బాలీవుడ్ లో విభిన్న తరహా పాత్రలు చేసే నటుల్లో రితేష్ దేశ్ ముఖ్ కూడా ఒకరు. తెలుగు వాళ్ళు జెనీలియా భర్త అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఓ వైపు నటన, మరోవైపు నిర్మాతగా దూసుకుపోతున్నాడు రితేష్. అతడు నటించిన తాజా చిత్రం బాఘీ-3 త్వరలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో.. రీమేక్ స్టార్ టైగర్ ష్రాఫ్ కు సోదరుడిగా ఈ సినిమాలో నటించాడు. ఇప్పటికే బాఘీ, బాఘీ-2 హిట్ అవ్వడం.. బాఘీ-3 ట్రైలర్ లో భీభత్సమైన యాక్షన్ సీన్స్ ఉండడంతో చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈ చిత్రంలో తనకు అవకాశం రావడంపై స్పందించాడు రితేష్. మొదట నిర్మాత సాజిద్ నడియద్ వాలా ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పాడని.. ఈ సీక్వెల్ లో నేనేమి చేయాలో చెప్పండి అని అడుగగా.. తన క్యారెక్టర్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను దర్శకుడు అహ్మద్ ఖాన్ వినిపించారని.. ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండడం తనకు నచ్చిందని అందుకే ఓకె చెప్పేసానని అన్నారు. అన్నదమ్ముల మధ్య బంధాన్ని చాలా బాగా చూపించారని రితేష్ చెప్పుకొచ్చాడు. తన సొంత సోదరుడితో ఎంతో అన్యోన్యంగా మెలిగే తాను ఈ సినిమాలో నటించడానికి ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదన్నాడు.

రితేష్ దేశ్ ముఖ్.. దివంగత మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడన్న సంగతి తెలిసిందే. తన తండ్రి బయోపిక్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయని.. కానీ ఆయన బయోపిక్ తీయడం తనకు, తన కుటుంబ సభ్యులకు కష్టమేనని చెప్పుకొచ్చాడు. విలాస్ రావ్ దేశ్ ముఖ్ బయోపిక్ తీస్తే చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయని.. గ్రామ సర్పంచ్ గా విలాస్ రావ్ రాజకీయ జీవితం మొదలై.. ఏకంగా ముఖ్యమంత్రి అవ్వడం చాలా మందికి ఆదర్శం అని అన్నాడు రితేష్. ఇప్పటికే చాలా మంది తన తండ్రి జీవితానికి సంబంధించిన స్క్రిప్ట్ ను వినిపించారని.. కానీ తమ కుటుంబ సభ్యులెవరూ సినిమా తీయాలని అనుకోలేదని.. ఇప్పట్లో తమకు అటువంటి ఆలోచనలేవీ లేవన్నారు. అంత గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను రెండు గంటల్లో చూపించడమన్నది కాస్త కష్టమే అయినప్పటికీ ఇతరులెవరైనా తీయాలనుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అన్నారు. కానీ ఆయన జీవిత చరిత్ర మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని మాత్రం తాను చెప్పగలనని రితేష్ చెబుతున్నాడు.

రితేష్ ఛత్రపతి శివాజీ మహరాజ్ మీద చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రితేష్ సొంత బ్యానర్ ‘ముంబై ఫిల్మ్ కంపెనీ’ ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించబోతోంది. హిందీ, మరాఠీ భాషల్లోనే కాకుండా దక్షిణాది భాషల్లో కూడా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సైరాత్ ఫేమ్  ‘నాగరాజ్ మంజులే’ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఎవరెవరు హీరో హీరోయిన్లుగా నటిస్తారో మరికొద్ది రోజుల్లో చిత్ర బృందం అప్డేట్ ఉంది. శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను వెండితెరపై చూడాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.