నాలుగు కాళ్ల పోలీసులకు ప్రత్యేక శిక్షణ

By రాణి  Published on  14 Feb 2020 6:16 AM GMT
నాలుగు కాళ్ల పోలీసులకు ప్రత్యేక శిక్షణ

ఆ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి వివిధ అంశాల్లో శిక్షణనిచ్చారు. బాంబులెక్కడ పెట్టారు, డబ్బునెక్కడ దాచారు, మందునెక్కడ పెట్టారు ఇలాంటివన్నీ గుర్తించే ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. మూలల్లో, నేల మాళిగల్లో, భూ గ్రృహాల్లో, గోడల్లో ఎక్కడ ఏది దాచినా పట్టేయగలరు ఈ పోలీసులు. వాసనను చూసి గుర్తించేస్తారు. అదీ ఈ పోలీసుల ప్రత్యేకత. గురువారం శిక్షణ పూర్తిచేసుకున్న ఈ ప్రత్యేక పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తయింది. ఇక వాళ్లు తమ తమ పోస్టింగులకు వెళ్లబోతున్నారు.

ఈ పోలీసులు చాలా ప్రత్యేకం. మామూలు పోలీసులకు రెండు కాళ్లుంటే, ఈ పోలీసులకు నాలుగు కాళ్లుంటాయి. ఈ ప్రత్యేక పోలీసులకు తోకలుంటాయి. మామూలు పోలీసులకు ఉండవు. అదే తేడా. అంతే కాదు..ఆ పోలీసుల పేర్లు కూడా విచిత్రమే..లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, బెల్జియన్ మాలినోయిస్, కాకర్ స్పానియెల్..ఇవీ వారి పేర్లు. నాలుగు కాళ్ళేమిటి, తోకలేమిటి అనుకుంటున్నారా..ఇవి పోలీసు కుక్కలు. వాసన పసిగట్టే పోలీస్ డాగ్స్.

హైదరాబాద్ లోని పోలీస్ ఇంటలిజెన్స్ యూనిట్ లోని డాగ్ ట్రైనింగ్ విభాగంలో శిక్షణ పొందిన 37 కుక్కల పాసింగ్ అవుట్ పరేడ్ గురువారం పూర్తయింది. ఈ పోలీసు శునకాలు వివిధ రాష్ట్రాలకు చెందినవి. దొంగలను గుర్తించే, మాదక ద్రవ్యాలను, బాంబులను గుర్తించడంలో ఈ ఇవి శిక్షణ పొందాయి.

మూడునెలల వయసులోనే వీటిని తీసుకువచ్చి మొదటి రెండు నెలలు ఒకే కాసిస్టేబుల్ చేత ఆహారాన్ని ఇప్పించడం జరుగుతుంది. దీంతో ఆ శునకాలకు ఆయా కానిస్టేబుళ్లకు మధ్య మంచి దోస్తీ ఏర్పడుతుంది. ఆ తరువాత ఎనిమిది నెలల పాటు వివిధ అంశాలలో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తరువాత ఒక పరీక్ష ఉంటుంది. అందులో పాసైన వాటికి మరో ఆరునెలల పాటు కఠినమైన శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత పోలీసులకు సాయపడేందుకు అవి సంసిద్ధమౌతాయి. ఈ సారి శిక్షణలో బీహార్ నుంచి 20 కుక్కలు వచ్చాయి. ఇవి మద్యనిషేధం అమలులో ఉన్న ఆ రాష్ట్రంలో అక్రమ సారాను పసిగట్టే విషయంలో ప్రత్యేక శిక్షణను పొందాయి.

Next Story