తెలంగాణలో కలెక్టర్ మాట కనుమరుగైపోతుందా?

By సుభాష్  Published on  29 Aug 2020 2:29 AM GMT
తెలంగాణలో కలెక్టర్ మాట కనుమరుగైపోతుందా?

జిల్లా పాలనాధికారిగా సుపరిచితమైన కలెక్టర్ పదం.. తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు కానుందా? త్వరలో తెర మీదకు రానున్న సరికొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా.. కలెక్టర్ పేరును పుస్తకాల్లో నుంచి పాలనా వ్యవస్థలో నుంచి తీసేసి.. కొత్త పేరును తీసుకురానున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. జిల్లాకు సంబంధించి అత్యంత కీలకమైన కలెక్టర్ మాట రానున్న రోజుల్లో కనిపించకుండా పోవటం ఖాయమంటున్నారు. రెవెన్యూ వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం.. అధికారుల హోదాలోనూ మార్పులు తేవాలని భావిస్తున్నారు.

ఇప్పటివరకు జిల్లా పాలనాధికారిగా వ్యవహరించే కలెక్టర్ పేరు స్థానే.. జిల్లా మేజిస్ట్రేట్ (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్' గా వ్యవహరించనున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. కలెక్టర్ పేరును తొలగించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసేసుకున్నట్లుగా తెలుస్తోంది. కలెక్టర్ అనే మాట బ్రిటీష్ వారి హయాంలోనిదని.. మారిన కాలానికి.. పరిస్థితులకు తగ్గట్లు పేరు మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు.

బ్రిటీష్ హయాంలో భూమిశిస్తు వసూలు చేసే అధికారుల్ని కలెక్టర్లుగా పిలిచేవారని.. ప్రస్తుతం భూమిశిస్తు రద్దు అయినా.. కలెక్టర్ వ్యవస్థ కొనసాగుతుందన్న మాట పలుమార్లు సీఎం కేసీఆర్ నోటి నుంచి రావటం తెలిసిందే. త్వరలో ప్రవేశ పెట్టే రెవెన్యూ బిల్లులో కలెక్టర్ పేరును తొలగించాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో ఉండే అదనపు కలెక్టర్ పేరును కూమా మార్చేయనున్నట్లు చెబుతున్నారు.

ఏడీఎంలుగా అదనపు కలెక్టర్లుగా వ్యవహరిస్తారని.. తహసీల్దార్ హోదా మార్పుపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని.. సదరు అధికారిని భూ నిర్వహణధికారి లేదంటే.. ల్యాండ్ మేనేజర్ గా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే.. కొత్తగా తీసుకొచ్చే రెవెన్యూ చట్టంలో అంత కొత్తగా ఉండటమే కాదు.. ప్రతి అంశంలోనూ కేసీఆర్ మార్కు కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.

Next Story