ఒక క్రిమినల్ నాపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం : సుజనా చౌదరి

By రాణి  Published on  25 Dec 2019 5:12 AM GMT
ఒక క్రిమినల్ నాపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం : సుజనా చౌదరి

ముఖ్యాంశాలు

  • ఎవరు లేఖ రాసినా..అర్జీ పెట్టుకున్నా రాష్ర్టపతి ఇలాగే చేస్తారు
  • అన్నీ అభూతకల్పనలు, అసత్య ఆరోపణలు
  • నా జీవితం తెరిచిన పుస్తకం : సుజనా చౌదరి

అమరావతి : తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు కట్టిపెట్టాలని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. 16 నెలలు జైలులో ఊచలు లెక్కబెట్టిన విజయసాయిరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి లేఖ రాయగా... ఆ లేఖని రాష్ట్రపతి కార్యాలయం దాదాపు నెలన్నర తరువాత నవంబర్ 6న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫార్వార్డ్ చేసిందన్నారు. దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతికి లేఖ రాసినా, అర్జీ పెట్టుకున్నా రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వ శాఖకు దాన్ని ఫార్వార్డ్ చేయడం రివాజు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి తన మీద అభూతకల్పనలు, అసత్య ఆరోపణలు చేస్తూ రాసిన ఉత్తరం హోం మంత్రిత్వ శాఖకు చేరిందని సుజనా చౌదరి పత్రికా ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు.

ఇంతవరకూ తనపై ఎలాంటి ఆరోపణలు గానీ, ఫిర్యాదులు గానీ, ఏ సంస్థ గానీ, వ్యక్తిగానీ ఫిర్యాదులు చేసిన దాఖలాలు లేవన్నారు. జీవితం, బిజినెస్ కెరియర్, పొలిటికల్ కెరియర్ తెరిచిన పుస్తకాలు. రాష్ట్రపతికి రాసిన లేఖకు వచ్చిన ఎక్నాలెడ్జ్ మెంట్ ను పట్టుకుని నాకున్న ప్రతిష్టను దిగజార్చేందుకే విజయసాయిరెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సుజనా ఆరోపించారు. వారం వారం కోర్టు మెట్లెక్కుతూ, తుది తీర్పు కోసం, తీర్పుతో పడే శిక్ష కోసం బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్న కన్ఫార్మ్డ్ క్రిమినల్ విజయసాయిరెడ్డి తనపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకనైనా ఆయన ఇలాంటి నేలబారు వ్యవహారాలు కట్టిపెట్టి రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండే అంశాలపై దృష్టి పెట్టడం మంచిదని సుజనా చౌదరి సూచించారు.

అన్నీ అబద్ధాలయితే ఎందుకు ఖండించలేదు ?

సుజనా చౌదరి పై చేసిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. సుజనా చౌదరి పై చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి వున్నానన్నారు. వైఎస్ చౌదరి గత రెండు మూడు దశాబ్దాలుగా నకిలీ కంపెనీలను సృష్టించి ఎలా మోసం చేశాడో, భారత బ్యాంకింగ్ వ్యవస్థను రూ.8 వేల కోట్ల మేరకు ఎలా ముంచేశాడో, సింగపూర్ లో చేసిన మోసాలు ఏంటో, మారిషస్ లో చేసిన కుంభకోణం, దుబాయ్, అమెరికాల్లో ఆయన ఆర్థికంగా చేసిన తప్పుడు పనులు, సేల్స్ ట్యాక్స్, కస్టమ్స్, కేంద్ర ఎక్సైజ్, ఐటి శాఖలను ఎలా నిలువునా ముంచాడో వివరంగా రాష్ట్రపతికి లేఖ రూపంలో అందజేసినట్లు విజయసాయి వెల్లడించారు.

అవన్నీ అబద్ధాలయితే... రాష్ర్టపతికి లేఖ రాసినప్పుడే.. సుజనాచౌదరి ఆ ఆరోపణలను ఖండించి, ఎలాంటి విచారణకు అయినా తాను సిద్ధం అని ప్రశ్నించి వుండేవాడన్నారు. కానీ అటువంటి ప్రకటనలు చేయకుండా తన మీద ఏ విధమైన ఫిర్యాదులు ఏ సంస్థకానీ, ఏ వ్యక్తికానీ చేయలేదంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. సుజనాచౌదరి మీద ఇప్పటి ఆయన మిత్రుడు, ఒకప్పుడు ఆయనను కిందకు లాగాలని అనుకున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే మూడు రోజుల పాటు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో సుజనా వారి మాయా సామ్రాజ్యం అంటూ పతాక శీర్షికల్లో వార్తా కథనాలు ప్రచరించిన విషయాలను విజయసాయి గుర్తు చేశారు. సుజనాచౌదరి వంటి ఆర్థిక నేరస్తుల మీద భారతదేశంలోని ఈడీ, సీబీఐ పనిచేయకపోతే ఆ సంస్థల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.

సుజనా జీవితం చంద్రబాబు తెరిచిన పుస్తకం..

తన జీవితం తెరిచిన పుస్తకం అని సుజనా చౌదరి అంటున్నాడు కానీ నిజానికి అది చంద్రబాబు తెరిచిన పుస్తకం. చంద్రబాబు కోసం తెరిచిన పుస్తకం. కేంద్రప్రభుత్వం ఈ అంశం మీద దర్యాప్తు చేయాల్సిందిగా హోం మంత్రిత్వ శాఖను ఆదేశిస్తే వైఎస్ చౌదరి అది కేవలం ఎకనాలెడ్జ్ మెంట్ అని, తన ప్రతిష్టను నేను దిగజారుస్తున్నాను అని ఆరోపించడం సరికాదన్నారు. అది కేవలం ఎకనాలెడ్జ్ మెంట్ అయితే సుజనాచౌదరి ఎందుకు ఇంతగా భయపడుతున్నాడని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కేవలం ఒక్క మనిషి ... డిపాజిటర్లు ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ములను వేల కోట్ల మేరకు మింగేసినా... అటువంటి వ్యక్తిని వదిలేస్తే... ఇక భారతదేశంలో న్యాయం, చట్టం అనే పదాలకు విలువ వుండదన్నారు. సుజనాచౌదరి మీద ఇచ్చిన సమాచారానికి కట్టుబడి వున్నా.. కానీ సీబీఐ విచారణను, ఈడీ విచారణను అడ్డుకోబోనని వైఎస్ చౌదరి బహిరంగంగా చెప్తాడా ? అని విజయసాయి సవాల్ చేశారు.

Next Story