హుజూర్‌నగర్: భూమి కి పట్టా ఇవ్వలేదని 85 ఏళ్ల  లక్ష్మీ నరసమ్మ అనే వృద్ధురాలు హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసింది. 100 ఎకరాల తన భూమికి అధికారులు పట్టా పుస్తకం ఇవ్వలేదని నిరసనగా నామినేషన్ వేసినట్లు ఆమె చెప్పారు. హుజూర్‌నగర్‌కు చెందిన లక్ష్మీ నర్సమ్మ కొంతకాలంగా తన భూమికి పట్టాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతోంది. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో నిరసనగా ఉప ఎన్నికల్లో నామినేషన్‌ వేసింది.

వివరాల్లోకి వెళ్తే..చింతలపాలెం మండలం వెల్లెటూరు గ్రామంలోని సర్వే నంబర్ 488లో అనువంశిక భూములున్నాయి.లక్ష్మీ నరసమ్మకు 185 ఎకరాల పొలం ఉంది. అయితే..1975లో 78 ఎకరాలు సీలింగ్ లో మినహాయించబడింది. ఆ భూమిని తన  12 మంది సంతానానికి పంచింది. కూతుళ్లకు పసుపు – కుంకుమ కింద ఇచ్చిన భూమిని కూడా కబ్జారాయుళ్లు వదలడంలేదంటోంది లక్ష్మీ నరసమ్మ.  భూముల్లో సేద్యం చేయాలనుకునే సమయానికి భూ మాఫియా  రంగ ప్రవేశం చేసింది. ఇదేంటని అడిగితే..పట్టాదారుల మీదనే భౌతిక దాడికి దిగుతున్నారు. కేసీఆర్  ప్రవేశపెట్టిన దళితులకు 3 ఎకరాల భూమి పథకానికి లక్ష్మీ నరసమ్మ ఆకర్షితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. 65 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. అంతే..గ్రామంలోని భూస్వాములు రంగంలోకి దిగారు. భూమి ప్రభుత్వానికి అమ్మడానికి వీళ్లేదని..అమ్మితే తమకే అమ్మాలని హుకుం జారీ చేశారు. దీంతో బ్రాహ్మణులైన పట్టాదారులు చట్టాన్ని ఆశ్రయించారు. భూ మాఫియాలోని పలువురిపై పోలీసులు కేసులు  కూడా పెట్టారు. అయినా ..భూ మాఫియా తమ పంథాను మార్చుకోవడం లేదు. పట్టాదారులను బెదిరించడం, దున్నుకున్న భూమిని పాడుచేయడం లాంటివి చేస్తున్నారు. ఈ విషయంపై హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదంటున్నారు. భూ మాఫియాతో చాలా మంది బాధ పడుతున్నారని..వారందరిలో స్ఫూర్తి నింపడానికే నామినేషన్ వేశానని లక్ష్మీ నరసమ్మ చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకురావడం కోసమే నామినేషన్ వేసినట్లు లక్ష్మీ నరసమ్మ చెప్పారు.

ఆమెతో పాటు తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ..మట్టంపల్లి మండలం గుర్రంపోడు గిరిజనులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.