దాదా రికార్డును బద్దలు కొట్టిన కోహ్లి.. ఆ ఇద్దరిని దాటితే..
By Newsmeter.Network Published on 5 Feb 2020 2:25 PM GMT
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హామిల్టన్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లి 63బంతుల్లో 6 పోర్లు బాది 51 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా కెప్టెన్లలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో బెంగాల్ టైగర్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా సారథిగా గంగూలి 142 ఇన్నింగ్స్ లో 5082 పరుగులు చేశాడు. కాగా కోహ్లీ కేవలం 83 ఇన్నింగ్స్ లోనే 5,123 పరుగులు చేసి దాదా ను అధిగమించాడు.
భారత కెప్టెన్లలలో అత్యధిక పరుగులు చేసిన ఘనత మహేంద్ర సింగ్ ధోనిది. మహేంద్రుడు 172 ఇన్నింగ్స్‌లో 6,641 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహ్మద్ అజహరుద్దీన్ 162 ఇన్నింగ్స్‌ల్లో 5,239 పరుగులతో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ ను చూస్తుంటే ఈ సిరీస్ లో అజహరుద్దీన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో విరాట్ 7వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. తర్వాత ఎంఎస్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్, అర్జున రణతుంగ, గ్రేమి స్మిత్, మహ్మద్ అజారుద్దీన్‌లు ఉన్నారు.
న్యూజిలాండ్ పర్యటన తర్వాత దక్షిణాఫ్రికాతో మార్చి 12 నుంచి భారత్ జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ పూర్తి అయ్యేసరికి మహీ రికార్డుకు కోహ్లి చేరువలోకి రావొచ్చు.