ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 9 మంది మహిళలు పోటీ చేయగా.. 8 మంది విజయం సాధించడం విశేషం. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారంతా కూడా ఆప్ కు చెందిన వాళ్ళే..! ఇతర పార్టీలకు చెందిన ఏ మహిళా నేత కూడా విజయాన్ని సాధించలేకపోయారు. 672 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో 79 మంది మాత్రమే మహిళలు..!

షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతగా ఉన్న సమయంలో అత్యధికంగా 9 మంది మహిళలు అసెంబ్లీ లోకి అడుగుపెట్టారు. 1998 లో అత్యధికంగా 9 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఏర్పడ్డాక మొదటిసారి కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు విజయాన్ని సాధించారు. 2003 లో 7 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టగా.. 2008, 2013 లలో ఆ సంఖ్య ‘3’ కు పడిపోయింది. 2015 లో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధిచారు. 2020 లో 8 మంది మహిళలు అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించనున్నారు.

మహిళలు మహరాణులు

2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లకు గానూ 67 సీట్లు సాధించింది. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. కానీ అరవింద్ కేజ్రీ వాల్ కేబినెట్ లో మాత్రం ఎవరికీ మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో ఆప్ మొత్తం తొమ్మిది మందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.. వారిలో ఎనిమిది మంది విజయాన్ని సాధించారు. రోహ్ తాస్ నగర్ ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే సరితా సింగ్ ని పరాజయం పలుకరించింది. ఆప్ ఎమ్మెల్యే అయిన అల్కా లాంబా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేశారు.. చాందినీ చౌక్ ప్రజలు ఆమెను తిరస్కరించారు.

కేజ్రీవాల్ నమ్మిన బంటు అయిన అతిశీ కల్కాజీ నుండి పోటీ చేసి విజయాన్ని సాధించారు. బీజేపీకి అభ్యర్థి ధరమ్ బీర్ సింగ్ పై 11,393 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఆప్ విజయానికి ముఖ్యకారణమైన ఢిల్లీ విద్యా వ్యవస్థను మొదటి నుండీ మార్చడానికి అతిశీ చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం. ఈసారి మాత్రం ఆమెకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది. రాఖీ బిల్దాన్ 2013 లో విజయం సాధించి కేవలం 49 రోజులు మాత్రమే కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

2015 లోనూ విజయం సాధించగా.. ఈసారి కూడా బీజేపీ అభ్యర్థి కరణ్ సింగ్ కర్మా పై 30,116 ఓట్ల తేడాతో మంగోల్ పురి నియోజకవర్గం నుండి విజయం సాధించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బందన కుమారి మరోసారి గెలుపును సొంతం చేసుకున్నారు. బీజేపీకి చెందిన రేఖ గుప్తాపై 3,440 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. షాలిమార్ బాగ్ ప్రజలు గతంలో 10,978 ఓట్ల ఆధిక్యతను ఆమెకు ఇవ్వగా.. ఈసారి అది బాగా తగ్గుముఖం పట్టింది.

ఆర్కే పురం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమీల తోకాస్ బీజేపీకి చెందిన అనిల్ శర్మపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆమెకు 19,068 ఓట్ల మెజారిటీ రాగా ఈసారి 10,369 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది. భావనా గౌర్ మరోసారి భారీ విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి విజయ్ పండిట్ పై ఆమె 32,765 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆమెకు వచ్చిన మెజారిటీ 30,849 మాత్రమే..! ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మొదటిసారో అడుగుపెట్టనున్నారు. రాజౌరి గార్డెన్ నుండి ధన్ వతీ చండేలా గెలుపొందగా.. హరి నగర్ నుండి రాజ్ కుమారి డిల్లాన్ విజయం సాధించింది. ట్రీ నగర్ ప్రజలు ప్రీతి తోమర్ కు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.