ఎస్వీబీసీ నుంచి తొలగించాల్సిందే..

By Newsmeter.Network  Published on  12 Jan 2020 8:01 AM GMT
ఎస్వీబీసీ నుంచి తొలగించాల్సిందే..

తిరుపతి: ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ ఫోన్‌ సంభాషణ తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్‌ మీడియాలో పృథ్వీరాజ్‌ ఆడియో టేపులు వైరల్‌గా మారాయి. పృథ్వీరాజ్‌ వ్యవహరశైలిపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఎస్వీబీసీ ఛానల్‌లో ఉద్యోగినులను ఎన్నో రోజుల నుంచి చైర్మన్‌ పృథ్వీరాజ్‌ వేధిస్తున్నాడని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి అన్నారు. వేధింపులు భరించలేక ఓ అభ్యాగ్యురాలు మమ్మల్ని ఆశ్రయించిందని తెలిపారు. కాగా పృథ్వీరాజ్‌ లీలలను రికార్డు చేయాలని బాధితురాలికి చెప్పామని వివరించాడు. పృథ్వీ లైంగికంగా వేధించిన అభాగ్య మహిళలు ఎస్వీబీసీలో ఇంకా ఎంతో మంది ఉన్నారని కందారపు మురళి ఆరోపించారు.

పృథ్వీని వెంటనే ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు. పృథ్వీరాజ్‌ను తొలగించాలని లేదంటే రేపు ఉదయం టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని మహిళా సంఘాలు అంటున్నాయి. పృథ్వీపై మహిళలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీ ఆడియో సంబాషణ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీ రాజ్‌ను కొనసాగిస్తే సంస్థకే అప్రతిష్ట అని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే పృథ్వీరాజ్‌పై చర్యలు తీసుకోవాలని, క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని పలువురు నేతల డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్వీబీసీ పార్ట్‌టైమ్‌ ఉద్యోగినితో పృథ్వీరాజ్‌ ఫోన్‌ సంభాషణను మహిళలు బయటపెట్టారు.

శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎస్వీబీసీకి చైర్మన్‌గా పృథ్వీరాజ్‌ ఉన్నారు. రాజధాని రైతులపై పృథ్వీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి శ్రీవారి ప్రతిష్టను కించపరిచే విధంగా ఉందంటూ పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే టీటీడీలో పని చేస్తున్న మహిళలతో చాలా గౌరవంగా ఉండాలంటూ నిబంధనలు ఉన్నాయి. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయి.

Next Story