అండర్‌-19 వరల్డ్ కప్‌.. ఫైనల్లో భారత్ తో తలపడే జట్టు అదే..

By Newsmeter.Network  Published on  7 Feb 2020 7:46 AM GMT
అండర్‌-19 వరల్డ్ కప్‌.. ఫైనల్లో భారత్ తో తలపడే జట్టు అదే..

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్ కప్‌ లో యువభారత్ ఇప్పటికే పైనల్ కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా పైనల్ లో మనతో తడపడే జట్టు ఏదో తెలిసిపోయింది. గురువారం జరిగిన రెండో సైమీఫైనల్లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ను ఓడించి పైనల్ బైర్‌ ను ఖరారు చేసుకుంది. ఆదివారం పాచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా భారత్, బంగ్లాదేశ్ లు తలపడనున్నాయి.

ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ బంగ్లా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు మారియూ (1), వైట్‌ (18)లతో పాటు లెల్‌మన్‌ (24), కెప్టెన్‌ తష్కాఫ్‌ (10) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరడంతో కివీస్‌ 74/4 తో నిలిచింది. బెకమ్‌ వీలర్‌ (83 బంతుల్లో 75 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లిడ్‌స్టోన్‌ (74 బంతుల్లో 44; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అయితే 43 పరుగుల వ్యవధిలో ఆ జట్టు మళ్లీ 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. చివరకు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో షరీఫుల్‌ ఇస్లామ్‌ 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. షమీమ్‌ హుస్సేన్, హసన్‌ మురాద్‌ చెరో 2 వికెట్లు తీశారు.

212 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు తన్‌జీద్‌ (3), పర్వేజ్‌ (14) త్వరగానే ఔట్ అయ్యారు. అయితే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మహ్మూదుల్‌ హసన్‌ జాయ్‌ (127 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీతో రాణించాడు. అతనికి తౌహీద్‌ (40), షహాదత్‌ హుస్సేన్‌ (40)లనుంచి మంచి సహకారం లభించింది. తౌహీద్‌తో మూడో వికెట్‌కు 68 పరుగులు, షహాదత్‌తో నాలుగో వికెట్‌కు 101 పరుగులు జోడించిన మహ్మూదుల్‌ సెంచరీ పూర్తయిన అనంతరం వెనుదిరిగాడు. యూత్‌ క్రికెట్‌లో అతనికి ఇది నాలుగో శతకం కావడం విశేషం. దీంతో బంగ్లాదేశ్‌ 44.1 ఓవర్లలో 4 వికెట్లకు 215 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ఒక అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టోర్నమెంట్‌ ఫైనల్లోకి అడుగుపెట్టడం బంగ్లాదేశ్ కు ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ ఫార్మాట్‌లో, ఏ స్థాయిలో కూడా తుది పోరుకు అర్హత సాధించని బంగ్లాదేశ్‌ జట్టు అండర్‌–19 ప్రపంచ కప్‌లో ఆ ఘనతను అందుకుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్‌తో ఆదివారం జరిగే చివరి సమరానికి సిద్ధమైంది.

Next Story