ముఖ్యాంశాలు

  • భూ వివాదంలో వాచ్ మన్ భార్య పై లైంగిక దాడి
  • కేసు నమోదు చేయకుండా నేతలకు సహకరించిన పోలీసులు ?
  • గాంధీలో చికిత్స పొందుతూ వాచ్ మన్ మృతి
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్
  • ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతల మండిపాటు

హైదరాబాద్ : టీఆర్ఎస్ లోకల్ లీడర్లు టి.మాధవ్ రెడ్డి, ఎస్.మాధవ్ రెడ్డి కాపలాదారు శరణప్పకు నిప్పంటించి సజీవ దహనం చేసి, అతని భార్యను లైంగికంగా వేధించారన్న సంచలనాత్మక వార్త ప్రస్తుతం రాష్ట్రాన్ని కదిలిస్తోంది. పోలీస్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వారినుంచి ఘటన పూర్వాపరాలకు సంబంధించిన సమాచారాన్ని రాబడుతున్నట్టుగా తెలుస్తోంది.

బోయిన్ పల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు టీఆర్ఎస్ నేతలు టి.మాధవ్ రెడ్డి, ఎస్.మాధవ్ రెడ్డి ఒక భూ వివాదానికి సంబంధించి కాపలాదారు శరణప్ప (40) భార్యపై ఈనెల 7వ తేదీన లైంగిక దాడికి పాల్పడ్డారని, అడ్డువచ్చిన కాపలాదారు శరణప్పను దారుణంగా కొట్టి, హింసించి, సజీవ దహనం చేశారని గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాంధీ ఆసుపత్రిలో 45 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడిన కాపలాదారు శరణప్ప మృతిచెందడంతో ఈ విషయం బయటపడింది. వాచ్ మన్ కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో మరణించిన విషయాన్ని బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ సి.అంజయ్య ధృవీకరించారు. నిందితులిద్దరినీ వారి అనుచరులతోపాటు త్వరలోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అంజయ్య చెబుతున్నారు. కానీ పోలీస్ విభాగంలోని విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారనీ, ఘటన పూర్వాపరాలగురించి విచారిస్తున్నారనీ తెలుస్తోంది.

  • పోలీసులు టీఆర్ఎస్ నేతల బాడీగార్డులు

కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క వాచ్ మన్ మృతి సమాచారం అందగానే గాంధీ ఆసుపత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీఆర్ఎస్ నేతల దురాగతాన్ని సభ్యసమాజం ఖండించి తీరాలంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో పోలీసులు కేవలం టీఆర్ఎస్ నేతల రక్షణకోసం మాత్రమే పనిచేస్తున్నారనీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణమైన స్థితికి చేరుకుందని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. వాచ్ మన్ ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయినప్పటికీ కనీసం అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒక్క టీఆర్ఎస్ నేత కూడా రాలేదన్నారు భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ అధినేతల్లో ఏ ఒక్క నేత తలచుకున్నా ఇంత దారుణం జరుగకుండా ఆపగలిగేవారని, ఇప్పటికైనా టీఆర్ఎస్ అధిష్ఠానం కళ్లు తెరచి కింది స్థాయి నేతలు, కార్యకర్తల దారుణాలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాచ్ మన్ భార్యపై లైంగిక దాడి, వాచ్ మన్ సజీవ దహనం ఘటనలను బి.జె.పి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో పోలీసులు సామాన్యుల రక్షణను మర్చిపోయి కేవలం టీఆర్ఎస్ నేతలకు బాడీ గార్డులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ అగ్రనేతలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా?నిందితులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో జాప్యం చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

భూ పంచాయతీకి సంబంధించి వివాదంలో ఉన్న స్థలం ప్రహరీని కూలగొట్టేందుకు నిందితులిద్దరూ వెళ్లినప్పుడు వాళ్లపై చర్యలు తీసుకునే సాహసం బోయిన్ పల్లి పోలీసులకు లేకపోయిందని, పైగా నిందితుల్ని వెనకేసుకొచ్చే రీతిలో పోలీసులు వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇద్దరు నిందితులు వాచ్ మన్ ని దారుణంగా కొట్టి, హింసించి, అతని భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డారని, బాధితులు కేసు పెట్టేందుకు పోలీస్టేషన్ కి వెళ్లినప్పుడు పోలీసులు ఏమాత్రం వాళ్లకు సహకరించలేదని, ఫిర్యాదును స్వీకరించడంలో తీవ్ర జాప్యం చేశారని, నిందితులపై ఎలాంటి చర్యా తీసుకోలేదని అంటున్నారు. మరుసటి రోజు మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్ గౌడ్ కుమారుడి పెళ్లి ఉందని చెప్పిన పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితులపై కేసు నమోదు చేయడాన్ని ఆలస్యం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమపై కేసు పెట్టేందుకు సాహసించారన్న కోపంతో ఇద్దరు నిందితులు రాత్రిపూట వాచ్ మన్ ఇంటికి వెళ్లి వారిపై దాడిచేసి వాచ్ మన్ ను సజీవ దహనం చేశారని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిందితులపై ఎలాంటి చర్యా తీసుకోకూడదంటూ పోలీసులపై ఇద్దరు స్థానిక టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్టుగా సమాచారం అందిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ఈ వార్తల్ని ఖండించారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, కేసు నమోదు చేయడంలో జాప్యం, నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశామని వచ్చిన వార్తలు అవాస్తవాలని వారు వెల్లడించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.