలు

  • డ్రోన్ సాయంతో పొలంలో పురుగుమందుల పిచికారీ
  • ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఆధునిక రైతు లెనిన్
  • అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాల్ని సాధించిన రైతు
  • వృథాను పూర్తిగా నిరోధించడానికి వీలవుతుంది
  • పెళ్లిలో డ్రోన్ సాయంతో ఫోటోలు తీయడం చూసిన రైతు
  • డ్రోన్ ను అద్దెకు తీసుకుని పెస్టిసైడ్ పిచికారీ సాహసం
  • పూర్తి స్థాయిలో ఫలించిన ఆదర్శ రైతు ప్రయత్నం
  • చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విస్తృత రీతిలో ప్రచారం
  • కడప జిల్లాలో ఫలించిన వినూత్న ప్రయోగం

వ్యవసాయం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఖర్చుల్ని తట్టుకోవడం వ్యవసాయదారులకు కష్టంగా ఉంది. ముఖ్యంగా లేబర్ చార్జీలు మోత మోగిస్తున్నాయి. పైగా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా వ్యవసాయ కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఈ దశలో రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసుకునేందుకు వీలు కల్పించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయం.

ఇప్పటివరకూ మనం పెళ్లిళ్లలో కెమెరాలను అమర్చి ఫోటోలు తీయడానికి మాత్రమే డ్రోన్ లను వాడడాన్ని చూసి ఉంటాం. కానీ ఇకపై పొలంలో పురుగుమందులు చల్లడానికి కూడా డ్రోన్ లను ఉపయోగించగలిగే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. దీనివల్ల లేబర్ ఖర్చు మిగలడంతోపాటుగా, పురుగుమందుల అవశేషాలు శరీరంలోకి చేరడంవల్ల తలెత్తే అనారోగ్యాలనుంచి కూడా తప్పించుకునే వీలుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.

సామాన్య రైతు ప్రయోగం

కడప జిల్లాకు చెందిన నున్న లెనిన్ అనే ఒక సామాన్య రైతు ఈ దిశగా ఒక ప్రయోగం చేసి సక్సెస్ సాధించాడు. చింతకాని మండలానికి చెందిన ఈ రైతు ఒక డ్రోన్ ని అద్దెకు తీసుకుని ప్రయోగాత్మకంగా డ్రోన్ సాయంతో పంటపై పురుగుమందులు చల్లి చూశాడు. అద్భుతం ఆవిష్కృతమయ్యింది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చాలా తక్కువ కాలంలోనే జరిగిపోయింది.

ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన లెనిన్ స్థానికంగా ఓ వివాహానికి హాజరైనప్పుడు డ్రోన్ సాయంతో పెళ్లి వీడియో తీస్తున్న వీడియో గ్రాఫర్ ని చూశాడు. పంట పొలంలోకూడా డ్రోన్ సాయంతో పురుగుమందులు చల్లితే ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నించి చూడాలన్న ఆలోచన అప్పుడే అతనికి వచ్చింది.

నిపుణుడైన డ్రోన్ పైలట్ లెనిన్ ఆలోచనకు కార్య రూపాన్ని కల్పించాడు. ఇద్దరూ కలసి ప్రయోగాత్మకంగా చేసిన ఈ ప్రయత్నం సత్ఫలితాల్ని ఇచ్చింది. పైగా మనుషుల్ని పెట్టి చల్లితే జరిగే వృధాను పూర్తి స్థాయిలో నిరోధించడానికి వీలయ్యిందని వీళ్లు చెబుతున్నారు.

ఎకరానికి రూ.500

లెనిన్ ప్రయత్నం ఫలించడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఈ విధానాన్ని అనుసరించేందుకు ముందుకొచ్చారు. ఒకే రోజులో ఎకరానికి రూ.500 చొప్పున రుసుము తీసుకున్న డ్రోన్ పైలట్ చుట్టుపక్కల పొలాల్లోనూ పురుగుమందుల్ని చాలా తేలిగ్గా చల్లేశాడు.

ఈ విషయం ఈనోటా ఆనోటా మొత్తం మండలమంతా పాకిపోయింది. కొంతమంది టెక్ సావీలు ప్రయోగాత్మకంగా చేసిన ఈ ప్రయత్నాన్ని పరిశీలించేందుకు ఆసక్తి కనబరిచారు. వందనం గ్రామానికి చెందిన మరికొందరు నవతరం రైతులుకూడా డ్రోన్ ని అద్దెకు తీసుకుని నిపుణుడైన పైలట్ సాయంతో తమ పొలాల్లోనూ పురుగుమందుల్ని చల్లించుకున్నారు.

ఈ మండలంలో రైతులు మొదటినుంచీ కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. దీనివల్ల మరో లాభంకూడా కనిపించింది. సాధారణంగా మనుషుల్ని పెట్టి, భుజానికి చాలా బరువైన ట్యాంక్ తగిలించుకుని పొలమంతా తిరిగి పురుగు మందులు చల్లినప్పుడు వాటి తుంపరలు పూర్తిగా చల్లేవారిమీద పడతాయి.

అదిమాత్రమే కాక అలా పురుగుమందులు చల్లేటప్పుడు వాటి దుష్ప్రభావం పడకుండా ఉండాలంటే చల్లేవాళ్లు సరైన నిరోధకాలను దుస్తుల రూపంలో అమర్చుకోవాల్సి ఉంటుంది. కానీ వాస్తవంగా చూస్తే ఆ దుస్తుల్ని ధరించేందుకు ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే వీపుకు తగిలించుకున్న ట్యాంక్ బరువే చాలా ఎక్కువగా ఉంటుంది.

అనేక రుగ్మతలు, అనారోగ్య సమస్యలు

దానికి తోడు పురుగుమందు తుంపరల రూపంలో శరీరంమీద పడినప్పుడు చేతులూ, కాళ్లూ, కళ్లూ విపరీతంగా మండుతూ ఉంటాయి. పురుగుమందుల ప్రభావం సాయంత్రానికి దాన్ని పొలమంతా తిరిగి చల్లిన వ్యక్తిమీద చాలా ఎక్కువగా పడుతుంది. ఇలా చేస్తూ పోవడంవల్ల కొంతకాలానికి ఆ పురుగుమందుల అవశేషాలు వారి శరీరంలోకి చేరిపోయి వాటికి సంబంధించిన దుష్ప్రభావాలు కనిపించడం మొదలవుతుంది. వాటి తీవ్రత పెరిగేకొద్దీ అనేక విధాలైన రుగ్మతలు, అనారోగ్య సమస్యలు క్రమక్రమంగా బయటపడతాయి.

అలాగని ఎప్పటినుంచో అనుసరిస్తున్న పద్ధతిని వదులుకోవడమూ కుదరనిపని. ఎందుకంటే పంటకు పురుగుమందులను పిచికారీ చేయకపోతే చీడపీడల బెదడవల్ల దిగుబడి విపరీతంగా దెబ్బతింటుంది. దానివల్ల రైతు తీవ్రాతితీవ్రమైన స్థాయిలో నష్టపోతాడు. ఈ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ఇన్నాళ్లూ సరైన మార్గం కనిపించక రైతులు స్వయంగానో లేక మనుషుల్ని పెట్టో పంటలమీద స్వయంగా పురుగుమందుల్ని చల్లే పని పెట్టుకుంటున్నారు.

ఇక ఇప్పుడు ఆ బెడద లేనేలేకుండా పోవడం రైతులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న విషయం అయ్యింది. పైగా వ్యవసాయ కూలీలకు ఇచ్చే కూలీతో పోల్చుకుంటే దానిలో ఇలా డ్రోన్ సాయంతో పిచికారీ చేయడంవల్ల అయ్యే ఖర్చు కనీసం నాలుగోవంతుకు తగ్గిపోవడం రైతులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

వ్యవసాయ శాస్త్రవేత్తలు

ప్రయోగాత్మకంగా నిరూపితమైన ఈ పద్ధతికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పించగలిగితే ఇంకా చాలామంది రైతులు దీనివల్ల కలిగే లాభాలను అందిపుచ్చుకోగలుగుతారని నవతరం టెక్ సావీ రైతులు అంటున్నారు. డ్రోన్ సాయంతో పురుగుమందులను అవలీలగా పిచికారీ చేయొచ్చని నిరూపించిన రైతు లెనిన్ కు చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ ఘటన తర్వాత పొద్దుటూరు గ్రామంలో కూడా ప్రయోగాత్మకంగా కొందరు రైతులు దీన్ని పరిశీలించారు. చింతకాని మండల వ్యవసాయ అధికారి నాగయ్య స్వయంగా దీని గురించి విస్తృత రీతిలో ప్రచారం చేస్తూ దీనివల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నారు.

పొలంలో పురుగుమందులను పిచికారీ చేయడానికి వీలుగా కొద్దిపాటి మార్పులతో సరికొత్త డ్రోన్ ను అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన చెబుతున్నారు. కేవలం ఒకే ఒక్క డ్రోన్ ఆపరేటర్ సాయంతో ఇకపై సులభంగా వ్యవసాయం చేసే విదానం అందరికీ అందుబాటులోకి రావడంవల్ల భవిష్యత్తులో రైతులు మరిన్ని మంచి ఫలితాలను సాధించేందుకు వీలవుతుందని ఆయన అంటున్నారు.

Next Story
Share it