పాల ఉత్పత్తులను కాపాడుదాం.. నేడు ప్రపంచ పాల దినోత్సవం

By సుభాష్  Published on  1 Jun 2020 2:47 AM GMT
పాల ఉత్పత్తులను కాపాడుదాం.. నేడు ప్రపంచ పాల దినోత్సవం

100 శాతం పోషక విలువలు, విటమిన్‌ బి12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు, టీనేజి పిల్లల్లో, విద్యార్థుల్లో, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. రానురాను వాతావరణ సమతుల్యం లోపం వలన, మేత దొరకక పశుపోషణ కష్టమైంది. దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ పాలను మంచి వ్యాపార వస్తువుగా మలచుకొని అనేక డైరీలు వెలిశాయి. అయితే డైరీల్లో పాలు నిల్వవుండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటి వల్ల పాలల్లో పోషకాల సంఖ్య తగ్గిపోతోంది. పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్రభాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్‌ 1 నుండి ఫుడ్‌, అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు.

ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పాల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రజల్లో పాల వినియోగం పట్ల అవగాహన, పాలన ఉత్పత్తులకు ప్రచారాన్ని కల్పించడం కోసమే ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. భారత దేశ పాడి పరిశ్రమ నవంబర్‌ 26న జాతీయ పాలదినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించింది. భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్ఘీష్ కురియన్‌ 93వ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఆరోగ్యకరమైన జీవితానికి పాలు ప్రతి ఒక్కరికి అవసరం:

కాగా, మనిషి రోజూ 350 మిల్లీ లీటర్ల పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పాల ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆరోగ్యకర జీవితం గడపడానికి పాలు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఆరోగ్యం బాగుండాలంటే ఆనందంగా ఉండగలం. అందు వల్ల ప్రతి కుటుంబానికి పాలు నిత్యావసరం లాంటివి. ఉదయం లేవగానే టీ, కాఫీ, పాలు తాగేవారు అనేక మంది ఉన్నారు. మూడు పూటల టీ తాగేవారు చాలా మంది ఉంటారు. టీ లేనిది మనసు ఊరుకోదు. ఉప ఉత్పత్తుల రూపంలోనూ పాలు మనిషికి ఎన్నో రకాలుగా అవసరం అవుతుంటాయి. భోజనంలో పెరుగుగా, దాహం తీర్చే మజ్జిగగా, వెన్న, నెయ్యి, పన్నీరు, పాలకోవా, ఇలా అనేక సమయాల్లో అనేక రకాలుగా పాల అవసరం మనిషికి ఉంటుంది. పాలు లేని ప్రపంచం ఊహించలేమనే చెప్పాలి.

మన దేశంలోని గ్రామీణని గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ప్రతి సంవత్సరం పాడి పశువులు ఉండేవి. ఇప్పుడు పాడిపశువుల సంఖ్య చాలా మట్టుకు తగ్గిపోయింది. 10 నుంచి 15 ఏళ్లుగా వ్యాపార పరంగా గేదెల ఫారమ్‌ల ద్వారా పాల ఉత్పత్తి చేయడం ప్రారంభమైంది. అయినా పాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఎందుకంటే అందుకు తగ్గట్లుగా ఉత్పత్తి లేదు. పాల పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వాల తరపున పలు రాయితీలు అందిస్తోంది. పశువుల పెంపకంలో బ్రెజిల్‌ మొదటిస్థానంలో ఉండగా, మన దేశం రెండో స్థానంలో ఉంది. పాల్ప ఉత్పత్తతిలోనూ ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్‌ నిలిచింది.

ప్రపంచ పాల ఉత్పత్తిలో మన దేశం 21 శాతం కలిగి ఉండటం విశేషమనే చెప్పాలి. ఇక మన దేశంలో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉండగా, రాజస్థాన్‌ రెండో స్థానంలో ఉంది. ఇక మధ్యప్రదేశ్‌ మూడో స్థానం, ఏపీ నాలుగోస్థానం, గుజరాత్‌ ఐదో స్థానాల్లో ఉన్నాయి.

పాల ఉపయోగాలు:

పాల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పాలల్లో జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తులు ఉంటాయి. ఇందులో అధిక శాతం పోషకాలు, కాల్షియం, ప్రోటీన్‌లు లభిస్తాయని యూకేలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ చెబుతోంది. పాలలో ఉండే విటమిన్‌ ఏ, డీలు ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు పాల వల్ల ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, జింక్‌, అయోడిన్‌ వంటి పోషకాలన్నీ లభిస్తాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా మనం తీసుకునే బాదం, సోయా పాలల్లో అలాంటి పోషకాలేవి ఉండవు. కేవలం చక్కెర శాతం మాత్రమే అధిక స్థాయిలో ఉంటుంది. అలాగే ఆవు పాలు అనేవి వ్యాయమం చేసేవారికి ఎంతో అవసరం. కార్పోహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌ తగిన నిష్పత్తిలో ఉండే పరిపూర్ణమైన ఆహారం. వీటిని తాగడం వల్ల కండరాల పునరుద్దరణ ఉత్తేజపడుతుంది.

Next Story