ప్రాణాలతో పోరాడి ఓడిన లోకేశ్వరి..!
By రాణి Published on 1 Jan 2020 10:31 AM GMTపంజాగుట్ట పీఎస్ ఎదుట డిసెంబర్ 31, 2019న ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ లోకేశ్వరి (40) ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే...హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పీఎస్ ఎదుట మంగళవారం చెన్నైకి చెందిన లోకేశ్వరి (40) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది లోకేశ్వరి ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పి, ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నిమ్స్ ఆస్పత్రికి తరలించగా...ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నగరమంతటికీ మోడల్ పోలీస్ స్టేషన్ గా నిలిచిన పంజాగుట్ట పీఎస్ ఎదుటే ఈ ఘటన జరగడంతో పోలీస్ అధికారులంతా ఉలిక్కిపడ్డారు.
భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన లోకేశ్వరి..కొద్దిసేపటికే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. లోకేశ్వరికి, తన భర్తకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని వారాసిగూడకు చెందిన ప్రవీణ్ కుమార్ పంజాగుట్టలో గోల్డ్ షాప్ ను రన్ చేస్తున్నాడు. అందులో పనికోసం చేరిన మహిళ లోకేశ్వరి ఎంఎస్ మక్తాలో నివాసముండేది. ఈ నేపథ్యంలో షాపు ఓనర్, అందులో పనిచేసే లోకేశ్వరిల మధ్య ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. కొద్దికాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో..వేర్వేరుగా ఉంటున్నారు. అయితే సహజీవనం చేసిన సమయంలో లోకేశ్వరి ప్రవీణ్ కు రూ.7.5 లక్షలు ఇచ్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. తనను అన్ని విధాలుగా వాడుకుని మోసం చేశాడని తెలుసుకున్న లోకేశ్వరి కొద్దిరోజుల క్రితం చెన్నైకి వెళ్లిపోయింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు గానీ...తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. వచ్చిన కొద్దిసేపటికే ఆత్మహత్యాయత్నం చేసి, ఉస్మానియాలో చికిత్స పొందుతూ కొత్త సంవత్సరంలో ప్రాణాలొదిలింది.