నిన్న మొన్నటి వరకూ యూత్ కి పబ్జీ పిచ్చి. ఈ గేమ్ యూత్ పై ఎంత ప్రభావం చూపించిందో దాదాపు అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు కూడా ఈ పిచ్చి వదలని వారు కూడా ఉన్నారు. పబ్జీలో గేమ్ ఆడుతూనే ఫ్రెండ్స్ తో వాయిస్ ఛాట్ చేస్తూ..గేమ్ లో ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని చంపి..ఆనందాన్ని పొందుతున్నారు. ఇంట్లో వారేమన్నా చెవికి పట్టనట్లే వదిలేస్తున్నారు. అదేమంటే..పబ్జీ గేమ్ విన్ అయితే చికెన్ డిన్నర్ వస్తుందని వింతగా మాట్లాడుతున్నారు..అదేదో నిజంగానే ఖర్చు లేకుండా భోజనం చేసినంత అనుభూతి చెందుతున్నారంటే అతిశయోక్తి కాదనుకోండి.

పబ్జీ మనిషి బ్రెయిన్ మీద ప్రభావం చూపితే..ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ట్రిప్పింగ్ జంప్ ఛాలెంజ్ ఏకంగా ప్రాణాల్నే తీసేస్తోంది. ఈ ఛాలెంజ్ ఎవరు చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియడం లేదు గానీ..పిల్లలు మాత్రం తమకు వచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి..ట్రిప్పింగ్ జంప్ చేసేస్తున్నారు.

ట్రిప్పింగ్ జంప్ అంటే ఏంటనే కదా మీ అనుమానం. ముగ్గురు వ్యక్తులు ఒకరి పక్కన ఒకరు నిల్చుంటారు. మధ్యలో వ్యక్తికి ఈ ఛాలెంజ్ గురించి ముందే చెప్పరు. వారి పక్కనున్న ఇద్దరు ఒకసారి జంప్ చేస్తారు. వారిద్దరినీ చూసిన మధ్యలో వ్యక్తి వారికన్నా ఎక్కువ ఎత్తు జంప్ చేయాలని భావించి రెండు కాళ్లతో జంప్ చేయగానే పక్కనున్న ఇద్దరు వ్యక్తులు మధ్యలో వ్యక్తి కాళ్లను ముందుకు తన్నేస్తారు. దీంతో ఆ వ్యక్తి కిందపడిపోతాడు. ఇలాంటి వీడియోలు చేసి ప్రాణాలు పోగొట్టున్నవారు లేరని మాత్రం చెప్పలేము.

ఇటీవలే జర్నీ బోనర్ అనే 10 ఏళ్ల బాలిక గతవారం ఇలాంటి ఆటే ఆడిన తనకు చేదు అనుభవం ఎదురైందని ఒక మీడియాకు తెలిపింది. ఈ ట్రిప్పింగ్ ఛాలెంజ్ లో బోనర్ తల వెనుక భాగంలో పెద్ద దెబ్బ తగిలింది. నిజానికి తన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో తెలియదని, ఏదో వీడియో కోసం అలా చేయమన్నారనుకున్నానని పేర్కొంది. కానీ ఇలా జరుగుతుందనుకోలేదని బోనర్ వెల్లడించింది. ఏదేమైనా ఇలాంటి వీడియోలు చేయడం ప్రాణాలకే ప్రమాదమని జర్నీ బోనర్ తల్లి చెబుతోంది. తన కూతురు ట్రిప్పింగ్ వీడియో చేసి పడిపోయిందని స్కూల్ నర్స్ చెప్పేంతవరకూ తమకేమీ తెలియదని పేర్కొంది. ఆ వీడియో చూసేంత వరకూ తనకు ఆ ఛాలెంజ్ ఏమిటో అర్థంకాలేదని తెలిపింది. వీడియో చూశాక తనకు గుండె ఆగినంత పనైందని చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోలు

తాజాగా ఇలాంటి వీడియోలు రెండు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియో ముగ్గురు అబ్బాయిలు కలిసి చేసిన ట్రిప్పింగ్ ఛాలెంజ్ లో మధ్యలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మరొక వీడియోలో ముగ్గురు అమ్మాయిలు చేసిన ట్రిప్పింగ్ ఛాలెంజ్ లో మధ్యలో అమ్మాయికి నడుము లేదా..తలకు గాయమైనట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేయడం చాలా సరదా అయిపోయింది. ఇందుకు టిక్ టాక్ ను వేదికగా వాడుకుంటోంది యువత. టిక్ టాక్ లో చేసే ప్రాంక్ వీడియోలను చూసి ఇన్స్ఫైర్ అయిన వారు కూడా అలాగే వీడియోలు చేసి అందులో పోస్ట్ చేస్తుంటారు. అలా మొదలైందే..ఈ ట్రిప్పింగ్ జంప్ ఛాలెంజ్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా యువత మీద మంచి కన్నా చెడే ఎక్కువగా ప్రభావం చూపుతుందనడానికి ఇదొక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.