రష్యాని పుతిన్ శాశ్వతంగా ఏలతాడా..?

By Newsmeter.Network  Published on  18 Jan 2020 4:59 AM GMT
రష్యాని పుతిన్ శాశ్వతంగా ఏలతాడా..?

ముఖ్యాంశాలు

  • భారీ స్థాయిలో రష్యాలో రాజ్యాంగ సంస్కరణలు
  • తన పదవికి రాజీనామా చేసిన ప్రధాని మెడ్విదేవ్
  • పార్లమెంట్ కే పూర్తి అధికారాలు అంటున్న పుతిన్
  • కేవలం తను నామమాత్రంగా ఉంటానని వివరణ
  • దేశ భవిష్యత్తుకోసమే ఈ నిర్ణయమన్న పుతిన్
  • అధికారంకోసమే ఈ పాట్లు అంటున్న అప్పోజిషన్

వ్లాదిమర్ పుతిన్. రష్యాపై బలమైన ముద్రవేసిన బలమైన నవతరం నాయకుడు. స్టాలిన్ తరహాలో రష్యాని ఏలాలని చూస్తున్నారు. బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ. అది సాధ్యమయ్యే విషయమేనా? అవుననే చెబుతోంది పుతిన్ అంతరంగం. అందుకోసం కావాల్సిన పావుల్ని వేగంగా కదుపుతున్నారాయన. ఉత్తేజపూరితమైన తన ప్రసంగాల ద్వారా దేశంలో మెజారిటీ ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నేరుగా రాజ్యాంగానికి సవరణలు చేసి నేరుగా రాజుగారి కుర్చీలోనే చివరి శ్వాసవరకూ కూర్చునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు.

ప్రెసిడెంట్ గా పదవీకాలం ముగిశాక తన చేతుల్లోంచి పవర్ జారిపోవడానికి వీల్లేదన్న గట్టి పట్టుదలతో ఉన్నారు పుతిన్. 2024 తర్వాత కూడా అధికారం తన చేతుల్లో ఉండే విధంగా రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా వెనదీయడంలేదు. అందుకోసం ప్రధాని డిమిట్రి మెడ్విదేవ్ తో రాజీనామా కూడా చేయించారు. టాప్ పవర్ కేడర్ లో తన తర్వాతి స్థానాన్ని మెడ్విదేవ్ కి కట్టబెట్టారు.

కెబిజి ఏజెంట్ గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈ బలమైన నాయకుడు మొత్తంగా వ్యవస్థనే మార్చేయాలని కలలు కంటున్నారు. ప్రెసిడెంట్ చేతిలో ఉన్న అధికారాన్ని పార్లమెంట్ కి, స్టేట్ కౌన్సిల్ కి పూర్తిగా అప్పగించి తాను కర్రపెత్తనం మాత్రం చేస్తానని చెబుతున్నారు. ప్రస్తుతం రష్యాలో పార్లమెంట్, స్టేట్ కౌన్సిల్ కేవలం సలహాలకు మాత్రమే పరిమితమయ్యాయి. పూర్తి అధికారాలు అధ్యక్షుడి చేతిలోనే ఉన్నాయి.

రాజ్యాంగ సవరణలు చేసిన తర్వాత పూర్తిగా అధికారమంతా ఆ రెండు చట్టబద్ధమైన అంగాల చేతిలోనే ఉంటుందని నమ్మబలుకుతున్నారు పుతిన్. డిమిట్రి మెడ్విదేవ్ తర్వాత ప్రధాని పీఠానికి 53 సంవత్సరాల మిఖాయిల్ మిషుస్తిన్ ని ఎంపిక చేశారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వ్యక్తిని నేరుగా ప్రధానిపదవికోసం తెరమీదికి తీసుకురావడం నిజంగా పుతిన్ చేసిన సాహసమేనని చెప్పాల్సిందే.

పార్లమెంట్ దిగువ సభ మిఖాయిల్ మిషుస్తిన్ అభ్యర్థిత్వాన్ని 383 ఓట్లతో నామినేట్ చేస్తే ఓటింగ్ లో ఆయనకు మొత్తం 424 ఓట్లు పోలయ్యాయి. సభకు హాజరైనవాళ్లలో ఒక్కరుకూడా మిఖాయిల్ కి వ్యతిరేకంగా ఓటు చేయకపోవడం మరో విశేషం. 41 మంది సభ్యులు మాత్రం ఈ ఓటింగ్ కి గైర్హాజరయ్యారు. Vladimir Putin

దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ ప్రతి రష్యా పౌరుడికీ రక్తం మరిగేలా, జాతీయ భావనలు నరనరాల్లోనూ ఉప్పొంగేలా అద్భుతమైన రీతిలో క్లుప్తంగా మాట్లాడడంలో విజయాన్ని సాధించారనే చెప్పాలి. దేశ ప్రజలు ఎవరూ ఊహించని రీతిలో సంస్కరణలను తెరమీదికి తెచ్చిన పుతిన్ వాటిని దేశంలో ప్రతి ఒక్క పౌరుడూ ఆమోదించేలా చేయగలగడంలో అద్భుతమైన విజయాన్ని సాధించగలరని ఇప్పుడు అందరూ నమ్మతున్నారు.

అచ్చంగా చైనా అధ్యక్షుడుకూడా శాశ్వతంగా తాను బతికున్నంతకాలం ఇలాగే అధికారంలో కొనసాగడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకోవడంలో పూర్తి విజయాన్ని సాధించారు. అంటే పుతిన్ ఇప్పుడు చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ బాటలోనే నడుస్తున్నారా? మొత్తంగా అసలు జరుగుతున్న వ్యవహారమేంటో పూర్తిగా ఎవరికీ అర్థం కాకపోయినా ప్రాథమిక అంచనాలు నిర్థారిస్తున్న విషయం మాత్రం ఇదే.

2018లో చైనా అధ్యక్షుడు తన పదవికి ఉన్న కాలపరిమితికి సంబంధించి రాజ్యాంగపరమైన సవరణలు చేయడం ద్వారా శాశ్వతంగా ఆ పదవిలో కొనసాగడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అదే విధంగా 67 సంవత్సరాల పుతిన్ మరో ఇరవై సంవత్సరాలపాటు తాను రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు గట్టి ఏర్పాట్లే చేసుకుంటున్నారు. తను జీవించి ఉన్నంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగడంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాను చేపట్టిన సంస్కరణల ప్రభావం వల్ల నిజానికి అధ్యక్ష పదవికి ఉన్న అధికారాలు తగ్గుతాయి. పూర్తి స్థాయిలో పార్లమెంట్ కీ, ప్రధానికీ, స్టేట్ కౌన్సిల్ కీ అన్ని అధికారాలూ చేతిలో ఉంటాయి. ఒకవేళ ఈ మూడు వ్యవస్థల్లో దేనిలోనైనా లోపం జరిగితే అప్పుడు మాత్రమే అధ్యక్షుడు నేరుగా రంగ ప్రవేశం చేస్తాడన్నది పుతిన్ తన ప్రసంగంలో జాతికి చెప్పిన సారాంశం. అంతకు మించి పుతిన్ తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించే ప్రయత్నం తన ప్రసంగంలో ఏ దశలోనూ చేయనేలేదు.

పుతిన్ ప్రతిపాదించిన సంస్కరణలను పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావడానికి తను రాజీనామా చేయక తప్పదని ప్రధాని డిమిట్రి మెడ్వెదేవ్ ప్రకటించినప్పటికీ నేరుగా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో తన తర్వాతి స్థానాన్ని పుతిన్ మెడ్వెదేవ్ కి కట్టబెట్టడం ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగిందన్నది విశ్లేషకుల భావన. ప్రతిపక్షం మాత్రం ఈ సంస్కరణలను నిర్ద్వందంగా ఖండించింది. ఇవన్నీ పూర్తిగా పుతిన్ జీవితకాలంపాటు అధ్యక్ష పదవిలో కొనసాగడానికి చేస్తున్న ప్రయత్నాలేనంటూ ఘాటుగా విమర్శించింది.

2024లో తన పదవీకాలం ముగిసేలోగా ప్రధానమంత్రికి పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పజెప్పినట్టుగా ప్రజలకు బలమైన భావన కలగజేస్తూనే, తాను నామమాత్రంగా అధ్యక్ష పదివిలో కొనసాగుతున్నట్టుగానే చిత్రీకరిస్తూనే, మొత్తంగా వ్యవస్థనంతా పుతిన్ పూర్తిగా తన చేతుల్లోనే పెట్టుకోవాలని చూస్తున్నాడని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

స్వపక్షంలో రోజురోజుకూ పెరుగుతున్న అసమ్మతిని పూర్తి స్థాయిలో అణచివేయడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకే పుతిన్ సంస్కరణల పేరుతో ఇదంతా చేస్తున్నాడని బ్రిటిష్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్తగా చేస్తున్న ఈ రాజకీయ, రాజ్యాంగ సంస్కరణలపై తర్వాత నేరుగా ప్రజాభిప్రాయాన్ని కోరతామని పుతిన్ చెబుతున్న మాటలు ఎవరికీ అంతగా నమ్మశక్యంగా అనిపించడంలేదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నమ్మి తీరక తప్పదు.

మెడ్వదేవ్ 2008 నుంచీ 2012 వరకూ రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగారు. పుతిన్ తన అధ్యక్ష పదవీకాలం ముగిసినందువల్ల మెడ్వదేవ్ ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి తాను మళ్లీ ప్రధాని మంత్రి పదవిని చేపట్టారు. తర్వాత జరిగిన పరిమాణాలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుంటే మళ్లీ మెడ్వెదేవ్ ప్రధాని కావడం, పుతిన్ అధ్యక్షపదివిని చేపట్టడం లాంటి పరిణామాలు పూర్తిగా రాజకీయ చదరంగంలో పావులే అన్న అభిప్రాయం అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమయ్యింది.

ప్రస్తుతం కొత్తగా ప్రధాని పదవిని చేపట్టిన మిఖాయిల్ మిషుస్తిన్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి ఆదాయాలను గణనీయంగా పెంచడం మాత్రమే తన ప్రధాన కర్తవ్యమని ప్రజలకు సందేశం ఇచ్చారు. త్వరలోనే చట్టసభల సభ్యులందరికీ పూర్తి స్థాయిలో జీతాలు పెరగబోతున్నాయని కొత్త ప్రధానమంత్రి పార్లమెంట్ సభ్యుల్ని ఆకట్టుకునే రీతిలో చెప్పడం మరో ముఖ్యమైన గమనార్హమైన విశేషం. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ పాత ప్రభుత్వమే బాధ్యతల్ని నిర్వర్తిస్తుందని పుతిన్ ప్రకటించారు.

బోరిస్ ఎలిత్సిన్ పదవినుంచి వైదొలగడంతో అకస్మాత్తుగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాజీ కెబిజి అధికారి పుతిన్ తన పదవీకాలంలో ప్రజాభిమాన్ని విస్తృత స్థాయిలో చూరగొడంలో విజయాన్ని సాధించారనే చెప్పాలి. కానీ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం పుతిన్ రేటింగ్స్ బాగా తగ్గిపోయి.

కిందటి ఏడాది జరిగిన ఎన్నికల్లో వ్లాదిమర్ పుతిన్ పార్టీ ఆశించిన రీతిలో ప్రజాభిమానాన్ని చూరగొనలేకపోవడం మరో ముఖ్యమైన విషయం. స్టాలిన్ లా చివరి శ్వాస వరకూ రష్యాను ఏలాలన్న ఆలోచనతోనే పుతిన్ సంస్కరణల పేరుతో ఇలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అంటున్నారు.

Next Story