ట్రంప్ కాన్వాయ్.. అచ్చం జేమ్స్ బాండ్ సినిమాల్లో లాగే..!

By రాణి  Published on  24 Feb 2020 7:40 AM GMT
ట్రంప్ కాన్వాయ్.. అచ్చం జేమ్స్ బాండ్ సినిమాల్లో లాగే..!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి సారి భారత్ కు విచ్చేశారు. ఆయన రాక అంత ఆశామాశీ కాదు కదా..! ఆయన వచ్చాక ఇక్కడ తిరగడానికి ప్రత్యేకమైన వాహనాలు వచ్చాయి. మొత్తం 40 వాహనాలు అమెరికా నుండి భారత్ కు చేరుకున్నాయి. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టుకు వాహనాలు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంతో పాటే చేరుకున్నాయి. ఎయిర్ పోర్టుకు మొతేరా స్టేడియంకు 22 కిలోమీటర్లు కాగా.. ఆయన కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాహనాల లోనే ప్రయాణించనున్నారు.

మొదటగా పైలట్ వాహనాలు ఉండగా.. మొదటి రెండు వాహనాలు ఒకటే రకంగా ఉండనున్నాయి. ఆ రెండింటిలో ఒక వాహనంలో యుఎస్ ప్రెసిడెంట్ ఉండనున్నారు. ఈ రెండు వాహనాలు ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ వాహనాలుగా చెప్పుకోవచ్చు. లగ్జరీ లోనే కాకుండా.. టెక్నాలజీ, శతృ దుర్భేద్యమైనవిగా రూపొందించారు. ఆయన కాన్వాయ్ కోసం ఎన్ని వాహనాలు వాడాలన్నది సెక్యూరిటీ పరంగా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు.

అదే కాన్వాయ్ లో మొదట యుఎస్ సీక్రెట్ సర్వీస్ వ్యాన్స్, మిలటరీ సిబ్బంది ప్రయాణించే వాహనాలు, ప్రెసిడెంట్ కు సంబంధించిన డాక్టర్లు, అలాగే జర్నలిస్టులు.. ప్రైమరీ డిఫెన్స్ కు సంబంధించిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఎలక్ట్రానిక్ కౌంటర్మెజర్స్ వాహనాలు ఉండనున్నాయి. ఆ తర్వాతి వాహనాల్లో కౌంటర్- అటాక్ కమాండోస్ ఉండనున్నారు. కాన్వాయ్ చివరిలో రోడ్ రన్నర్(కమ్యూనికేషన్ కమాండ్ సెంటర్) వాహనాన్ని, ఒక అంబులెన్స్ ను ఉపయోగిస్తారు.

ఈ వాహనాలకు సంబంధించిన సీక్రెట్ లను బయటకు రానివ్వదు అమెరికా. 1936 లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి.రూస్ వెల్ట్ ఓ మోడిఫైడ్ వాహనంలో ప్రయాణించారు. ఆ వాహనం లైఫ్ టైమ్ అయిపోయాక అమెరికా ఆ వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. యుఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనానికి సంబంధించిన తయారీ, అందులో ఉన్న ఆయుధ సంపత్తి, డిఫెన్స్ కు సంబంధించిన సీక్రెట్లను బయటకు రానివ్వకూడదనే వారి ఉద్దేశ్యం.

అమెరికా ప్రెసిడెంట్ ఉపయోగించే 'కార్డిలాక్ వన్'.. ముద్దుగా 'ది బీస్ట్' అని పిలవబడే కారుకు సంబంధించిన స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ కారుకు వాడే అద్దాలు పాలీ కార్బొనేట్స్ తో అయిదు లేయర్లతో రూపొందించింది. ఎన్ని బులెట్లు కాల్చినా చెక్కు చెదరదు. డ్రైవర్ క్యాబిన్ జీపీఎస్ ట్రాకింగ్ సెంటర్ కలిగి ఉంటుంది. కారు డ్రైవర్ గా ఉండాలంటే యుఎస్ సీక్రెట్ సర్వీస్ నుండి ఎన్నో టెస్టులు పాస్ అయ్యి ఉండాలి. ఎన్నో పరీక్షలు పెట్టి.. ఎమర్జెన్సీ సమయాల్లో తప్పించుకోవడం ఎలా.. 180 డిగ్రీల మలుపుల్లో ఎలా డ్రైవింగ్ చేయాలన్నది కూడా నేర్పిస్తారు. ఈ వాహనానికి నైట్ విజన్ కెమెరాలు ఉన్నాయి.. అలాగే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, స్మోక్ స్క్రీన్ డిస్పెన్సర్లు ఉన్నాయి.

జేమ్స్ బాండ్ సినిమాల్లో లాగా.. ఈ కారులో సీక్రెట్ గా గన్నులను ఉంచారు. ఎమర్జెన్సీ సమయాల్లో పంప్ యాక్షన్ షాట్ గన్స్, టియర్ గ్యాస్ కేనన్లు బయటకు వస్తాయి. ఇక కారు బాడీ అయిదు అంగుళాల మిలిటరీ గ్రేడ్ ఆర్మర్ తో రూపొందించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ల తయారీలో ఉపయోగించే కెల్వర్ అనే మెటీరియల్ ను కూడా ఉపయోగిస్తారు. కారు టైర్లకు పంచర్ సమస్య ఉండదు.. ఎలాగైనా నడిపే వీలు ఉంటుంది. కెమికల్ వెపన్స్ తో దాడి చేసినా కూడా 'బీస్ట్' చెక్కుచెదరదు. డైరెక్ట్ మిసైల్ స్ట్రైక్స్ ను కూడా తట్టుకుని నిలబడగలదు. ఆ కారులో ఆక్సిజన్ మాస్కులు, అలాగే ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించడానికి యుఎస్ ప్రెసిడెంట్ బ్లడ్ గ్రూప్ కు సంబంధించిన బ్లడ్ పాకెట్లను కూడా అక్కడే ఉంచనున్నారు.

రోడ్ రన్నర్ :

ఈ వాహనాన్ని MC2V గా పిలుస్తారు. మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ వెహికల్ ను అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కాన్వాయ్ కు సంబంధించిన కమ్యూనికేషన్ ను ఇక్కడి నుండే ఆపరేట్ చేస్తారు. వైస్ ప్రెసిడెంట్ తోనూ మిలిటరీ జాయింట్ ఛీఫ్ లతోనూ ఎప్పటికప్పుడు టచ్ లో ఉండడానికి మిలిటరీ శాటిలైట్ రోడ్ రన్నర్ తో అనుసంధానమై ఉంటుంది.

వాచ్ టవర్ :

ఈ ఫోర్డ్ ట్రక్ ను ట్రంప్ కాన్వాయ్ సెక్యూరిటీ విషయంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మిసైల్స్, గ్రెనెడ్స్, ఐఈడీ వంటి వాటిని ధీటుగా అడ్డుకోగలదు. వాహనం లోని ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్లు ఐఈడీ, మిసైల్ అటాక్ లకు సంబంధించిన రేడియో ఫ్రీక్వెన్సీని జామ్ చేయగలదు. అలాగే రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లను కూడా పసిగట్టగలదు. ఎవరైనా అటాక్ చేసిన సమయంలో ఈ కారు ఇన్ఫ్రారెడ్ స్మోక్ గ్రెనేడ్లను లాంచ్ చేయగలదు.. అలా చేసి ప్రెసిడెంట్ కార్ ను తప్పించగలదు.

హాక్ ఐ రెనిగేడ్:

ఈ వాహనం యుఎస్ సీక్రెట్ సర్వీస్ కమాండోలను మోసుకుని వెళుతోంది. అమెరికా ప్రెసిడెంట్ కోసం కౌంటర్ అసాల్ట్ టీమ్ ను ఫామ్ చేయగలదు. ఈ షెవర్లే వాహనంలో నుండి ఎక్కువ ఆయుధాలు కలిగి ఉన్న కమాండోలు దిగడానికి వెనుక డోర్ కూడా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. అసాల్ట్ రైఫిల్స్ ఈ కమాండోల చేతుల్లో ఉంటాయి. ఎటువంటి సమయంలో అయినా ప్రెసిడెంట్ ను కాపాడడమే వీరి బాధ్యత.

'బీస్ట్' ను తాజ్ మహల్ దగ్గరకు తీసుకు వచ్చే అవకాశం లేదా..?

రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం తాజ్ మహల్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. అందుకే తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో డీజిల్ వాహనాలను బ్యాన్ చేశారు. మంగళవారం నాడు తాజ్ మహల్ ను ట్రంప్ సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో 'బీస్ట్' డీజిల్ ఇంజన్ ఉన్న వాహనం కావడంతో అక్కడికి తీసుకొని వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 1998 లోనే సుప్రీం కోర్టు తాజ్ మహల్ కు దగ్గరగా నాన్-ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొని రాకూడదని ఆజ్ఞలు జారీ చేసింది. చివరిసారిగా అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తాజ్ మహల్ సందర్శనకు వచ్చిన సమయంలో ఎలెక్ట్రిక్ బస్ ను వాడారు.. ఇప్పుడు ట్రంప్ కూడా ఎలెక్ట్రిక్ వాహనంలో వస్తారా లేక.. తన 'బీస్ట్' వాహనంలో వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Next Story