అగ్ర రాజ్యాధిపతి జీవితమిది..

By రాణి  Published on  24 Feb 2020 8:18 AM GMT
అగ్ర రాజ్యాధిపతి జీవితమిది..

ప్రపంచ పెద్దన్న..అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ జీవితాన్ని ఒక కొటేషన్ ప్రతిబింబిస్తుంటుంది..అదేంటంటే..‘కఠిన కాలాన్ని ఎదుర్కోవడం అద్భుతమైన అనుభవం. జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభవం పొందాలి’. ఇది ఆయనకెంతో ఇష్టమైన కొటేషన్. ఈ కొటేషన్ లాగానే ట్రంప్ నిజ జీవితంలో ఎన్నో విజయాలు, ప్రశంసలు, ఆత్మీయతలతో పాటు వైఫల్యాలు, వివాదాలు, విమర్శలు, అవహేళనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆయన జీవిత చరిత్ర తెలిసిన వారందరికీ ప్రస్ఫుటంగా అర్థమవుతాయి. అయితే..విజయమైతే ఒకలాగా..అపజయమైతే మరోలా స్వీకరించరు ట్రంప్..ఏదైనా ఒకేలా తీసుకుంటారు. తాను డబ్బు సంపాదించడం కోసం మాత్రం పనిచేయడం లేదని, అలా అనుకుంటే..తన వద్ద కావాల్సినంత డబ్బు ఉందంటారు. నిజానికి కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉందంటారు. ప్రజలకోసం పనిచేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను శ్రమిస్తున్నానని చెబుతుంటారు.

ట్రంప్ తండ్రి లాగానే..ట్రంప్ కు కూడా వ్యాపారం చేయడం అంటే చాలాఇష్టమట. డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14వ తేదీన ఫ్రెడెరిక్ ట్రంప్, మేరీ మెక్ లియడ్ దంపతులకు న్యూయార్క్ లోని క్వీన్స్ లో జన్మించారు. ఫ్రెడ్, మేరీలకు పెళ్లైన 10 సంవత్సరాలకు ట్రంప్ పుట్టాడు. వారికున్న ఐదుగురి సంతానంలో ట్రంప్ నాల్గవవాడు. ఫ్రెడెరిక్ ట్రంప్ క్వీన్స్ లో పేరుమోసిన బిల్డర్ కమ్ రియల్టర్. స్టెటెన్ ఐలాండ్, బ్రూక్లిన్లలో మధ్యతరగతి వారికి అతి చవకైన ధరల్లో అపార్ట్ మెంట్లను నిర్మించి ఇచ్చేవారు. ఫోర్డమ్‌ యూనివర్సిటీ, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైనాన్స్, న్యూయార్క్‌ మిలటరీ అకాడమీల్లో ట్రంప్‌ విద్యనభ్యసించారు. చదువుకునే రోజుల్లో ట్రంప్ మిలటరీ అకాడెమీలో స్టార్‌ అథ్లెట్‌గా, విద్యార్థి నాయకుడిగా నిలిచారు.

తండ్రి తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రాణించాలనుకున్న ట్రంప్..అనుకున్న ఆశయాన్ని సాధించారు. రియల్టీ బిజెనెస్ లోకి దిగిన కొద్దికాలంలోనే ఊహించని విజయాన్నందుకున్నారు. భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. 1980లో న్యూయార్క్‌లో ప్రారంభించిన ‘గ్రాండ్‌ హయత్‌ న్యూయార్క్‌’ ప్రాజెక్టు ఆయనకు గొప్ప డెవలపర్ గా పేరు తెచ్చిపెట్టింది. తర్వాత రియాలిటీ టీవీ స్టార్ గా కూడా ట్రంప్ కీర్తిగడించారు. ది అప్రెంటిస్ పేరుతో ప్రారంభించిన రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ట్రంప్..రిపబ్లికన్ పార్టీలో చేరారు. 2015లో మెజారిటీ ప్రైమరీల్లో, కాకస్‌ల్లో విజయం అనంతరం రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా 2016 ఎన్నికల బరిలో నిలిచి, గెలిచారు.

1987లో ట్రంప్ టోనీ ష్వాజ్ తో కలిసి ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ అనే పుస్తకాన్ని రాశారు.. ఆ పుస్తకంలో తన వ్యాపార విజయ రహస్యాలతో పాటు ఎన్నో విషయాలు తెలిపారు. ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో నిలించింది కానీ..ఎన్ని పుస్తకాలు అమ్ముడయ్యాయన్న విషయంపై ఖచ్చితమైన సమాచారం లేదు. తర్వాత క్రిపుల్డ్ అమెరికా : హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పుస్తకాన్ని రాశారు. 2005లో ట్రంప్ యూనివర్శిటీని ప్రారంభించారు.

ట్రంప్ లవ్ స్టోరీస్..

1977లో ప్రముఖ ఫ్యాషన్ మోడల్ అయిన ఇవానాను డొనాల్డ్ ట్రంప్ వివాహమాడారు. వారికి ముగ్గురు సంతానం. ఒకరు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. 1992లో ఈ దంపతులు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. తర్వాత్ 1993లో నటి మార్లా మేపుల్స్ ను పెళ్లి చేరుకోగా..వారికి టిఫానా అనే కూతురు పుట్టింది. 1999లో మేపుల్స్ కు ట్రంప్ 20 లక్షల డాలర్ల పరిహారం చెల్లించి మళ్లీ విడాకులు తీసుకున్నారు. ఈసారి 2005లో ట్రంప్ తనకన్నా వయసులో 23 ఏళ్లు చిన్నదైన స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్ మెలానియాను పెళ్లి చేసుకున్నారు. 1998లోనే ఒక మోడల్ షో లో ట్రంప్ మెలానియాను చూసి ఇష్టపడినప్పటికీ..ఆమెను ఒప్పించి, మెప్పించి పెళ్లి చేసుకునే సరికి ఏడేళ్లు గడిచిపోయాయి. 2006లో వీరిద్దరికీ కలిగిన సంతానం బారన్ విలియమ్. మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్న ట్రంప్ కు ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లలో ప్రస్తుతం ఇవాంకా ట్రంప్ మాత్రమే ప్రపంచానికి పరిచయస్తురాలు. మొదటి భార్యకు పుట్టిన జూనియర్ ట్రంప్, ఎరిక్ లు ప్రస్తుతం ట్రంప్ ఆర్గనైజేషన్ లో వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు.

Next Story