ఏడాదిలో తెలంగాణలో రెండింతలైన ఎయిడ్స్ మరణాలు

By రాణి  Published on  13 Feb 2020 6:40 AM GMT
ఏడాదిలో తెలంగాణలో రెండింతలైన ఎయిడ్స్ మరణాలు

ఎయిడ్స్ మరణాల విషయంలో మన తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. 2019-20 గణాంకాల ప్రకారం తెలంగాణలో ఎయిడ్స్ / హెచ్ ఐ వీ బారిన పడి 4278 మంది చనిపోయారు. లోకసభలో మంత్రి అశ్విని చౌబే ఈ వివరాలను అందించారు. దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ / హెచ్ ఐ వీ వల్ల 43117 మంది 2019-20 లో చనిపోయారు. ఇందులో తెలంగాణ వాటా 4278. అంటే దాదాపు పదిశాతం ఎయిడ్స్ మరణాలు మన ఖాతాలోకే చేరతాయి. విషాదం ఏమిటంటే 2018-19 లో 2025 మంది చనిపోగా, తరువాత సంవత్సరం ఈ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగింది.

నిపుణుల కథనం మేరకు చాలా మంది ఎయిడ్స్ బాధితులు వైరస్ ఎదుగుదలను నిరోధించే యాంటీ రిట్రో వైరల్ తెరపీని పూర్తిగా పాటించకపోవడం వల్ల, మందులు మధ్యలో మానేయడం వల్ల చనిపోతున్నారు. ఈ దిశగా శ్రద్ధ వహిస్తే మరణాలను తగ్గించవచ్చునని వారంటున్నారు. మామూలు వ్యక్తిలో సీడీ4 కౌంట్ 500 వరకూ ఉంటుంది. అదే ఎయిడ్స్ పేషెంట్లలో సీడీ కౌంట్ రెండు వందల వరకూ పడిపోయే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారికి టీబీ వంటి వ్యాధులు వచ్చి, ఆరోగ్యం దెబ్బతిని మరణాలు సంభవిస్తుంటాయి. పేదరికం, మందుల ధరల భారం వల్ల చాలా మంది పేదలు మందుల వాడకాన్ని మధ్యలోనే ఆపివేయడం జరుగుతోంది. కొందరు తమకు ఉన్న వ్యాధి తీవ్రతను గుర్తించలేకపోతూంటారు. దీని వల్ల కూడా పరిస్థితి దిగజారుతుందని నిపుణులు అంటున్నారు.

అయితే ఎయిడ్స్ కు సంబంధించిన మందులు వాడటం వల్ల కడుపులో మంట, వాంతులు, గాభరాగా ఉండటం, కిడ్నీలు పాడవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి కూడా కొన్ని సందర్భాల్లో మరణాలకు దారితీస్తాయి. మరో వైపు ఎయిడ్స్ పట్ల అవగాహన లోపం ఉన్నప్పటికీ లైంగిక వ్యాధుల విషయంలో ఆన్ లైన్ కన్సల్టేషన్లు బాగా పెరిగాయి. దాదాపు 139 శాతం ఆన్ లైన్ కన్సల్టేషన్లు పెరిగాయని తేలింది. ముఖ్యంగా పెద్దల నుంచి లైంగిక పరమైన అంశాల్లో సరైన మార్గదర్శనం లభించని కారణంగా ఆన్ లైన్ ఈ-కన్సల్టేషన్లు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. హైదరాబాద్ లో ఈ కన్సల్టేషన్ ను ఉపయోగించుకుంటున్న వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి వారేనని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

Next Story