'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి 'తలసాని'

By Newsmeter.Network  Published on  8 Dec 2019 12:54 PM IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని

ఈనెల 6న శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన స్థలంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు యత్నించి, పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేశారు. నిజానికి దిశ అత్యాచార, హత్య జరిగినప్పటి నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఎన్‌కౌంటర్‌పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాక ప్రతి ఒక్కరు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యనేతల దగ్గర నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసులను పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. దిశ ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో దేశం నలుమూల నుంచి హర్షం వ్యక్తమవుతున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మౌనంగా ఉన్నారంటే ఉగ్రరూపం చూపబోతున్నారని అర్ధమని 'తలసాని' చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టినిర్ణయం తీసుకున్నారని గులాబీ బాస్‌ను కొనియాడారు. దిశ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్న వారే నేడు ఆయనకు ప్రశంసలు కురిపిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలే కాదు మహిళల రక్షణలో తెలంగాణ ప్రభుత్వం ప్రథమస్థానంలో నిలిచిందని మంత్రి వివరించారు. తెలంగాణ పోలీసుల సత్తా ఏంటో గతంలోనే నిరూపించుకున్నారని, ఇంతకుముందు ఉగ్రవాది అయిన వికారుద్దీన్ అతని గ్యాంగ్, నయీమ్ గ్యాంగ్ వంటి ఎన్నో కేసులను తెలంగాణ ప్రభుత్వం తనదైన శైలిలో ఛేదించిందని అన్నారు. కేసీఆర్‌ ఎక్కడికి రారు.. ఆయనకు ఉగ్ర రూపం వస్తే ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలుసు అంటూ వ్యాఖ్యనించారు. కొంత మంది ఏ అవకాశం వచ్చినా ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తారని, మరి అప్పుడు ఆరోపణలు గుప్పించిన వారు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Next Story