విక్ట‌రీ వెంక‌టేష్ - యువ సామ్రాట్ నాగ చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ చిత్రం వెంకీమామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు (డిసెంబ‌ర్ 13న‌) ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. రియ‌ల్ లైఫ్ లో మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన వెంకీ, చైతు రీల్ లైఫ్ లో కూడా అవే పాత్ర‌లు పోషించ‌డం.. ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో వెంకీమామ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. వెంకీమామ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకున్నాడు అనేది చెప్పాలంటే.. ముందుగా ఈ మేన‌మామ‌, మేన‌ల్లుడుల క‌థ చెప్పాల్సిందే.

క‌థ - వెంక‌ట‌ర‌త్నం నాయుడు (వెంక‌టేష్‌) అంద‌రూ మిల‌ట‌రీ నాయుడు అంటారు. ఎందుకంటే.. మిల‌ట‌రీలోకి వెళ్లాలి దేశానికి సేవ చేయాలి అనేది అత‌ని క‌ల‌. అయితే... అత‌ని క‌ల క‌ల‌గానే మిగిలిపోతుంది. వెంక‌ట‌ర‌త్నం నాయుడు తండ్రికి జాత‌కాల పై న‌మ్మ‌కం ఎక్కువ. కూతురు ప్రేమించాన‌ని చెప్ప‌గానే...ఆ ప్రేమించిన వ్య‌క్తితో పెళ్లి జ‌రిగితే పిల్లాడు పుట్టిన సంవ‌త్స‌రం లోపు ఇద్ద‌రూ చ‌నిపోతార‌ని జాత‌కంలో ఉంద‌ని పెళ్లికి అంగీక‌రించ‌డు. అయిన‌ప్ప‌టికీ తండ్రిని ఎదురించి ఆమె ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటుంది. అయితే.. తండ్రి చెప్పిన‌ట్టుగా కొడుకు పుట్టిన సంవత్స‌రంలోపు భార్య‌, భ‌ర్త‌లు ఇద్ద‌రు యాక్సిడెంట్ లో చ‌నిపోతారు.

ఆ పుట్టిన పిల్లాడు మేన‌మామ గండంతో పుట్టాడు. వాడిని.. వ‌దిలేయండి అని ఎంత చెప్పినా.. మేన‌మామ వెంక‌ట‌ర‌త్నం నాయుడు ఆ పిల్లాడిని వ‌ద‌ల‌డు. త‌ల్లి, తండ్రి అన్నీ తానై పెంచుతాడు. అతనే కార్తీక్ ( నాగ చైత‌న్య‌). కార్తీక్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. అత‌ని ప్రేమ‌కు అడ్డంకులు. ఆ అడ్డంకులను మేన‌మామ క్లియ‌ర్ చేస్తాడు. త‌న వ‌ల‌నే మావ‌య్య పెళ్లి చేసుకోలేద‌ని తెలుసుకున్న కార్తీక్.. మావ‌య్య‌ ఆ ఊరులో కొత్త‌గా వ‌చ్చిన టీచ‌ర్ (పాయల్ రాజ్ పుత్) ని ప్రేమించేలా చేస్తాడు. అంతా సాఫీగా వెళుతుంది అనుకుంటున్న టైమ్ లో త‌న వ‌ల్ల మేన‌మామకి గండం ఉంద‌ని తెలిసి కార్తీక్ మేన‌మామ‌కు దూరంగా మిల‌ట‌రీలోకి వెళ్లిపోతాడు. ఇది తెలుసుకున్న వెంక‌ట‌ర‌త్నం నాయుడు మేన‌ల్లుడి కోసం వెళ‌తాడు. అప్పుడు బోర్డ‌ర్ లో ఏర్ప‌డిన ప‌రిస్థితులు ఏంటి..? కార్తీక్ వల్ల మేన‌మామకు గండం అని చెప్పిన జాత‌కం నిజ‌మయ్యిందా..? లేదా..? చివ‌రికి మేన‌ల్లుడిని వెంకీమామ క‌లుసుకున్నాడా..? లేదా..? అనేదే ఈ క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్ :

వెంక‌టేష్‌, నాగ చైత‌న్య న‌ట‌న‌

ఫ‌స్టాఫ్

కామెడీ

త‌మ‌న్ సంగీతం

మైన‌స్ పాయింట్స్ :

క‌థ‌

సెకండ్ ఆఫ్

విశ్లేష‌ణ - ఫ‌స్టాఫ్ అంతా వెంకీ, చైత‌న్య‌ల ఎంట‌ర్ టైన్మెంట్ బాగానే ఉంద‌నిపించినా... క్లీన్ కామెడీ చేసే వెంకీ ఇందులో అక్క‌డ‌క్క‌డా డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ చేయ‌డం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. పాట‌ల్లో, యాక్ష‌న్ లో, కామెడీలో.. ఈ మేన‌మామ‌, మేన‌ల్లుడు ఇద్ద‌రూ అద‌ర‌గొట్టేసారు. అయితే... మేన‌మామ గండం, జాత‌కాలు.. చుట్టూ క‌థ అనేది ఎప్ప‌టి నుంచో చూస్తున్న‌వే. ఇందులో కొత్త‌ద‌నం ఏమీ లేదు. ఈ పాత క‌థ‌ను తీసుకుని కొత్త‌గా చెప్పాల‌ని ప్ర‌య‌త్నించారు. అందుక‌నే స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ని తీసుకొచ్చి ఈ క‌థ‌లో క‌లిపేసారు.

ప‌స్టాఫ్ అంతా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది. ఇక సెకండాఫ్ కి వ‌చ్చే స‌రికి ఎమోష‌న‌ల్ గా ఉంటుంది. ఆర్మీ ఎపిసోడ్ లో నాగ చైత‌న్య చాలా బాగా న‌టించాడు. అయితే.. చైత‌న్య పాత్ర‌కు ఎక్కువ స్కోప్ లేదు. ఇది అక్కినేని అభిమానుల‌కు కాస్త నిరాశే అని చెప్ప‌చ్చు. సురేష్ బాబు, విశ్వ ప్ర‌సాద్ నిర్మాణ ప‌రంగా ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. త‌మ‌న్ సంగీతం బాగుంది.

ద‌ర్శ‌కుడు బాబీ ఈ క‌థ‌ను ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించ‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డాడు. క్లైమాక్స్ సీన్స్ ని ఇంకాస్త ఎమోష‌న‌ల్ గా చిత్రీక‌రించ‌వ‌చ్చు కానీ.. ఎందుక‌నో త్వ‌ర‌గా కంప్లీట్ చేసిన‌ట్టు అనిపిస్తుంది. టోట‌ల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే... వెంకీ - చైతు నటన కోసం వెంకీమామ‌ను ఒక‌సారి చూడ‌చ్చు.

రేటింగ్ - 2.75/5

రాణి యార్లగడ్డ

Next Story