నిర్మాత‌గా మారిన చిన్నికృష్ణ. తొలి చిత్రం ఇదే..!

By రాణి  Published on  16 Dec 2019 12:39 PM GMT
నిర్మాత‌గా మారిన చిన్నికృష్ణ. తొలి చిత్రం ఇదే..!

హైదరాబాద్ : నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్, జీనియస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను అందించి సెన్సేషనల్ కథా రచయితగా పేరుతెచ్చుకున్న చిన్నికృష్ణ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ.. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ ని స్థాపించారు. తొలిప్రయత్నంగా "కింగ్ ఫిషర్" వంటి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తనయులు చిరంజీవి సాయి, బద్రీనాథ్ నిర్మాతలుగా పరిచయమవనున్నారు.

అలాగే యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం బ్యానర్, టైటిల్ లోగో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపి రఘురామ కృష్ణంరాజు, ప్రముఖ సీనియర్ దర్శకులు బి.గోపాల్, ప్రముఖ రచయితలు వి.వి.విజయేంద్రప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, యువ దర్శకుడు కె.యస్.రవీంద్ర {బాబీ}, మాధవ్ పట్నాయక్ (కన్స్యూమర్ కోర్ట్ జడ్జి), నిర్మాతలు రాధామోహన్, దాసరి కిరణ్, కత్తి మహేష్, హీరో అవీష్, బాలకృష్ణ అభిమాని జగన్ పాల్గొన్నారు.

చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగోని వి.వి.విజయేంద్రప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చిన్నికృష్ణ స్టూడియోస్ అధినేత చిన్నికృష్ణ మాట్లాడుతూ తెనాలి నుండి సినిమాల మీదున్న ఇష్టంతో చెన్నపట్నం వెళ్లి భాగ్యరాజా ద‌గ్గర రచయితగా పనిచేశానని చెప్పుకొచ్చారు. సుజాత రంగరాజన్ కి ఏకలవ్య శిష్యుడిగా రచనలో ఓనమాలు నేర్చుకున్నానన్నారు. ఆ తర్వాత పరుచూరి సోదరులు, బి.గోపాల్ ప్రోత్సాహంతో చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ ఆవిష్కృతమయిందన్నారు. ఈ బ్యానర్ ద్వారా నటీనటులకు టెక్నీషియన్స్ కి కుల, మతాలకు అతీతంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే విధంగా సినిమాలు రూపొందించాలని పక్కాప్రణాళికతో మొదటి చిత్రంగా కింగ్ ఫిషర్ తో స్టార్ట్ చేశామన్నారు.

''ఈ చిత్రానికి అత్యంత ప్రతిభ గల ఓ యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. కింగ్ ఫిషర్ అనేది మల్టిపుల్ కలర్ వున్న ఒక రకమైన పక్షి పేరు. జనరల్ గా కింగ్ ఫిషర్ అంటే మత్తు, గ్యాస్ ఫిల్ చేసి కలిపి బాటిల్లో పోస్తే బీర్ అవుతుంది. అది తాగితే కిక్ ఇస్తుంది. మా కింగ్ ఫిషర్ మత్తుని వదిలిస్తుంది. 2014 నుండి ఇప్పటివరకు నేను ఎంతో మందిని చూశాను. నన్ను మోసం చేసిన వారిని, ఇతరులని మోసగించిన వారిని అందర్నీ పరిశీలించాను. వారి మానవత్వాన్ని, హ్యూమన్ రిలేషన్స్ ని ఒక బాటిల్ లో పొందుపరిచాను. అదే ఈ కింగ్ ఫిషర్. మోసగించే వాళ్ళ మత్తుని వదిలించి సమాజంలో మంచి మనుషులుగా మారుస్తుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు. మ‌రి ర‌చ‌యిత‌గా ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన చిన్నికృష్ణ నిర్మాత‌గా రాణిస్తాడో లేదో చూడాలి.

Next Story