రిఫ్రిజరేటెడ్ ట్రక్కులో 41 మంది సజీవంగా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 5:00 AM GMT
రిఫ్రిజరేటెడ్ ట్రక్కులో 41 మంది సజీవంగా..!

లండన్‌: ప్రాణాలకు తెగించి రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులో తరలి వెళ్తున్న 41 మందిని గ్రీస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూరప్‌కు వీరు అక్రమంగా వెళుతున్నట్టు తెలుస్తోంది. వీరంతా ప్రస్తుతానికి బతికే ఉన్నారు. ఏడుగురు అస్వస్థతకు గురవడంతో ప్రాథమిక చికిత్స అందించిన పోలీసులు ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత నెల 23వ తేదీన రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులో వియత్నాం నుంచి అక్రమంగా వలస వెళ్ళిన 39 మంది మృతదేహాలను లండన్‌లో గుర్తించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులు, వారి రవాణా మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. వీరిని ఎక్కడకు తరలిస్తున్నారు, ఎక్కడ నుండి వస్తున్నారు, స్వచ్ఛందంగా వెళ్తున్నారా లేదా ఎవరైనా బలవంతంగా తరలిస్తున్నారా అనే విషయాలన్నీ తెలియాల్సి ఉంది. సాధారణంగా స్వదేశంలో హింసను భరించలేక చాలా మంది వలసపోతుంటారు.

వీరిలో అత్యధికంగా తక్కువ నైపుణ్యం ఉన్న వారు ఉంటారు. వీరంతా విదేశాలకు వెళ్లి చిన్నాచితకా పనులు చేసుకొని పొట్టపోసుకుంటారు. అధికారిక మార్గాల్లో వలస వెళుతుంటే పాస్‌పోర్టులు, వీసా ఫీజులు చెల్లించాలి. కానీ, అనధికారిక మార్గంలో మానవ అక్రమ రవాణాదారుల సాయంతో వలసపోతే అంతకంటే తక్కువ ఖర్చు అవుతుందని భావిస్తారు. కానీ నిజానికి ఇలా కూడా ఎక్కువే ఖర్చవుతుంది.

అయితే అక్కడ అవకాశాలను, అవసరాలను తీర్చేందుకు వీరికి బలమైన నెట్‌వర్క్‌ ఉంటుంది. అందుకే అదనపు డబ్బు గుంజుతుంటారు అని వలసదారుల నమ్మకం. అక్రమరవాణ ఎంతో ప్రమాదకరమని తెలిసి కూడా జీవితం బాగుపడిపోతుందనే ఆశతో చాలా మంది ప్రాణాలకు తెగిస్తున్నారు.

Next Story