'వైఎస్సార్ ఆరోగ్య ఆసరా' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
By Newsmeter.Network Published on 2 Dec 2019 4:55 PM ISTగుంటూరు జిల్లా : సీఎం జగన్ ఏపీలో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 'వైఎస్సార్ ఆరోగ్య ఆసరా' పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఓ అంచనా. కాగా నిన్నటినుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినా ముఖ్యమంత్రి లాంఛనంగా ఇవాళ ప్రారంభించారు.
అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. రోగులకు శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి గానూ.. రోజుకు రూ. 225 రుపాయలు నుంచి నెలకు గరిష్టంగా రూ.5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందుతుందన్నారు.
రోగులకు ఈ తరహా చేయూత అందించడం దేశంలో ఇదే ప్రథమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతే కాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. దీనిలో భాగంగానే ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.. ఈ మేరకు జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీ చేయబోతున్నామన్నారు. వాటికి క్యూఆర్ కోడ్ కూడా ఇస్తామని తెలిపారు. అందులో ఆ వ్యక్తి మెడికల్ రికార్డుకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయన్నారు.
అలాగే ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల రోగాలను తీసుకువస్తామని తెలిపారు. ఈ మేరకు రూ.1000 దాటిన ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్నారు. 108, 104 సర్వీసులను మెరుగుపరుస్తూ 1060 అంబులెన్సులు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 1 నాటికి అవి అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీలో పెను మార్పులు చేస్తూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 150కి పైగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. డిసెంబరు 15 నాటికి 510 రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు. ఇవే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన ఔషధాలు అందుబాటులో ఉంటాయన్నారు. డిసెంబరు 26 నుంచి ఆస్పత్రుల్లో పరిస్థితుల మార్పు చేస్తామన్నారు.
రాబోయే మూడేళ్లలో ఆస్పత్రుల రూపురేఖలనే మార్చబోతున్నట్లు సీఎం ఈన్నారు. జనవరి 1 నుంచి పింఛన్లు. తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛను తీసుకువస్తామన్నారు. అంతే కాకుండా పక్షవాతం, ఇతర జబ్బులతో వీల్ చైర్, మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.5 వేలు పింఛను తీసుకువస్తామన్నారు.అంతే కాకుండా విజయనగరం, పాడేరు, ఏలూరు, గురజాల, మచిలీపట్నం, మార్కాపురం, పులివెందులలో కొత్త ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్యం అన్నది ఒక పర్వం. దీంతో పాటు ప్రజల అలవాట్లు మారాలి. సమాజం కూడా మారాలి. అప్పుడే వైద్యం ఖర్చు తగ్గుతుంది.
అందుకే మద్యం షాపులు క్రమంగా తగ్గిస్తున్నట్లు సీఎం తెలిపారు.