నిర్భయదోషి ఆత్మహత్యాయత్నం.. ఉరి తప్పించుకోవడానికే..!
By Newsmeter.Network Published on 20 Feb 2020 10:27 AM IST
నిర్భయ దోఘల్ని మార్చి 3న ఉరితీయాలని ఇప్పటికే న్యాయస్థానం డెత్ వారెంట్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దోషులు ఇప్పటికీ ఉరిని వాయిదా వేసేలా పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. దోషులు ఇప్పటి వరకూ తమ ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకొని రెండు సార్లు ఉరి వాయిదా పడేలా చేశారు.
తాజాగా తీహార్ జైల్లో వినయ్ శర్మ ఆత్మహత్యకు యత్నించాడు. తనను ఉంచిన సెల్‌లో గోడకు వినయ్ తలబాదుకొని గాయపరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఊచల మధ్య చెయ్యి ఇరికించుకుని విరగొట్టుకోవాలని యత్నించినట్లు.. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో ఇక ఎలాంటి జాప్యం చోటుచేసుకోరాదని నిర్భయ తల్లి ఆశాదేవి కోరుతున్నారు. నిర్భయకు న్యాయం జరగనిపక్షంలో హత్యాచారం వంటి తీవ్ర నేరాలకు గురైన బాధితులెవరికీ సత్వర న్యాయం జరిగే పరిస్థితి ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.