Agra | ఆగ్రా పేరు మార్చే యోచనలో యూపీ ప్రభుత్వం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 6:48 AM GMT
Agra | ఆగ్రా పేరు మార్చే యోచనలో యూపీ ప్రభుత్వం..!

ఢిల్లీ(Agra): ప్రముఖ పర్యాటక స్థలం ఆగ్రా పేరు మార్చాలనే యోచనలో యోగీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఆగ్రాకు కొత్త పేరు సూచించాలంటూ యూపీ ప్రభుత్వం అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. ఆగ్రాను పూర్వం 'అగ్రవన్‌'గా పిలిచే వారు. మహారాజు అగ్రసేన్‌ పేరు మీదుగా ఇలా పిలిచేవారు. ఆగ్రాలో అగర్వాల్ సామాజిక వర్గీయులు ఎక్కువుగా ఉంటారు. ఎప్పటి నుంచో వారు ఆగ్రా పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగ్రాకు సంబంధించి చారిత్రక పేరు సూచించాలని యోగీ సర్కార్‌ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. తమకు యూపీ ప్రభుత్వం నుంచి లేఖ అందినట్లు చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్‌ ఆనంద్ తెలిపారు.

10వ శతాబ్దం నుంచే ఆగ్రాకు మంచి పేరు ఉంది. చరిత్ర పరంగా భారతదేశంలో ఆగ్రా ఓ ప్రధాన నగరం. ఢిల్లీ సుల్తాన్‌ల కాలం నుంచి కూడా ఆగ్రా(Agra) తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ వస్తుంది. ఎన్నో చారిత్రక కట్టడాలు, టూరిజం ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. 1504లో ఢిల్లీ సుల్తాన్‌లు ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధానిని తరలించారు. యమునా నదికి ఆనుకుని బహుసుందరంగా నగరం ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీకి కేవలం 206 కి.మీ దూరంలో ఉంటుంది. జనాభాపరంగా యూపీలో నాలుగో అతిపెద్ద నగరం ఆగ్రా. దేశంలో 24వ అతిపెద్ద నగరంగా ఆగ్రా గుర్తింపు పొందింది.

1526లో మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ గెలిచిన తరువాత ఢిల్లీ నుంచి ఆక్రమించారు. అక్కడ నుంచి తన సైన్యాలను ఆగ్రాకు తరలించాడు. ఆగ్రా కోటను యునెస్కో ప్రపంచప్రఖ్యాత గాంచిందిగా గుర్తించింది. ఇది తాజ్‌ మహల్‌కు 2.5 కి.మీ దూరంలో ఉంటుంది. అక్బర్‌ ఈ కోట నుంచే పాలన సాగించారు. పూర్తిగా ఇసుక రాతితో దీనిని నిర్మించారు. దీని కోసం 14 లక్షల మంది కార్మికులు పని చేశారు. 1573లో ఆగ్రా కోట నిర్మాణం పూర్తయింది. ఆగ్రా కోట చరిత్రను తెలియజేస్తూ భారత ప్రభుత్వం నవంబర్ 28, 2004లో తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది.

ఆగ్రాను సిటీ ఆఫ్ తాజ్‌ అని కూడా అంటారు. షాజహాన్‌ తాజ్ మహల్ నిర్మించారు. 1653లో తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయింది. పర్షియన్ ఆర్కిటెక్చర్‌తో దీనిని నిర్మించారు. యుమునా నది ఒడ్డున అత్యంత సుందరంగా దీనిని నిర్మించారు. తన భార్య ముంతాజ్‌కు గుర్తుగా తాజ్‌మహల్‌ను షాజ్‌హాన్ నిర్మించారు.ఆగ్రా అనగానే భారతీయుల చరిత్ర నగరంగా గుర్తుకు వస్తుంది. ఎన్నో యుద్ధాలను, పాలకులను చూసిన నగరం ఆగ్రా. ఇక్కడ నుంచే అక్బర్‌ లాంటి హేమాహేమీలు పాలన సాగించారు.

యూపీ ప్రభుత్వం తలచినట్లుగా పేరు మార్పు జరిగితే ఆగ్రా 'అగ్రవన్‌'గా మారే అవకాశముంది. ఆగ్రా పేరు మార్చడమంటే చరిత్రను గౌరవించడం అంటున్నారు స్థానికులు. యూపీ ప్రభుత్వం కూడా ఆగ్రా పేరు మార్చాలనే పట్టుదలతో ఉంది. చరిత్రను గౌరవిస్తామంటోంది యూపీ.

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story