మొక్కలు నాటుదాం..భూదేవిని రక్షించుకుందాం..

By రాణి  Published on  22 April 2020 6:11 AM GMT
మొక్కలు నాటుదాం..భూదేవిని రక్షించుకుందాం..

ముఖ్యాంశాలు

  • భూ కాలుష్యం పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి ?
  • భూదేవికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని

ప్రపంచ ధరిత్రి దినోత్సవం (world's earth day). ఏటా ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి జరుపుకుంటాం. భారతదేశంతో పాటు సుమారు 175 ప్రపంచ దేశాలు ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటాయి. 1970 నుంచి మనం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సమస్త జీవకోటి భారాన్ని మోసే భూమిపై మానవ రూపంలో చేసే తప్పిదాలే అధికం.

మనిషి బ్రతికేందుకు కావాల్సిన ఆక్సిజన్ ను పొందడానికి చెట్లు చాలా అవసరం. కానీ ఆ విషయాన్నే మరిచిపోయి అడవులను నరికేసి టెక్నాలజీ, ఫ్యాక్టరీలు, కల్చర్, కొత్త జనరేషన్ అంటూ మనల్ని మనమే పతనం చేసుకుంటున్నాం. పారిశ్రామీకరణ వల్ల పెరుగుతోన్న కాలుష్యం, పర్యావరం గురించి మన అజాగ్రత్తే మన కొంపముంచుతోంది. ఇప్పుడు మనుషుల్ని పట్టి పీడిస్తోన్న కరోనా కూడా అంతే. ఎక్కడో చైనాలో వాడేదో తినడం ఏంటి ? వాళ్ల నుంచి వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించడం ఏంటి ? ఏది ఎంతవరకు ఉపయోగమో అంతవరకే వాడటం మంచిదని కరోనా కొత్త పాఠం నేర్పింది. మనుషులు ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదన్న విషయాలను గుర్తు చేసింది.

Also Read : కర్ణాటక ప్రభుత్వం వినూత్న ప్రయత్నం..బెంగళూరులో ట్రయల్

డబ్బున్న ప్రతివారూ ఇంట్లో ఖచ్చితంగా కుక్కలను పెంచుతారు కానీ..మొక్కల్ని ఎందుకు నాటరు ? ఏ ట్విట్టర్లోనూ ఎవరో ఒకరు మొక్కలు నాటే ఛాలెంజ్ ప్రారంభించి సెలబ్రిటీలను నామినేట్ చేస్తారు. నామినేట్ చేశారు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా మొక్కలు నాటేస్తారు. కానీ నిజంగా మనస్ఫూర్తిగా మొక్కల్ని పెంచాలన్న ఉద్దేశ్యంతో ఆ పని చేసేవారు చాలా తక్కువ. నేలతల్లిని కాపాడాలంటే ఎక్కువ చెట్లు పెంచాలి.

మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకూ మన భారాన్ని మోసేది భూమి. మనం ఏం చేసినా భరిస్తుంది. ఆఖరికి మనం చనిపోయాక మనని తనలో ఏకం చేసుకుంటుంది. ఎండకు ఎండి బీడువారిపోయిన నేల వానచినుకు పడగానే పులకరించిపోతుంది. తన్మయత్వంతో పరిమళిస్తుంది. మనం తినడానికి కావాల్సిన వాటిని పండేలా చేసేది భూ తల్లే. మన సమస్త అవరాలను అందించేది భూ దేవే. అన్నం, పప్పు ధాన్యాలు, పసుపు, కుంకుమ, దుంపలు ఆఖరికి మనం నడిపే వాహనాల్లోకి కావాల్సిన పెట్రోల్, డీజిల్ ను, వంట చేయడానికి కావాల్సిన గ్యాస్ ను కూడా భూగర్భం నుంచే తవ్వి తీస్తున్నాం.

Also Read : ఆదుకోవాల్సిన సమయంలో..ప్రజల ప్రాణాలతో చెలగాటమా ?

మనందరికీ ఇన్ని ఇస్తున్న భూ దేవికి తిరిగి మనం ఏం ఇస్తున్నాం అని ప్రశ్నించుకుంటే సమాధానం శూన్యం. ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం అనగానే ఎక్కడలేని భక్తి పొంగు పొర్లుతుంది. ఆ మర్నాటి నుంచి మళ్లీ మామూలే. ఎవరికి వారు తమతమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. నిజానికి ధరిత్రీ పర్యావరణ పరిరక్షణకు మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

పర్యావరణంలో కాలుష్యం పెరగకుండా వీలైనంత వరకూ సైకిల్ లేదా నడక మార్గాన్ని ఎంచుకోండి. చిన్న చిన్న అవసరాలకు కూడా కార్లు, బైక్ ల వాడకాలను తగ్గించాలి. మాంసాహారాన్ని తినడం తగ్గించడం వల్ల కార్బన్ ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. పరిసరాల్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. అలాగే ప్లాస్టిక్ వాడకాలను తగ్గించాలి. కేవలం ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం వల్లే భూభాగంలో వ్యర్థాలెక్కువగా పేరుకుపోతున్నాయి. ఎక్కువగా రీసైక్లింగ్ కు పనికొచ్చే వస్తువులను వాడటం ఉత్తమం.

భూదేవికి కృతజ్ఞతలు : మోదీ

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మనమంతా నేలతల్లికి కృతజ్ఞతలు తెలపాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. '' ప్రతి నిత్యం సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ..కంటికిరెప్పలా కాపాడుతున్న భూమాతను మనం రక్షించుకోవాలి. మనందరినీ కాపాడుతున్న భూమాతకు మనమెంతో రుణపడి ఉన్నాం. మనం జీవిస్తున్న ఈ భూ గ్రహాన్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రస్తుతం భూ మండలాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమికొడదాం.'' అని ప్రధాని సందేశమిచ్చారు.



Next Story