26/11 ముంబాయి ఉగ్రదాడుల నేపథ్యంలో ముంబాయి మాజీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ మరియా సంచలన విషయాలు బయటపెట్టాడు. 2008 ముంబాయి ఉగ్రదాడులను హిందూ ఉగ్రదాడిగా చిత్రీకరించేందుకు లష్కరే తొయిబా భారీ ప్లాన్‌ చేసిందని రాకేష్‌ చెప్పుకొచ్చారు. ఆయన రాసిన ‘లెట్‌ మీ సే ఇట్‌ నౌ’ అనే బుక్‌లో సంచలన విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్‌ ఉగ్రవాది మహ్మద్‌ అజ్మల్‌ కసబ్‌ను బెంగళూరుకు చెందిన సమీర్‌ చౌదరిగా నమ్మించేలా లష్కరే తొయిబా కుట్ర పన్నినట్లు వివరించారు.

కాగా, ముంబాయిలో బీభత్సం సృష్టించిన ఉగ్రవాదులను భారతీయులుగా నమ్మించడం కోసం నకిలీ ఐడి కార్డులను సృష్టించినట్లు రాకేశ్‌ మరియా పేర్కొన్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగితే కనుక కసబ్‌ ఓ హిందువుగా చనిపోయేవాడని రాకేశ్‌ మరియా తన బుక్‌లో పేర్కొన్నారు.

26/11 terror attack

కసబ్‌ చేతికి ఎర్రటి దారం వెనుక అసలు రహస్యం ఇదే..

ముంబాయి దాడుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది కసబ్‌ చేతికి ఎర్రటి దారం ఉంది. అయితే అతన్ని హిందువుగా నమ్మించడం కోసమే కుడి చేతికి ఎర్రటి దారాన్ని కట్టారని రాకేశ్ మరియా తన బుక్‌లో చెప్పుకొచ్చారు. ఈ విధంగా కసబ్‌ను చాలా మంది హిందువు అని నమ్ముతారని, 26/11 దాడులను హిందు ఉగ్రవాదంగా నమ్మించే అవకాశాలుంటాయనే ఉద్దేశంతో లష్కరే తొయిబా ఈ కుట్ర పన్నినట్లు రాకేశ్‌ మరియా తన బుక్‌లో రాసుకొచ్చారు.

ఇక హిందూ ఉగ్రవాదులు ముంబాయిలో ఎలాంటి దాడులు చేశారో చూడండి అంటూ న్యూస్‌ పేపర్‌లో, మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తాయని, ఇక టాప్‌ టీవీ జర్నలిస్టులు నకిలీ ఐడీ కార్డులను నిజంగా భావించి కసబ్‌ ఫ్యామిలీని, ఇతరులను ఇంటర్వ్యూ చేయడం కోసం పెద్ద ఎత్తున క్యూలు కడతారనే ఉద్దేశంతో తొయిబా ఈ ప్లాన్‌ చేసినట్లు చెప్పారు. కానీ కసబ్‌ పాకిస్తాన్‌లోని ఫరీద్‌కోటకు చెందిన వాడుగా దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.

26/11 terror attack

లష్కరే తొయిబా కుట్ర భగ్నమైంది

ఈ దాడుల్లో వీరమణం పొందిన కానిస్టేబుల్‌ తుకారాం ఓంబ్లే కసబ్‌ను ప్రాణాలతో పట్టుకోవడంతో లష్కరే తొయిబా పన్నిన కుట్ర భగ్నమైంది. ఇక కసబ్‌ చోరీలు చేయడం కోసం లష్కరే తొయిబాలో చేరాడని, జిహాద్‌కు అతనితో సంబంధం లేదని స్పష్టం చేశారు. భారత్‌లో ముస్లింలు నమాజ్‌ చేసుకొనివ్వరని కసబ్‌ను నమ్మించారని బుక్‌లో పేర్కొన్నారు.

10 మంది ఉగ్రవాదులు భారీ ఎత్తున మారణాయుధాలతో..

పాకిస్తాన్‌కు చెందిన పది మంది ఉగ్రవాదులు భారీ ఎత్తున మారణాయుధాలతో ముంబాయి ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారన్నారు. ఈ దాడుల్లో మొత్తం 166 మంది మృతి చెందగా, 300లకు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో కసబ్‌ ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఇక జైల్లో ఉంచిన కసబ్‌ను 2012, నంబర్‌ 21న ఉరితీశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.