వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకంటే..?

By Newsmeter.Network  Published on  5 March 2020 11:12 AM GMT
వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకంటే..?

ఆల్‌ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) అనే రెండు బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. మార్చి 27 శుక్రవారం ఒక్క రోజు సమ్మె చేయనున్నట్లు ప్రకటించాయి. కాగా తరువాత రెండు రోజులు(28 శనివారం, 29 ఆదివారం) కూడా బ్యాంకులు పని చేయవు. అంటే మొత్తంగా మూడు రోజలు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. బ్యాంకుల విలినాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు వెళ్తామని ఈ రెండు బ్యాంక్ యూనియన్లు హెచ్చరించాయి.

కేంద్ర ప్రభుత్వం తాజాగా బ్యాంకుల విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో బ్యాంకుల మెగా విలీనానికి సంబంధించి మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేబినెట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన అంశంపై చర్చ జరిగింది. బ్యాంకుల విలీనంపై ఈమె మరోసారి స్పష్టతనిచ్చారు. పది ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దీనికి ఎలాంటి రెగ్యులేటరీ ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ బ్యాంకులతో టచ్‌లో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల విలీనం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు కలిసిపోనున్నాయి. పీఎన్‌‌బీ ఈ బ్యాంకుల కార్యకలాపాలు చూసుకుంటుంది. తొలిగా విలీనం అయ్యే బ్యాంకులు ఇవే. అలాగే ఇండియన్ బ్యాంక్‌ను అలహబాద్ బ్యాంక్‌‌తో విలీనం చేయనున్నారు. దీంతో 7వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఆవిర్భవిస్తుంది. ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు వీలినం అవుతాయి. దీంతో 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆవిర్భవిస్తుంది. చివరగా కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకులను వీలీనం చేస్తారు. దీంతో 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏర్పడుతుంది.

Next Story