భారత్‌లో 332కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు..

By Newsmeter.Network  Published on  22 March 2020 6:51 AM GMT
భారత్‌లో 332కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు గంటగంటకు పెరుగుతున్నాయి. ఆదివారం మహారాష్ట్రంలో మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 332కు చేరింది. మొత్తం 22 రాష్ట్రాల్లో ఈ వైరస్‌ విస్తరిస్తున్నట్లు భారత ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో అత్యధికంగా మహారాష్ట్రంలోనే కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో 63 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పలువురు అనుమానితులను ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తరువాతి స్థానంలో కేరళ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రాష్ట్రంలో 45 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లిలో 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యూపీలో 23 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముంబైలో ఆరు పాజిటివ్‌ కేసులు, ఏపీలో 5, పూణలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి సారిగా శనివారం అసోంలో ఓ నాలుగేళ్ల బాలికకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో బాలికను జోర్హత్‌ వైద్య కళాశాలకు తరలించి పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలినట్లు ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వశర్మ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫ్యూ కోనసాగనుంది.

తెలంగాణలో మాత్రం 24గంటల కర్ఫ్యూ కొనసాగనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణలోని రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్‌ అయింది. కేవలం అత్యవసర సేవల నిమిత్తం డిపోకు ఐదు బస్సులను సిద్ధంగా ఉంచారు.దీనికితోడు ఇతర రాష్ట్రాలను వాహనాలు రాకుండా చెక్‌పోస్టు వద్ద భద్రత ఏర్పాటు చేశారు. వచ్చిన వాహనాలను అక్కడే నిలిపివేస్తున్నారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Next Story
Share it