దిల్‌సుఖ్‌ నగర్‌ జంట  బాంబు పేలుళ్ల కేసు నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 17 మంది మృతి చెందగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణహోమం జరిగి ఏడేళ్లు అవుతున్నా.. ఇంకా కళ్లముందే కదలాడుతోంది. నెత్తుటి గాయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. పేలుళ్ల ధాటికి 17 మంది మాంసపు ముద్దలైపోయారు. ఈ పేలుళ్లపై ముందుగా మలక్‌పేట, సరూర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో 2013 మార్చి 13న నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ దర్యాప్తు చేపట్టింది.

మూడేళ్ల పాటు విచారణ

ఈ వరుస బాంబు పేలుళ్లపై చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసింది ఎన్‌ఐఏ. ఈ కేసును మూడేళ్లపాటు విచారణ జరిపి 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. అలాగే 502 డాక్యుమెంట్లు, 201 మెటీరియల్‌ను పరిశీలించి నిందితులకు వ్యతిరేకంగా ఎన్‌ఐఏ పక్కా సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసుపై లాయర్లు బలమైన వాదనలు వినిపించారు. ఈ వాదనలు 2016 నవంబర్‌ 7వ తేదీన పూర్తయ్యాయి. ఇండియన్‌ ముజాహిద్దీన్‌నే పేలుళ్లకు పాల్పడినట్లు స్పష్టం చేసింది.

నిందితులందరూ దోషులే..

ఈ పేలుళ్లలో ప్రమేయమున్న నిందితులందరూ దోషులేనని 2016, డిసెంబర్‌ 13వ తేదీని ఎన్‌ఐఏ కోర్టు నిర్ధారించింది. ఇక సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దోషుల్లో అసదుల్లా, వకాస్‌, అక్తర్‌, తెహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భత్కల్‌, ఎజాజ్‌లను ఉరివేయాలని తీర్పు వెలువరించింది. కాగా, దోషుల్లో ఒకడైన రియాజ్‌ భత్కల్‌ పాకిస్తాన్‌లో తలదాచుకోగా, మిగతా నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.

దోషుల ఉరితీత ఎప్పుడు..?

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లకు నేటితో ఏడేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటి వరకు దోషులకు ఉరి శిక్ష విధించలేదు. ఉరిశిక్ష వేయాలని కోర్టు తీర్పునిచ్చినా..వారిని జైల్లో ఉంచి ఉరివేయకుండా ఆలస్యమెందుకు చేస్తున్నారని బాధిత కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. మారణహోమానికి పాల్పడిన దోషులకు ఇప్పటికైనా ఉరి వేయాలని కోరుతున్నారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.