మే 10ఆదివారం నుండి 16 శనివారం వరకు రాశి  ఫలాలు

By సుభాష్  Published on  10 May 2020 5:51 AM GMT
మే 10ఆదివారం నుండి 16 శనివారం వరకు రాశి  ఫలాలు

మేషరాశి :- ఈ రాశి వారికి శుభ ఫలితాలు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. ఆర్థికంగా బాగుంది. ఉద్యోగంలో మార్పు అసంతృప్తిని ఇచ్చినా అనేక రకాలుగా ఆరోగ్యంతో సహా అన్ని కుదుట పడే అవకాశం ఉంది. బుధవారం నుండి మరింత అనుకూలిస్తాయి. సుఖ సౌఖ్యాలు ధన ప్రాప్తి ఉంది. మానసికంగా మాత్రం మీరు భయా అనుభూతిని పొందుతారు. ఎక్కడికి వెళ్లినా మీకు శత్రువర్గం పనిచేస్తూనే ఉంటుంది. కొంతవరకు మాత్రం మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. విద్యా పరంగా కొంతవరకు అభివృద్ధి సాధించొచ్చు. భూములు ఇళ్లు వ్యాపారం ఈ విషయాల్లో మాత్రం ఆచితూచి అడుగు వేయండి. దానివల్ల భవిష్యత్తులో మీరు మంచి లాభాన్ని పొందబోతున్నారు. అశ్విని నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది బావుంది. భరణీ నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. కృత్తికా నక్షత్ర జాతకులకు నైధన తారైంది కాబట్టి జాగ్రత్త వహించండి.

పరిహారం :- మంగళవారం నియమాలు ఎక్కువగా పాటించండి మీకు మంచి లాభం చేకూరుతుంది. బుధవారం నాడు నానబెట్టిన పెసలు ఆవుకి తినిపించండి. అమ్మవారిని పూజించండి.

వృషభరాశి :- ఈ రాశివారికి ఆకస్మిక విశేష ధన లాభం ఉంది. ఎంత సంపాదిస్తారో అంత కూడా పోగొట్టుకునే అవకాశం కూడా వుంది. ఎందుకంటే వృషభ రాశి కి శుక్రుడు అనుకూలించనప్పటికీ రవి బుధులు అందులో చేరటం కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితుంది.అయితే కుటుంబ పరంగా బాగుంటుంది. అలాగే బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. కానీ వ్యాపార విషయాల్లో కొంత సర్దుకు పోగలిగినా ఉద్యోగమైన ట్లయితే మాత్రం ఇబ్బంది నెదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఎవరితో ఏది మాట్లాడినా వారికి మీ అభిప్రాయాలు తప్పుగా అందుతుంటాయి కాబట్టి మౌనం వహించడం ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం. భూ సంబంధ వ్యవహారాలు బానే ఉంటాయి. మధ్యవర్తిత్వం మాత్రం కొంచం తగ్గించుకోండి . అతిగా ఎవరినీ నమ్మకుండా ఉండటం చాలా అవసరం. కృత్తికా నక్షత్ర జాతకులకు నైధన తారైంది చాలా వ్యతిరేక ఫలితాలున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు సాధన తారైంది మీరు అనుకున్నవన్ని సాధించగలుగుతారు. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి ప్రత్యక్తారైంది కాబట్టి మీకు సమాజం వ్యతిరేకంగా పనిచేస్తుంది.

పరిహారం :- ఆరోగ్య ఇబ్బందులున్నాయి రవికి ఆదిత్య హృదయ పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి బుధవారం నియమాలతో పాటుగా శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేయండి.

మిధున రాశి :- ఈ రాశివారికి ఓ ప్రక్క ధనం వస్తున్న దాన్ని తన్నుకుపోయే వ్యతిరేక శక్తులు బాగా పనిచేస్తాయి. అందుచేతనే వీరికి ప్రతికూలతలు ప్రారంభమయ్యాయి.రావాల్సిన బాకీలు చాలా వసూళ్లు ఔతాయి అయితే అంతకంతా ధనం వ్యయం ఐపోతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి చాలా ఇబ్బందికరమైన అనారోగ్య పరిస్థితి ఉంది . జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. పాత కలహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ధనలాభం విపరీతంగా ఉంది. గురుడు ప్రతికూలతలు ఉన్నాడు అలాగే రవి ప్రతికూల కూలంగా ఉన్నాడు. కాలసర్ప యోగం వర్తిస్తుంది. మీకు పదమూడు తేదీ నుంచి ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్తారైంది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. ఆరుద్ర వారికి క్షేమ తారైంది కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి విపత్తార యింది కాబట్టి అనను కూలత ఉంది.

పరిహారం :- రాహు కేతువులకు మినుములు ఉలవలు దానం చేయించండి. రవి బుధులకు ఆదివారం బుధవారం నియమాలు పాటించండి ఆదివారం గోధుములు వంటకాన్ని సూర్యునికి నివేదించండి.

కర్కాటక రాశి :- ఈ రాశివారికి ఎన్నడూ లేనంత ఆనందం ఆశ్చర్యం అద్భుతం అన్ని కూడా కలిసొస్తాయి. ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఆదాయం బావుంది. ఆరోగ్యం బాగుంది. మోటారు వాహనాలపై ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. ఎన్నడూ లేనంత ఆనందాన్ని పొందగలుగుతారు. మిత్రుల సహకారము అధికారుల సహకారము తోటి ఉద్యోగుల సహకారము అన్ని లభిస్తాయి. ఎంత ఆదాయం వచ్చినా అందుకు తగ్గ వ్యయం సిద్ధంగానే ఉంటుంది. మంచి ఫలితాలు మీరు ఎవరిని ఏ విషయంలో సంప్రదించినా అనుకూలంగా మీకు వారు మాట ఇస్తారు ఇవ్వడమే కాదు పని కూడా పూర్తిచేసే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వచ్చే వారం కూడా చాలా బాగుంటుంది. పునర్వసు నాలుగో పాదం వారికి విపత్తారైంది అననుకూలత ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు సంపత్తు తారైంది కాబట్టి చాలా విశేష ఫలితాలు ఉన్నాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు జన్మ తారైంది మీ కృషి మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

పరిహారం :- మంగళవారం శుక్రవారం అమ్మవారిని దర్శించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి ఆంజనేయస్వామిని దర్శించండి. దేవీ ఖడ్గ మాల పారాయణ శుభ ప్రదం.

సింహరాశి :- ఈ రాశి వారికి శుభ ఫలితాల స్థితి కొనసాగుతుంది. అయితే ఆరోగ్య రీత్యా ధనవ్యయం తప్పదు. సౌఖ్యం ఎంతుందో విచారం కూడా వీరికి అదే స్థాయిలో లభిస్తుంది. కార్యం ఎంత వేగంగా నెరవేరుతుందో అందులో ఆటంకాలు కూడా అలాగే సమపాళ్లలో వీరికి వారం నడుస్తుంది. తెలివితేటలు ఉపయోగిస్తే వీళ్లు ప్రతి ఒక్క దాంట్లోంచి బయటికి రాగలుగుతారు. వీరి సామర్ధ్యం టాలెంట్ బయటపడుతుంటుంది. క్షణక్షణం లో వీరు ఎదుర్కొనే సమస్యల్ని వీరి తెలివితేటలు అందరూ మెచ్చుకుంటారు. శని వక్ర కారణంగా వీరికి అనుకూలత పెరుగుతుంది. ఒక మహా సమస్య లోంచి బయటకి రాగలుగుతారు. కుటుంబంలో మాత్రమే ప్రతికూలత ఉంది. అకాల భోజనం ఇలాంటివన్నీ సంప్రాప్తం మవుతాయి. ఒక్క దగ్గర మాత్రం కార్యహాని తప్పదు. అది పై అధికారులు తాలుకా ఒత్తిడి కావచ్చు లేదా తన బంధువులు ఒత్తిడి కూడా కావచ్చు. మఖా నక్షత్ర జాతకులకు పరమమిత్రతార యింది చాలా బాగుంది. పుబ్బ నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది శుభ పరంపరలు ఫలితాలు బాగున్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి మాత్రం నైధన తారైంది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- సూర్య నమస్కారాలు చేయండి. ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు తమలపాకులతో పూజ చేయించండి.

కన్యా రాశి :- ఈ రాశి వారు ఈ వారంలో మంచి ఫలితాల్ని చవి చూడబోతున్నారు. మానసికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా బాగుంటూ కుటుంబంతో ఆనందాన్ని పంచుకుంటారు. కించిత్తు గౌరవ భంగం పొందినా ఎదుటి వాళ్లు వీరి తాలూకు మనసుని అర్థం చేసుకుంటారు. వాళ్లలో పరితాపం వచ్చి క్షమార్పణ అడుగుతారు. మానసిక ఆందోళనలు అనేవి వీరికి తప్పదు. ధనవ్యయం ఎంతుందో ధనాదాయం కూడా అంతా పెరుగుతుంది. గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. వీరికి ఈ వారంలో ఒక మంచి పని చేసి అందరి తాలుకా మన్నల్ని పొందే అవకాశం ఉంది . రవి బుధులు స్థలం మారడం వల్ల కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ధైర్యంతో ముందడుగు వేయండి మీ పనులు మీరు నెరవేర్చుకుంటారు. సంతానానికి అనారోగ్య సూచన ఉంది జాగ్రత్త వహించండి. స్థిరాస్తులు విషయంలో ఈ వారం అనుకూలంగా లేదు. ఉద్యోగ అభివృద్ధి కూడా కన్పించటం లేదు కానీ భవిష్యత్ ప్రణాళిక మాత్రము సిద్ధం కాబోతోంది. వచ్చే వారంలోనే మంచి ఫలితాన్ని మీరు పొందబోతున్నారు దానికి నాంది ఈ వారంగా భావించండి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వారికి నైధన తారైంది. ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు సాధన తారైంది మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. చిత్త ఒకటి రెండు పాదాల వారికి ప్రత్యక్ తారైంది అననుకూలత ఉంది.

పరిహారం :- సూర్య నమస్కారాలు చేయండి. మంగళవారం నాడు అమ్మవారికి ప్రీతి పాత్రంగా బెల్లం వడపప్పు నివేదన పెట్టండి మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారు.

తులా రాశి :- ఈరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. అన్నీ అనుకూలంగా ఉంటాయి చేతికే ఏదీ అందిరాదు. అనుభవించే యోగం తక్కువగా ఉంది. సౌకర్యాలుంటాయి. అధికారం ఉంటుంది. ఉద్యోగం ఉంటుంది. ధనం ఉంటుంది. మిత్రులు బంధువులు అందరూ ఉంటారు కానీ ఒంటరిని అనే భావన మాత్రం ఎక్కువగా వుంటుంది. రవి అష్టమ స్థానంలోకి వెళ్లడమే ఇబ్బంది కలిగిస్తోంది. బుధుడు బానే వుంది. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే సానుకూలంగా ఉంటాయి. రావలసిన బాకీలు వసూలవ్వడం ఉంది. ధనలాభం ఉంది. ధన వ్యయం కూడా అదేస్థాయిలో ఉంది. ఆరోగ్య విషయంలో మీరు అశ్రద్ధ చేస్తున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మీకు కంటికి సంబంధించి లేదా ఉదర సంబంధమైన అనారోగ్యం ఈవారంలో కనిపిస్తోంది జాగ్రత్త వహించండి. చిత్త మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్ తారైంది అననుకూలత ఎక్కువగా ఉంది . స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం క్షేమ తారైంది కాబట్టి ఫలితాలు చాలా బావున్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి విపత్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయించండి. రాహు కేతువులకు పూజలు చేయడం లేదా మినుగులు ఉలవలు దానం చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాయి.

వృశ్చిక రాశి :- ఈ రాశివారికి ఈ వారంలో శుభ ఫలితాలు పెరిగాయి. ఆదాయపరంగా గౌరవ పరంగా చాలా బావున్నాయి. ఒక శాశ్వత పథకానికి మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. వాటికి అనుకూలమైనటువంటి రోజులు మీకు ప్రారంభమయ్యాయి. ఓ ప్రక్క మానసిక ఆందోళన ఉన్నప్పటికీ గురుడు వక్రించి అటువంటి స్థితి వల్ల మీకు అన్నీ కూడా మంచి ఫలితాల్ని ఇవ్వబోతున్నాయి. ఏ చిన్న పని చేసినా మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కొన్ని విషయాల్లో మీరు కల్పించ ఆందోళనకి గురవుతారు . దాన్నుంచి బయటపడ్డానికి భగవంతుని ప్రార్థించండి. ఏదేని విలువైన వస్తువునో వ్యక్తుల్నో మిత్రుల్నో చేజేతులా పోగొట్టుకునే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త వహించడం వల్ల వాహన ప్రమాదాలు లేకుండా ఉండగలుగుతారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. దైవ ధ్యానంతో అధిగమిస్తారు. సంపదలాభం కూడా ఉంది .విశాఖ నక్షత్ర నాలుగో పాదం వారికి విపత్తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది చాలా బాగుందీ. జ్యేష్టా నక్షత్ర జాతకులు కష్టపడితే ఫలితం లభిస్తుంది.

పరిహారం :- దేవి ఖడ్గమాల లేదా లలితా సహస్రనామ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ధనురాశి :- ఈ రాశి వారికి అనుకూలత కొద్దిగా పెరిగింది . అలంకార ప్రాప్తి చక్కని కుటుంబ సౌఖ్యము రోగ నివారణ ధనలాభం ఇవన్నీ మీరు ఈవారంలో పొందబోతున్నారు. కాలసర్ప యోగం ప్రభావం వీరిపైనే ఎక్కువగా చూపిస్తోంది కాబట్టి జాగ్రత్త వహించిన చాలా అవసరము. రేపటి నుండి అనగా సోమవారం నుండి వీరికి ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తోంది. అదొక్కటే అధిగమిస్తే చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురుశనుల వక్ర ఫలితాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి బావుంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్నంతవరకు మీకు తిరుగే ఉండదు. అలాగ్గా మీరు ఆలోచన చేసుకుంటే ఫలితాన్ని మీరు చక్కగా చవి చూడగలుగుతారు. వాక్ స్థానం శుద్ధి చేసుకోండి. మాటలు తీరు మార్చండి. మూలా నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయ్యింది ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఉత్తరాషాడ ఒకటో పాదం వారిక నైధన తార అయ్యింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- నల్ల నువ్వులు దానం చేయండి నల్లని వస్త్రాన్ని దానం చేయండి శనివారం నియమాన్ని పాటించండి.

మకర రాశి :- ఈ రాశివారికి అగ్ని పరీక్షలా ప్రస్తుత పరిస్థితులున్నాయి. గ్రహాలన్నీ ప్రతికూలంగా పనిచేస్తున్నాయి . ఏ మాట మాట్లాడినా ఏ పని చేద్దామనుకున్న అన్ని వ్యతిరిక్తంగా సంప్రాప్తమయ్యే స్థితి. అగౌరవం మానసిక బాధ ధన లేమి సమయానికి మిత్రులు గాని బంధువులు గాని సహకరించకపోవడం మాట సహాయం కూడా అందకపోవడం ఇవి మిమ్మల్ని బాగా కుంగదీస్తాయి. దైవధ్యానం వల్ల మీరు మాత్రం ఇందులోంచి బయటపడతారు. ఆర్థిక సంబంధాలు కూడా కుంటుపడతాయి. వ్యయం మాత్రం తప్పదు. రవి బుధులు ప్రతికూలంగా మారారు. దాని వల్ల మీరు బుధవారం నుండి ఇంకొంచెం ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జన్మశని ఇబ్బంది ఎలాగూ ఉంది . కాలసర్ప యోగం కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తోంది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తార అయ్యింది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రవణానక్షత్ర జాతకులకు సాధన తారైంది కాబట్టి మీ పనులను మీరు నెరవేర్చుకుంటారు. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి ప్రత్యక్తారైంది ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- నల్ల నువ్వులు నల్ల వస్త్రములు దా బియ్యం దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

కుంభ రాశి :- ఈరాశి వారికి శని వక్రించడం కొంచెం సుఖాన్ని చేకూరుస్తుంది. గురుడు వక్రించడం మీకు పరీక్ష పెట్టబోతోంది. జన్మ శని ప్రభావము కాలసర్ప యోగ ప్రభావం మీపై ఎక్కువగా పనిచేస్తాయి. లగ్నం నందున్న కుజుడు మీకు ప్రతికూలతనే చూపిస్తున్నాడు. రవి బుధులు మాత్రం నాలుగో స్థానానికి వెళ్లడం వల్ల శత్రు జయాన్ని సంపద సౌఖ్యాన్ని ఇస్తున్నారు. స్త్రీ సౌఖ్యం ఉంది దాని ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందారు. పొందబోతున్నారు కుడా. ధన వ్యయం అలవాటు పడిపోయారు. కుటుంబ సౌఖ్యం ఒకటి దక్కుతోంది. ఉద్యోగంలో విశేషంగా ముందుకు దూసుకెళతారు వ్యాపారంలో కూడా బావుంటుంది. లాభనష్టాలు మీకు కొంతలో కొంత అనుకూలంగా మారతాయి. మిమ్మల్ని అగౌరవ పరచాలి అనుకున్న వాళ్లు ఇబ్బంది పడతారు. వాళ్లే మిమ్మల్ని మళ్లీ గౌరవిస్తారు. ధనవ్యయం జరిగిన దానివల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మీ జాతకంలో కొద్దిపాటి మార్పు కనిపిస్తుంది. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్ తార అయ్యింది కాబట్టి ప్రతికూలత ఉంది. శతభిషా నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది మంచి ఫలితాలు ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి విపత్తార అయ్యింది. ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- బుధవారం నాడు ఉదయం పూట నానవేసిన పెసలు ఆవుకు తినిపించండి. శనికి జపం చేయండి నవగ్రహాల దర్శనం చేయండి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.

మీన రాశి :- ఈ రాశివారికి విశేష ధన లాభం సౌఖ్యం రెండు కలిసొస్తున్నాయి. రవి బుధులు ఒకరు సంపద నిస్తే ఇంకొకరు ఆ సంపదని పోగొట్టే పరిస్థితిలో ఉన్నారు. మీకు బాకీ లేమన్నా ఉన్నట్లైతే ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. మీకు వ్యతిరేకంగా పనిచేసే వారు పెరుగుతున్నారు. ధనం ఉంటుంది గనుక సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది కనుక మీకు కష్టాలుగా కనిపించవు. మానసికంగా మీరు సంసిద్ధులై ఉంటారు దానివల్ల కూడా మీకు సౌఖ్యం ఎక్కువగా లాభం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. రాహుకేతువులు మాత్రమే మీకు ప్రతికూలతను ఇస్తున్నారు. కాలసర్ప యోగం కూడా వర్తిస్తుంది కాబట్టి ఏ పని తలపెట్టినా నిదానంగా వెళ్లండి. ఆర్థిక స్తోమత ఉంది కదా అని దూసుకు వెళ్లకండి. చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. మార్గమధ్యంలో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి విపత్తు తార అయింది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర వారికి మాత్రమే సంపత్ తారైంది పనులన్నీ నెరవేరతాయి. రేవతి నక్షత్ర జాతకులకు జన్మ తారైంది కష్టే ఫలి అన్నట్లుగా ఉన్నాయి. మీ శ్రమకి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు.

పరిహారం :- గురుబలం కోసం దక్షిణామూర్తి స్తోత్రం చేయండి. కుజుడు వ్యయమందున్నాడు గాబట్టి సుబ్రహ్మణ్యుని పూజ చేయించుకోండి మంచిఫలితాలొస్తాయి.

Next Story