దూకుడు స్వభావమే.. రేవంత్‌కు చేటు తెస్తుందా..!

By Newsmeter.Network  Published on  12 March 2020 4:15 AM GMT
దూకుడు స్వభావమే.. రేవంత్‌కు చేటు తెస్తుందా..!

రేవంత్‌ రెడ్డి చిక్కుల్లో పడిపోయాడా.. సొంతపార్టీ అయిన కాంగ్రెస్‌ నేతలుసైతం ఆయన్ను ఒంటరిని చేశారా.. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. రేవంత్‌ రెడ్డిపై అధికార పార్టీలో నుంచి మాటల దాడి సర్వసాధారణమైన విషయం. కానీ సొంత పార్టీనేతలే ఇప్పుడు రేవంత్‌ను టార్గెట్‌ చేయటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రేవంత్‌ రెడ్డి టీడీపీలో కొనసాగిన కాలం నుంచి దూకుడు స్వభావంతోనే రాజకీయాల్లో కొనసాగారు. టీడీపీ అధినేత చంద్రబాబు అండదండలు అప్పుడు రేవంత్‌కు పుష్కలంగా ఉండటంతో రేవంత్‌ ఏం చేసినా ఎదురులేకుండా సాగిపోయింది. అనూహ్య పరిణామాల మధ్య రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరడం.. తక్కువ సమయంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి వెళ్లిపోవటంతో రేవంత్‌కు టీపీసీసీ అధ్యక్ష పీఠం వరిస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు.

కాగా అనూహ్య పరిణామాలతో రేవంత్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతూ వస్తోంది. అందుకుతోడు కాంగ్రెస్‌ పార్టీ నేతలుసైతం రేవంత్‌ను టార్గెట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీలోనూ, కాంగ్రెస్‌లో చేరిన తరువాత రేవంత్‌ రెడ్డి అధికార తెరాసపై దూకుడుస్వభావాన్నే ప్రదర్శిస్తూ వచ్చాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన వెరవకుండా సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల తీరును సమయం దొరికినప్పుడల్లా ఎండగడుతూ వచ్చాడు. ఈ సమయంలో కాంగ్రెస్‌ నేతలుసైతం రేవంత్‌కు అండగా నిలిచారు.

తాజాగా రేవంత్‌ భూ వివాదంలో చిక్కుకొని జైలుకెళ్లడం.. పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వకుండా ఆయన అనుచరులు ఆందోళన చేపట్టడంతో .. రేవంత్‌ వ్యక్తిగత ఎజెండాను ఎంచుకొని ముందుకెళ్తున్నాడని కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రజా సమస్యలు పక్కదారి పడతాయని, ప్రజల్లో పార్టీ ఇమేజ్‌ మరింత దెబ్బతింటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జీవో111, మంత్రి కేటీఆర్‌ ఫాం హౌస్‌ విషయంలో ఎంపీ రేవంత్‌ చేస్తున్న పోరాటం ఆయన వ్యక్తిగతమైనదని, రేవంత్‌పై వచ్చిన భూ ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు ఇలా ఇంకో అంశం తెరపైకి తేవడం సరికాదని వీహెచ్‌, జగ్గారావు లాంటి నేతలు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

అంతేకాక రేవంత్‌ అనుచరుల తీరుపైనా జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవో 111 అంశాన్ని టీపీసీసీ చీఫ్‌ పదవికి లింకు పెట్టి రేవంత్‌ అనుచరులు తీవ్ర రాద్దాంతం చేస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ ఒక్కడే మగాడ అని, కాంగ్రెస్‌లో హీరోలే లేరంటూ వారు చేస్తున్న ప్రచారానికి చెక్‌పెట్టాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే రేవంత్‌ రెడ్డి అనుచరులు మాత్రం మరోవాదన వినిపిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి కొద్దికాలంలోనే కాంగ్రెస్‌ ముఖ్యనేతగా ఎదిగాడని, టీపీసీసీ అధ్యక్షుడి రేసులోఉన్నాడని అందుకే కాంగ్రెస్‌ నేతలుసైతం రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. మొత్తానికి ప్రస్తుత తీరును చూస్తుంటే రేవంత్‌రెడ్డి దూకుడే ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలనుంచి రేవంత్‌ రెడ్డి ఎలా బయటపడతాడు. మళ్లీ కాంగ్రెస్‌ నేతలను కలుపుకొని ఎలా ముందుకెళ్తాడు.. రేవంత్‌కు టీపీసీసీ చీఫ్‌ పదవి దక్కే అవకాశం ఉంటుందా.. అనే అంశాలు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తినిరేపుతున్నాయి.

Next Story