ఉన్నావ్ రేప్ కేసులో కుల్ దీప్ ను దోషిగా తేల్చిన ఢిల్లి కోర్టు

By రాణి  Published on  16 Dec 2019 10:53 AM GMT
ఉన్నావ్ రేప్ కేసులో కుల్ దీప్ ను దోషిగా తేల్చిన ఢిల్లి కోర్టు

న్యూ ఢిల్లి : 2017, జూన్ 7వ తేదీన మైనర్ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, ఆ తర్వాత కిడ్నాప్ చేసి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రేప్ కేసులో సోమవారం తీస్ హజారీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వాదోపవాదాలు విన్న తర్వాత మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ ను న్యాయస్థానం దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 19వ తేదీన శిక్ష ఖరారు చేయనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

ఉన్నావ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు రెండేళ్ల క్రితమే నమోదు కాగా..సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు విచారణ లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. అప్పటి నుంచి ధర్నేశ్ శర్మ ధర్మాసనం వాదనలు వింటూ వచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల కేసు విచారణ సీబీఐకి వెళ్లింది. కుల్ దీప్ సింగ్ పై రేప్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసినపుడే బీజేపీ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే లక్నో కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆమె బంధువులు ప్రాణాలు కోల్పోగా, లాయర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం సుప్రీం చొరవతో కేసు విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఆ తర్వాత కూడా బాధితురాలిపై పలుమార్లు హత్యా ప్రయత్నం జరిగింది.

ఉన్నావ్ బాధితురాలిపై పలుమార్లు హత్యా ప్రయత్నం

బాధిత యువతి జులై 28న రాయబరేలిలో జైల్లో ఉన్న తన బంధువును కలవడానికి వెళ్లి తిరిగొస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువులిద్దరు మృతిచెందగా, బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీనిని తనపై జరిగిన హత్యాయత్నంగా బాధితురాలు ఆరోపించింది. అయితే అంతకుముందే తనకు ప్రాణహాని ఉందని, కుల్ దీప్ సోదరులు తనను కేసు వెనక్కు తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించారని బాధిత యువతి సుప్రీంకు లేఖ రాసింది. హత్యాప్రయత్నాలు చేయడంపై మండిపడిన అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్యే, అతని సోదరుడు అతుల్‌ సహా మరో 9 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. బాధితురాలు లేఖతో స్పందించిన నాటి చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌.. ఉన్నావ్‌ అత్యాచారానికి సంబంధించిన ఐదు కేసులను లక్నో కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని, రోజు వారి వాదనలు విని... 45 రోజుల్లో తుదితీర్పు వెలువరించాలని ఆదేశించారు. చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 5 నుంచి రోజువారి విచారణ జరిపిన ఢిల్లీ జడ్జ్ ధర్మేశ్, 45 రోజుల్లోగా కేసు విచారణను పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాల ప్రకారం సోమవారం తీర్పును వెలువరించారు. ఈ నెల 19న నిందితుడు కుల్ దీప్ కు శిక్ష ఖరారు చేయనుంది ఢిల్లి న్యాయస్థానం.

జూలైలో బాధితురాలిపై హత్యా ప్రయత్నం జరగడంతో ఢిల్లి మహిళా కమిషన్ ఆమెకు ఆశ్రయమిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధిత యువతి కుటుంబానికి సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించింది. కానీ ఏం లాభం లేకపోయింది. బాధితురాలిపై మరోసారి హత్యాయత్నం జరిగింది. డిసెంబర్ 7వ తేదీన బాధితురాలిని సజీవదహనం చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. పథకం ప్రకారం ఆమెపై కిరోసిన్/పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధిత యువతికి 90 శాతం కాలిన గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మృత్యువుతో సుమారు 40 గంటలు పోరాడి డిసెంబర్ 8 వ తేదీన బాధితురాలు మృతి చెందింది.

Next Story
Share it