పరుగుల యంత్రానికి ఏమైంది..? 19 ఇన్నింగ్స్‌ల్లో.. '0'

By Newsmeter.Network  Published on  21 Feb 2020 9:30 AM GMT
పరుగుల యంత్రానికి ఏమైంది..? 19 ఇన్నింగ్స్‌ల్లో.. 0

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అభిమానులు ముద్దుగా.. పరుగు యంత్రం అని పిలుచుకుంటారు. శతకాల మీద శతకాలు బాదేస్తూ.. సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ వెళ్లడం కోహ్లికి వెన్నతో పెట్టిన విద్య. చేధనలో మొనగాడు. స్వదేశం, విదేశాలు అన్న తేడాలు లేకుండా పరుగుల వరద సృష్టిస్తాడు. అలాంటి కోహ్లికి ఏమైంది. కివీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. దీంతో కోహ్లి బ్యాటింగ్‌లో పస తగ్గిందా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. గత 19ఇన్నింగ్స్‌లలో కోహ్లి శతకం బాదలేదు. తన అరగ్రేటం నుంచి ఇప్పటి వరకు ఇలా మూడంకెల స్కోర్‌ అందుకోకపోవడం విరాట్ కెరియర్‌లో ఇది మూడో సారి.

ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో కోహ్లి దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ పర్యటనలో ఇప్పటి వరకు కోహ్లి బ్యాట్ నుంచి ఒక్క శతకం కూడా జాలువారలేదు. గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టుల్లో చివరి సారి విరాట్.. శతకం బాదాడు. గతంలో 2011 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకూ 24 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ 4 అర్థశతకాలు బాదిన.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. రెండోసారి 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకూ 25 వరుస ఇన్నింగ్స్‌ల్లో శతకం బాదలేదు. అప్పుడు ఆరు అర్థశతకాలు చేశాడు. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. 2019లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసే సమయానికి చూస్తే ప్రతీ ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి శతకం సాధించిన ఘనత ఉండగా, వరుసగా 19 ఇన్నింగ్స్‌ల్లో శతకం లేకపోవడం గమనార్హం.

దాంతో 11 ఏళ్లకు పైగా ఉన్న కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లో మూడో చెత్త ప్రదర్శన చేసినట్లయ్యింది. కాగా 2014లో ఇంగ్లాండ్‌ పర్యటనలో కోహ్లి విఫలయ్యాడు. అప్పుడు 5 టెస్టుల్లో 134 పరుగులు మాత్రమే చేసి తన కెరీర్‌లో చేదు జ్ఞాపకాన్ని మూటగట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌లో విఫలమైన కోహ్లి బ్యాటింగ్‌ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. 2018 ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా రెచ్చిపోయిఆ ఆడాడు. ఈ పర్యటనలో 593 పరుగులు సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు.

19ఇన్నింగ్స్‌ల నుంచి కోహ్లి శతకం బాదని కోహ్లి.. రానున్న ఇన్నింగ్స్‌లో వరుస సెంచరీలు బాదాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Next Story