అత్యంత అరుదైన అంతరిక్ష అద్భుతం.. భారతీయులకు మాత్రం కనిపించదు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 5:08 AM GMT
అత్యంత అరుదైన అంతరిక్ష అద్భుతం.. భారతీయులకు మాత్రం కనిపించదు..?

హైదరాబాద్: అంతరిక్షంలో అత్యంత అరుదైన అద్భుతం జరిగింది. కనువిందుగా చూడ దగిన గొప్ప అద్భుతం ఆవిష్కృతమయ్యింది. బుధగ్రహం సూర్యగ్రహం మీదుగా ప్రయాణించే సమయంలో ఎర్రటి సూర్యగోళంమీద నల్లటి పుట్టుమచ్చలాగా బుధుడు కనిపించాడు. నవంబర్ 11వ తేదీన రాత్రి 8:52 గంటల ప్రాంతంలో ఈ అద్భుతం జరిగింది. దీన్ని ఖగోళశాస్త్ర పరిభాషలో దీన్ని మెర్క్యురీ ట్రాన్సిట్ అంటారు. ప్రపంచం మొత్తం ఈ అద్భుతాన్ని చూడగలిగే అవకాశాన్ని దక్కించుకున్నప్పటికీ భారతీయులకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు.

సాయంత్రం వేళ సూర్యాస్తమయ తర్వాత ఈ అద్భుతం చోటు చేసుకుందని, బుధగ్రహం సూర్యుడిని దాటి ముందుకు వెళ్లడానికి దాదాపుగా ఐదున్నర గంటల సమయం పట్టిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా అధికారిక వివరాల్లో వెల్లడించింది. కిందటిసారి మే నెల 9వ తేదీన 2019లోనే ఇలాంటి అద్భుతం చోటుచేసుకుంది. అప్పుడు భారతీయులు పూర్తిగా ఆ అద్భుతాన్ని వీక్షించగలిగారు. నవంబర్ 13వ తేదీ 2023లో మళ్లీ ఇంకోసారి ఈ అద్భుతం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కేవలం శుక్రగ్రహం, బుధగ్రహం మాత్రమే ఈ విధంగా ప్రయాణించగలుగుతాయి

సూర్యకుటుంబంలో శుక్రగ్రహం, బుధగ్రహం సూర్యుడిని దాటి ముందుకు వెళ్లేటప్పుడు మాత్రమే భూమి మీది నుంచి చూడడానికి ఆస్కారం కలుగుతుంది. ఎందుకంటే శుక్రుడు, బుధుడు సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో అవి భూమి కక్ష్యలోనే ఉండడంవల్ల ఇలా చూడడం సాధ్యమవుతుంది.నిజమైన అద్భుతం

బుధగ్రహం సూర్యుడిని దాటి వెళ్లే ఇలాంటి అద్భుతమైన తరుణం 100 సంవత్సరాల్లో 13సార్లు మాత్రమే జరుగుతుంది. ఈ సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య బుధుడు వస్తాడు. అలాగే శుక్రుడు ఇలా సూర్యుడిని దాటుకుని వెళ్లే సందర్భం 105.5 సంవత్సరాలనుంచి 121.5 సంవత్సరాల మధ్యలో కనిపిస్తుంది.

నిజానికి బుధగ్రహాన్ని మనం చూడాలంటే దానికి సంబంధించిన టెలిస్కోప్ లాంటి పరికరాల సాయంతో మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆ గ్రహం చాలా చిన్నది కాబట్టి. ఇలాంటి సందర్భంలో టెలిస్కోప్ కి సోలార్ ఫిల్టర్ ను అమర్చి మాత్రమే చూడాలి. అలా చెయ్యకుండా నేరుగా చూసే ప్రయత్నం చేస్తే ఆ కాంతి తీక్షణతకు కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్గ్ లేదా ఫేస్‌బుక్‌లో

www.planetarysocietyindia.org లేదా www.facebook.com/planetarysocietyindia మాధ్యమాల ద్వారా ఔత్సాహికులు ఇలాంటి అద్భుతాలను చూడొచ్చు. వీటితోపాటుగా అంతరిక్షానికి, గ్రహగతులకు, ఆకాశంలో జరిగే అనేక అద్భుతాలకు సంబంధించిన ఎన్నో విషయాలుకూడా ఈ మాధ్యమాల ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది.Next Story