చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగ అరుంధతివాడకు చెందిన కె.బాలకృష్ణయ్య(50) వ్యవసాయ కూలీగా పనిచేస్తుండేవాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురున్నారు. కాగా..బాలకృష్ణ ఏడాది నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల మొదటి వారంలో మామ అనారోగ్యంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరగా..అక్కడికి వెళ్లిన బాలకృష్ణ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.

రిపోర్ట్స్ వచ్చాక బాలకృష్ణకు మూత్ర సంబంధిత వ్యాధితో పాటుగా నోటి అల్సర్ ఉన్నట్లు తెలిపారు. దీంతో తనకు ఏదో వైరస్ సోకిందని భావించిన బాలకృష్ణ..అది కరోనా వైరస్ అయి ఉంటుందనుకున్నాడు. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని పిలిచి తనకు కరోనా వైరస్ సోకిందని, తనను ఎవరూ ముట్టుకోవద్దంటూ హెచ్చరించాడు. కుటుంబ సభ్యులు నిద్రపోయాక ఇంటి తలుపులు వేసి..గ్రామంలోని స్మశానంలో ఉన్న తల్లి సమాధి పక్కనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలకృష్ణకు దహన సంస్కారాలు చేశారు.

అంతా అయ్యాక డాక్టర్ అనూష వారింటికి వెళ్లి..బాలకృష్ణ ఆత్మహత్యపై వివరాలడిగి తెలుసుకున్నారు. అలాగే రుయా ఆస్పత్రిలో చేయించుకున్న వైద్యపరీక్షల రిపోర్టులు అడుగగా..బాలకృష్ణ వాటిని కూడా కాల్చివేసినట్లుచెప్పారు. అయితే..బాలకృష్ణకు కరోనా సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అతను కొద్దికాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యుల మాటల్లో తెలిసిందని పేర్కొన్నారు.

రాణి యార్లగడ్డ

Next Story