యూఎస్ – మెక్సికో బోర్డర్ లో బైటపడ్డ పెద్ద స్మగ్లింగ్ సొరంగం

By Newsmeter.Network  Published on  31 Jan 2020 11:16 AM GMT
యూఎస్ – మెక్సికో బోర్డర్ లో బైటపడ్డ పెద్ద స్మగ్లింగ్ సొరంగం

ముఖ్యాంశాలు

  • అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమైన స్మగ్లింగ్ సొరంగం
  • గాలి వీచడానికి వీలుగా వెంటిలేషన్ ట్యూబులు
  • స్మగ్లింగ్ సొరంగం లోపల ఎలక్ట్రిసిటీ, పవర్ లైటింగ్
  • డ్రగ్స్ ని, మనుషుల్నీ స్మగుల్ చేసేందుకు ఉద్దేశించిన సొరంగం
  • మెక్సికన్ లోకల్ గ్యాంగ్ స్టర్ జైలునుంచి తప్పించుకునే ప్రయత్నం
  • గతంలో అందుకోసం నిర్మించిన సొరంగంకూడా ఇదే ప్రాంతంలోదే

శాన్ డియాగో : అమెరికాలో అతిపెద్ద స్మగ్లింగ్ సొరంగం బైటపడింది. అలాంటి ఇలాంటి సొరంగం కాదు. అన్ని హంగులతో, సౌకర్యాలతో కూడిన మోడ్రన్ సొరంగమది. లోపలికి గాలి పారేందుకు వెంటిలేషన్ ట్యూబులు, కొండని తొలిచి చేసిన దారికి ఇరువైపులా ఉన్న గోడలపై దారిపొడవునా ఉన్న ఎలక్ట్రిసిటీ కేబుల్స్, దారిపొడవునా చక్కటి బాట అసలు ఇంత అద్భుతమైన సొరంగం ఉందని నమ్మడానికి వీల్లేనంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఆ సొరంగాన్ని నిర్మించారంటే ఆశ్చర్యం కలగకమానదు.

సరిగ్గా ఈ సొరంగానికి 70 అడుగుల ఎత్తులో పూర్తిగా ఎడారి. మెక్సికో యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ లో ఇంత పెద్ద స్మగ్లింగ్ సొరంగం బైటపడడం చరిత్రలో ఇదే మొదటిసారి. అమెరికా భద్రత దళాల అధికారులు చాకచక్యంగా ఈ సొరంగం గుట్టును రట్టు చేశారు. టిజునా, మెక్సికోల మధ్య శాన్ డియోగో వరకూ ఉన్న ఈ అద్భుతమైన సొరంగాన్ని చూసేసరికి అధికారులకే కళ్లు బైర్లు కమ్మాయి. మొత్తం దీని పొడవు దాదాపుగా 4,309 అడుగులు ఉండొచ్చని అంచనా, అంటే దాదాపుగా ఓ మైలు దూరమన్నమాట.

క్రిమినల్ యాక్టివిటీస్ కోసం, క్రిమినల్స్ యధేచ్ఛగా అటూ ఇటూ వెళ్లడంకోసం, క్రాస్ బోర్డర్ స్మగ్లింగ్ కోసం ప్రత్యేకంగా సంఘ వ్యతిరేక శక్తులు ఈ సొరంగాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటాయని అధికారులు చెబుతున్నారు. శాన్ డియోగో లో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అధికారిగా పనిచేస్తున్న కార్డెల్ టి. మొరాంట్ ఆధ్వర్యంలో కాప్స్ ఈ సొరంగం రహస్యాన్ని ఛేదించారు.

2014లో ఇదే తరహా పెద్ద స్మగ్లింగ్ సొరంగం బైటపడ్డప్పటికీ దాని పొడవు 2,966 అడుగులు మాత్రమే. ఆ సొరంగంకూడా ఈ ప్రాంతంలోనే బయటపడడం విశేషం. ఈ క్రాస్ బోర్డర్ టన్నెల్స్ ని అరాచక శక్తులు డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం, యూఎస్ లోకి జనాన్ని తీసుకెళ్లి వదిలిపెట్టడానికి ఉపయోగించేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రెండడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల పొడవుతో రాయిని తొలిచి ఈ సొరంగాన్ని తవ్వారు. ఈ సొరంగంలో డ్రైనైజీ వ్యవస్థ, కరెంట్ కనెక్షన్లు, వెంటిలేషన్ కోసం ప్రత్యేకమైన ట్యూబ్ లు, దారిపొడవునా ఓ మోటార్ సైకిల్ వెళ్లేందుకు వేసిఉన్న పట్టాలు ఉన్నట్టుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు గుర్తించారు. పైగా టుజునా వైపున్న ప్రవేశ మార్గం దగ్గర ప్రత్యేకంగా ఈ సొరంగంలోకి ప్రవేశేంచేందుకు ఓ ఎలివేటర్ నికూడా ఏర్పాటు చేయడం విశేషం.

అమెరికావైపున ఉన్న ప్రవేశ మార్గాన్ని వందలాది ఇసుక బస్తాలతో మూసేశారు. దీనికి అనుసంధానంగా 3.529 అడుగుల పొడవైన మరో సొరంగాన్ని అమెరికాలోకి అనధికారికంగా ప్రవేశించేందుకు తవ్వారు. కానీ ఇంతవరకూ దానికి పైకి వెళ్లడానికి మార్గాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. బహుశా మరి కొద్ది కాలంలోనే దాన్నికూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండొచ్చు. సరిగ్గా ఈ సమయంలోనే బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ అధికారులు ఈ ఆధునిక టెక్నాలజీతోకూడిన సొరంగాన్ని కనిపెట్టేశారు.

దీనికి సంబంధించి ఇంత వరకూ ఎవరినీ అధాకారులు అరెస్ట్ చేయలేదు. ఇంకా ఏ విధమైన ఆధారాలూ దీనికి సంబంధించి దొరకలేదు. అలాగే టన్నెల్ లోపల ఎలాంటి డ్రగ్స్ కూడా దొరకలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంపై బాగా పట్టున్న మెక్సికో లోని సినాలోవా కార్టెల్ కి చెందిన గుజ్మన్ లోయెరా కిందటి జూలై నెలలో జీవితఖైదు శిక్షపడి జైలుపాలయ్యాడు.

2015లో గుజ్మెన్ మెక్సికో జైలునుంచి తప్పించుకుపోయేందుకు ఇదే తరహాలో అద్భుతమైన సొరంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపుగా 600 అడుగుల పొడవైన సొరంగాన్ని నిర్మించుకున్న తర్వాత తను జైలు సెల్ నుంచి అనూహ్యమైన రీతిలో మాయమయ్యాడు. ఈసారి బైటపడ్డ సొరంగంకూడా అలాంటిదేనని మెక్సికో అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త సొరంగాన్ని ఇంత అధునాతన సదుపాయాలతో నిర్మించడానికి కనీసం ఓ ఏడాది సమయం, రూ.100 కోట్లు ఖర్చై ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏడిదిగా రెండు వైపులా ఉన్న అధికారులు క్రాస్ బోర్డర్ సొరంగాలకోసం వేట మొదలుపెట్టారు. ఆ వేటలో ఒక్కొక్కటిగా ఈ సొంరంగాలన్నీ బైటపడుతున్నాయి. 2018లో జకుంబా ప్రాంతంలో ఇలాంటి పట్టాలు, అత్యాధునిక సోలార్ పవర్ తో ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థతోకూడిన మరో సొరంగం బైటపడింది. శాన్ డియాగోనుంచి ఈ ప్రాంతం దాదాపుగా 44 మైళ్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అమెరికావైపున ఒటే మెసా ప్రాంతంలోకి వెళ్లి అక్కడ్నుంచి యూఎస్ లో కలిసిపోవడానికి వీలుగా ఈ సొరంగాలు నిర్మితమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో అనేక వేర్ హౌస్ లు ఉన్నందున సొరంగం తవ్వే విషయాన్ని కనిపెట్టడం చాలా కష్టం. ప్రస్తుతం బైటపడ్డ క్రాస్ బోర్డర్ టన్నెల్ పొడవు దాదాపుగా 14 పుట్ బాల్ గ్రౌంట్ల పొడవంత ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Next Story