వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు తనకు ఇసుమంత సంబంధం ఉందని సిట్ విచారణలో తేలితే బహిరంగంగా ఉరేసుకుంటానని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కొద్దిరోజులుగా కడప పోలీస్ శిక్షణా కేంద్రంలో వివేకా హత్య కేసుపై సిట్ ముమ్మర విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు ఆదినారాయణ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆదేశాల ప్రకారం రేపు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని ఆయన వెల్లడించారు. విచారణ తర్వాత తనకు సంబంధం ఉందని నిర్థారణ అయితే బహిరంగంగా ఉరేసుకుంటానని, జగన్ కుటుంబానికి పాత్ర ఉన్నట్లు తేలితే వారు ఏం చేస్తారో చెప్పాలని ఆది సవాల్ చేశారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా.. జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయన్నారు. సిట్ దర్యాప్తుపై ఎవరికీ నమ్మకం లేదన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాణి యార్లగడ్డ

Next Story