హాకీ స్టిక్ పట్టిన సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ

By Newsmeter.Network  Published on  3 March 2020 8:29 AM GMT
హాకీ స్టిక్ పట్టిన సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ

బేగంపేట లోని హాకీ స్టేడియం మామూలుగా ఉదయం, సాయంత్రం మాత్రమే ఆటగాళ్లతో కనిపిస్తుంది. కానీ సోమవారం మాత్రం హాకీ స్టేడియం రోజు రోజంతా కళకళలాడిపోయింది. లైట్ బాయ్స్ హడావిడిగా లైట్స్ అరేంజ్ చేయడం, కెమెరా మెన్ మంచి యాంగిల్స్ ని, స్పాట్లను వెతుక్కోవడం, హీరో హీరోయిన్ల వానిటీ వాన్లు వచ్చి ఆగడం, హాకీ స్టిక్కులతో బోలెడంత మంది ఆర్టిస్టులు అటూ ఇటూ పరుగులు తీయడం, ఈ షూటింగ్ ను చూసేందుకు వందలాది మంది హాజరైపోవడం.. మొత్తం మీద హడావిడే హడావిడి.

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీలు నటిస్తున్న ఏ 1 ఎక్స్ ప్రెస్ చిత్రం షూటింగ్ తో హాకీ స్టేడియం కళకళలాడిపోయింది. డైరక్టర్ జీవన్ కానుకొలను “యాక్షన్” అనగానే హడావిడంతా ఒక్క క్షణంలో సద్దు మణిగింది. పూర్తి నిశ్శబ్దం. ఆ తరువాత షూటింగ్ మొదలైంది. హీరో సందీప్ కిషన్ హాకీ స్టిక్ తో ప్రత్యర్థులను ఓడించి మరీ గోల్ చేసిన సన్నివేశం షూటింగ్ అయింది. వెంటనే దర్శకుడు కట్ అన్నాడు. సందీప్ కిషన్ కూడా మానిటర్ లో చూపి షాట్ విషయంలో సంతృప్తి చెందాడు.

Advertisement

A1 Express

ఏ 1 ఎక్స్ ప్రెస్ హాకీ ఆట నేపథ్యంగా ఉన్న సినిమా. ఈ సినిమాలో సందీప్ కిషన్ రెండురూపాల్లో కనిపిస్తాడు. ఒకటి హాకీ ఆటగాడు కావడానికి ముందు. ఇంకొకటి హాకీ ఆడటం ప్రారంభించిన తరువాత. “హాకీ ఆట చాలా కష్టమైన ఆట. చూసేందుకు ఎంతో సులువుగా కనిపిస్తుంది కానీ, ఆడాలంటే చాలా శక్తి కావాలి. పైగా ఆడుతున్నంత కాలం వంగి ఉండాలి. దీంతో నడుములు పడిపోతాయి. ఇప్పుడిప్పుడే ఆటను అలవాటు చేసుకుంటున్నాను” అన్నాడు సందీప్. ఈ ఆటకు మంచి ఫిట్ నెస్ ఉండాలంటాడు సందీప్

Advertisement

మామూలుగా తెలుగు సినిమాల్లో హాకీ స్టిక్స్ కేవలం రౌడీల స్టంట్ సీన్ల కోసమే వాడతారు. మొదటి సారి ఆట కోసం వాడటం ఈ సినిమాలోనే. మంచి ఆటను కనబరిచేందుకు సందీప్ క్రమం తప్పకుండా హాకీ కోచింగ్ తీసుకుంటున్నాడు. చాలా కష్టపడుతున్నాడు. నిజమైన ఆటగాడిలా కనిపించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠీ కూడా ఈ సినిమాలో హాకీ ప్లేయరే. ఆమె కూడా సినిమా కోసమే తొలి సారి హాకీ స్టిక్ ని చేతపట్టింది. ఆమెకు, సందీప్ కు మాజీ హాకీ ఛాంపియన్ సుధీర్ శిక్షణనిస్తున్నాడు.

ఒకప్పుడు హాకీ మన దేశంలో చాలా పాపులర్. ఇప్పుడు మాత్రం ఆట ఆడేవారు తగ్గిపోయారు. ఈ సినిమా వల్లనైనా ప్రజల్లో హాకీ పట్ల ఆసక్తి పెరిగితే సంతోషం అంటోంది లావణ్య త్రిపాఠీ. సందీప్ పిల్లవాడుగా ఉన్నప్పుడు అతని తల్లి ఆలిండియా రేడియోలో కామెంటేటర్ గా ఉంటూ ఇండియా నెదర్లాండ్స్ ఫైనల్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అప్పుడు సందీప్ అమ్మె వెంటే వెళ్లి ఆటచూశాడు. ఇప్పుడు ఆటగాడుగా నటించడం ఎంతో ఎక్సైటింగ్ గా ఉందని సందీప్ అంటున్నాడు.

Next Story
Share it