ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెయిల్..ఆనందంలో అభిమానులు..!

By Newsmeter.Network  Published on  6 Oct 2019 3:52 AM GMT
ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెయిల్..ఆనందంలో అభిమానులు..!

నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.శుక్రవారం రాత్రి కోటంరెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి తన ఇంటిపై దాడి చేశారని ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవోగా సరళ విధులు నిర్వహిస్తున్నారు. వాటర్ కనెక్షన్ ఇవ్వడంలో కాస్త లేట్ అయినందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున కోటంరెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ..ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేశారని తెలియగానే సీఎం వైఎస్‌ జగన్‌ సీరియస్‌ అయినట్లు సమాచారం. డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా ఆయన గొడవకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే..చర్యలు తీసుకోవడానికి వెనకాడొద్దని పోలీసులను సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.

ఇక నెల్లూరు రూరల్ గొడవపై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మహిళా అధికారిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. అర్ధరాత్రి ఓ మహిళ అధికారి పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే..తీసుకోవడానికి పోలీసులు జంకారంటేనే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు చంద్రబాబు.

కాసేపటి క్రితమే కోటంరెడ్డిని మెజిప్ట్రేట్ ముందు హాజరుపర్చారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు వేల సంఖ్యలో చేరుకున్నారు.

ఆ పెద్ద తలకాయ ఎవరో సీఎం వైఎస్ జగన్ విచారించాలి

తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.తనపై MPDOచేత కేసు పెట్టించింది వైఎస్ఆర్ సీపీ మండలాధ్యక్షుడని ఆరోపించారు. ఆ మండలాధ్యక్షుడు వెనకున్న వైఎస్ఆర్ సీపీ పెద్ద తలకాయ ఎవరో సీఎం జగన్ విచారణ చేయాలన్నారు. MPDOకి గతంలో ఫోన్ చేసిన మాట వాస్తవే అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి పర్మీషన్ ఇవ్వొద్దని అన్నారని MPDO తనకు చెప్పిందన్నారు. ఆ భూమిపై సమస్య ఉందని పర్మీషన్ ఇవ్వడం కుదరదని కాకాని తనతో కూడా అన్నట్లు చెప్పారు. తనను పార్టీ నుంచి దూరం చేయడానికి కొందరు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. తనను జిల్లా ఎస్పీ వేధిస్తున్నారని ఆరోపించారు కోటంరెడ్డి.

కోటంరెడ్డికి బెయిల్

అయితే..కాసేపటి క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కోటంరెడ్డి అరెస్ట్ నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ సీపీ అంతర్గత రాజకీయాలను రచ్చ చేసిందనే చెప్పాలి. వైఎస్ఆర్ సీపీకి అత్యంత బలమున్న ఈ జిల్లాలో నేతల మధ్య వార్ ఎక్కడకు దారి తీస్తుందోనని పార్టీ అధిష్టానం భయపడుతోంది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్ సభ స్థానాన్ని వైఎస్ఆర్ సీపీ గెలుచుకుంది.

Next Story