ఆక‌ట్టుకుంటున్న 'ఆకాశ‌మే నీ హ‌ద్దురా' ట్రైల‌ర్‌

By సుభాష్  Published on  26 Oct 2020 7:22 AM GMT
ఆక‌ట్టుకుంటున్న ఆకాశ‌మే నీ హ‌ద్దురా ట్రైల‌ర్‌

విభిన్న కథాంశాలతో ఉండే సినిమాలను చేయడానికి ఇష్టపడే హీరో సూర్య. అందుకనే ఆయనకు తమిళంలో పాటు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన సుధా కొంగర దర్శకత్వంలో న‌టించిన చిత్రం ‘సూర‌రై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న అప‌ర్ణ బాల‌ముర‌ళీ న‌టిస్తోంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కరోనా కారణంగా థియేటర్స్ మూతబడి ఉండటంతో 'ఆకాశం నీ హద్దురా' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ముందుగా అక్టోబర్ 30న విడుదల చేస్తున్నామని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

అతి తక్కువ ధ‌ర‌ల‌తో ప్ర‌తి భార‌తీయుడు విమాన ప్ర‌యాణం చేసే విధంగా ఓ గ్రామానికి చెందిన యువ‌కుడు క‌నే అసాధ్య‌మైన క‌లే ఈ క‌థ అని ట్రైల‌ర్ ప్రారంభంలో చెబుతారు. వ్య‌వ‌సాయం చేసేవాడూ విమానం ఎక్కుతాడు. విమాన టిక్కెట్టు.. ధ‌ర ఒక్క రూపాయే అంటూ ట్రైల‌ర్‌లో సూర్య చెప్పే డైలాగ్‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే సూర్య మరోసారి ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారక్టర్ ప్లే చేసాడని అర్థం అవుతోంది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌లో సూర్య పాత్ర కోసం న‌టుడు స‌త్య‌దేవ్ డ‌బ్బింగ్ చెప్పారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి, కరుణాస్, వివేక్ ప్రసన్న ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ గునీత్ మోంగా మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.

Next Story